పెళ్లిలో అప్పగింతల ప్రత్యేకత ఇదే..

Newlyweds Maintain Celibacy For 3 Days - Sakshi

షోడశ సంస్కారాలు– వివాహం

వివాహమైన పిదప, వధూవరులు మూడు రాత్రులు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత, పెద్దలను ఆహ్వానించి, అక్కడ గణపతి పూజ, అష్టదిక్పాలక పూజ, ఇంటి ఇలవేల్పుల పూజలు చేసి, సభలోని పెద్దలను కూడా పూజించి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనినే సదస్యం అంటారు. ఆ తర్వాత, అగ్ని, ప్రజాపతి మొదలగు దేవతలకు శేష హోమం చెయ్యాలి. తర్వాత, నాకబలి ఆచరించాలి. ఈ నాకబలే లోకవాడుకలో నాగవల్లి అయింది. ఇందులో సకలదేవతలకు బలులు అర్పిస్తారు. తర్వాత శేష హోమం చేయగా మిగిలిన ఆజ్యాన్ని వధూవరుల శిరస్సుపై కొద్దిగా ఉంచి ఆశీర్వదించాలి.

తదుపరి, కొద్దిగా ఆజ్యాన్ని వరుడు తన చేతితో తీసుకుని, వధూవరుల హృదయాలను స్పృశించాలి. దీనినే హృదయ సంసర్గం అంటారు. ఇందులో వధూవరుల హృదయాలు రెండూ ఒక అనుబంధంగా పెనవేసుకుని ఒకరికొకరుగా జీవించాలని దేవతలను ఈ విధంగా కోరుకుంటారు. ‘విశ్వేదేవతలు మన హృదయాలను స్నేహంతో పెనవేయుదురుగాక, జలం, వాయువు, ధాత మన హృదయాలను కలిపి ఉంచుదురుగాక. సరస్వతి మనకు అనుకూల సంభాషణ చేయించునుగాక. పుత్ర, సంతాన కారకుడగు త్వష్ట ప్రజాపతి నా శరీరమునందు ప్రవేశించి, మనం బహు పుత్రవంతులమగునట్లు మమ్ములను సంతానవంతులను చేయునుగాక. అర్యముడు మమ్ములను స్నేహితులుగానే వుండునట్లు చేయును గాక. ఓ వధూ..! నీవు సౌభాగ్యవతివై, నా గృహమందు నివసించు. మా రెండు పాదాలు గల, నాలుగు పాదాలుగల జంతువులు సుఖంగా వుండునుగాక’. తర్వాత, వివాహమైన నాల్గవరోజు రాత్రి వధూవరుల కంకణాలను విప్పుతారు.  

తదుపరి, అక్కడవున్నవారిలో పెద్ద దంపతులకు, నూతన వధూవరులు తాంబూలమిచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత కన్యాదాత, తన కుమార్తెను, మెట్టినింటివారి వావి వరుసలతో వారిని తనకు పరిచయం చేస్తూ, వధువు చేతిని పాలలో ముంచి ఆ చేతిని వరుని చేతిలో పెట్టి మెట్టినింటివారికి అప్పగిస్తాడు. దీనినే అప్పగింతలు అంటారు. ఇంతటితో వివాహ క్రతువు ముగిసి, వరుడు సర్వధర్మాలకు ఆలంబనమైన గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు.
– ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు

చదవండి: షూట్‌ చేస్తే..రంగు పడుద్ది!

కాస్త శ్రద్ధ పెడితే కేంద్ర కొలువు మీ సొంతం!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top