ఫస్టు నుంచి చూద్దాం!

New Year resolution to quit an addiction is about more than stopping the act of smoking, drinking - Sakshi

ఆ మాటే వద్దు.. ఇవ్వాళే మొదలెట్టండి! ‘న్యూ ఇయర్‌ రానీ’ అంటారు కొందరు. ‘జనవరి 1 నుంచి అంతా మార్చేస్తా’ అంటుంటారు ఇంకొందరు. ‘లాస్ట్‌ ఇయర్‌ వేస్ట్‌గా పోయింది. ఈ ఇయర్‌ జిమ్‌ను కేక పెట్టిస్తా’... మనం ఫిట్‌గా ఉండటానికి న్యూ ఇయరే రావాలా? మంచి అలవాటుకు ప్రతిరోజూ మంచిరోజే.   నిపుణుల అభిప్రాయం ఏమిటంటే జనవరి 1 కంటే నవంబర్, డిసెంబర్‌లలో ఫిట్‌నెస్‌ సంకల్పం తీసుకుంటున్నవారు బెటర్‌గా మాటకు కట్టుబడుతున్నారని. ఒకటి దాకా ఆగొద్దు. ఇవాళ్టితో కదుల్దాం ముందుకు.

అందరి షూ ర్యాక్‌లో దుమ్ము పట్టిన వాకింగ్‌ షూస్‌ ఉంటాయి. అవి గత సంవత్సరం జనవరి నెలలో కొన్నవి. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, వాకింగ్‌ చేయాలనుకుని కొన్నవి అవి. ఆ వాకింగ్‌ ఎన్ని రోజులు సాగిందో. ప్రస్తుతం అవి దుమ్ముకొట్టుకుని, పట్టించుకునే యజమాని కోసం ఎదురు చూస్తూ అలా పడి ఉంటాయి.

ఆ దారిన వెళుతున్నప్పుడల్లా ఆ జిమ్‌ కనిపిస్తూనే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వెళ్లి మూడో నెల నుంచి మానేసిన జిమ్‌. ట్రైనర్‌ ఇప్పటికీ ఫోన్‌ చేస్తుంటాడు. జిమ్‌ నుంచి అలెర్ట్‌ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. గత సంవత్సరం కంటిన్యూ చేయలేదు కాని ఈ సంవత్సరం మళ్లీ చేరి కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారు కొందరు.

ఉదయం వాకింగ్‌ ఫ్రెండ్స్‌ వాకింగ్‌ చేస్తూనే ఉంటారు. మనం వారు కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటాం. నాలుగు రోజుల సింగారంగా మన వాకింగ్‌ ముగిసిపోయి ఉంటుంది. ‘న్యూ ఇయర్‌ రానివ్వండి. జాయిన్‌ అవుతాను’ అని వాళ్లు కనిపించినప్పుడల్లా అంటూనే ఉంటారు.

తక్షణం అవశ్యం ఆరోగ్యం
‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ‘తక్షణం అవశ్యం ఆరోగ్యం’ అనుకోవాలి విజ్ఞులు. ఇవాళ రేపట్లో మనం ఏం తింటున్నామో అందరికీ తెలుసు. విషం. మందులు విషం. కల్తీ గాలి. అయితే పరిగెత్తి చేసే ఉద్యోగాలు లేదా తిష్ట వేసినట్టుగా కదలక కూచుని చేసే కొలువులు... ఆరోగ్యం ఎలా? వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు నెరవేరాలంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకు ప్రయత్నం ముఖ్యం. అక్కడే వస్తుంది చిక్కు. ‘ఆరంభించరు నీచ మానవులు’ అని భర్తృహరి అన్నాడుకాని ‘ఆరంభించడానికి వేచి చూస్తారు సోమరి పోతులు’ అనాలి నిజానికైతే. ‘జనవరి 1 వస్తేనే ఆరంభిస్తా’ అనుకుంటే జనవరి 1 వస్తేనే భోం చేస్తా అనుకోరు ఎందుకో.

ఫ్రెష్‌ స్టార్ట్‌ ఎఫెక్ట్‌
జనవరి 1 అంటే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్‌ మారుతుంది. అన్నిచోట్ల ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. కనుక కొత్తగా నిర్ణయాలను అమలు చేద్దాం అని చాలామంది అనుకుంటారు. దీనిని ఫ్రెష్‌ స్టార్ట్‌ ఎఫెక్ట్‌ అంటారు. అయితే డాక్టర్‌ జాన్‌ నార్‌క్రాస్‌ అనే సైకాలజీ ప్రొఫెసర్‌ ఇలా న్యూ ఇయర్‌ నిర్ణయాలు తీసుకుంటున్నవారిని గత 40 ఏళ్లుగా పరిశీలిస్తూ ఏమని తేల్చాడంటే– సాధారణంగా న్యూ ఇయర్‌ నిర్ణయాలలో ముఖ్యమైనవి 2. మొదటిది ఫిట్‌నెస్‌ సాధించడం, రెండోది బరువు తగ్గడం. ఫిట్‌నెస్‌ సాధించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఒక నెల రోజుల్లో సగానికి సగం మంది వ్యాయామం ఆపేస్తున్నారు. ఆరు నెలల్లో తొంభై శాతం మంది. పది శాతం మందే న్యూ ఇయర్‌ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం ఎందుకు నీరుగారి పోవడం ఎందుకు?

మంచి సీజన్‌
అమెరికా, బ్రిటన్‌లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జిమ్‌లు కిటకిటలాడతాయి. నవంబర్, డిసెంబర్‌ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. కొత్త సంవత్సరం ఉత్సాహం, నిర్ణయం నిలబడకపోవడమే కారణం. నిపుణులు ఏమంటున్నారంటే మీరు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు ఉత్సాహం గా ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అని. ఉదాహరణకు మనకు వేసవి కాలం ఉత్సాహంగా అనిపిస్తే అప్పుడు మొదలెట్టి కొనసాగించాలి. లేదా నవంబర్‌ మంచి సీజన్‌ అనుకుంటే మొదలెట్టాలి. అమెరికాలో జనవరి నెల చలిలో మొదలెట్టే వ్యాయామాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని తేల్చారు. మన దగ్గర కూడా జనవరి చలి. ఆ చలిలో ఉదయాన్నే లేవలేక న్యూ ఇయర్‌ రెజల్యూషన్‌ పాటించడం లేదని బాధపడి... ఇదంతా ఎందుకు? ఈ రోజు నుంచే మొదలెట్టొచ్చు కదా.

ముఖ్యం... చాలా ముఖ్యం
ఆరోగ్యం కోసం కష్టపడటం ముఖ్యం. చాలా ముఖ్యం. ఏదో ఒక మంచి సందర్భంలో వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఆల్కహాల్‌ తగ్గిస్తాను, స్మోకింగ్‌ మానేస్తాను, ఫేస్‌బుక్‌ కట్టేస్తాను, పిల్లలతో గడుపుతాను, యోగా చేస్తాను, నాన్‌వెజ్‌ వారంలో ఒక్కరోజే... ఇలా ఏ మంచి నిర్ణయమైనా మీకు మేలు చేస్తుంది.
నేటి మీ నిర్ణయం రేపు మీ యోగం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top