మనిషి ధ్యాసను అంతర్ముఖంగా తీసుకువెళ్లి వారి చిత్తాన్ని వారి శరీరంలోనే వున్న పరమాత్మ శక్తి అయిన ఆత్మ మీదకు మళ్లించగలిగితే మనిషి ఆధ్యాత్మికత పరిపక్వం చెంది, అతనిలో పరివర్తన వచ్చి చిన్నతనంలో తనలో స్వాభావికంగా వున్న దైవికమైన పసితనపు అమాయకత్వాన్ని తిరిగి స్థిర పరచవచ్చు, తద్వారా అతనిని సమతుల్యతలో ఉంచవచ్చు అని తలచారు మాతాజీ నిర్మలాదేవి.
అదెలా సాధ్యపడుతుందంటే మన శరీరంలోనే అంతర్గతంగా భగవంతుని శక్తి ఒకటి నిక్షిప్తమై ఉంది. అదే కుండలినీ శక్తి. తల్లి గర్భంలో సుమారు 2–3 నెలల వయస్సు వున్న సమయంలో పసిపిల్లవాని తల మాడుభాగాన వున్న బ్రహ్మరంధ్రం ద్వారా పరమాత్మ శక్తి ప్రవేశించి వెన్నెముక భాగాన 3 నాడులుగాను, 7 చక్రాలుగాను ఏర్పడి మిగిలిన శక్తి వెన్నెముక చివరన వున్న త్రికోణాకారపు ఎముక (సాక్రమ్ బోన్)లో మూడున్నర చుట్లు చుట్టుకుని ఉంటుంది.
అదే కుండలినీ శక్తి. పిల్లలలోని ఆ శక్తి వారికి 9–10 సం. వయసు వరకు వారి వెన్నెముక ద్వారా ఊర్థ్వముఖంగా ప్రయాణిస్తూ బాహ్యపరంగా ఉన్న పరమాత్మ ప్రేమ శక్తితో అనుసంధానమవుతూవుంటుంది. ఆ వయసులో పిల్లలు భగవంతుని రక్షణలోనే వుంటారు. క్రమేపీ అది తిరిగి సాక్రమ్ బోన్ లోకి వెళ్ళి నిద్రాణ స్థితిలో వుండిపోతుంది.
అలా నిద్రాణ స్థితిలోకి వెళ్ళి΄ోయిన ఈ కుండలినీ శక్తిని తిరిగి జాగృతి చేసి ఉత్థానపరచి శిరస్సుమీద వున్న సహస్రార చక్రాన్ని ఛేదించి బాహ్యపరంగా వున్న పరమాత్మ ప్రేమశక్తి అయిన విశ్వవ్యాపిత పరమ చైతన్యశక్తితో అనుసంధానపరచగలిగితే మనిషి మరలా తనలో దైవత్వాన్ని నింపుకోగలుగుతాడు. అప్పుడిక మానవులు ఎదుర్కొనే ఈ శారీరిక, భౌతిక, మానసిక, భావోద్వేగ, సమస్యలకు తావే వుండదు. వారిలో వివేకం, మంచి చెడుల విచక్షణా జ్ఞానం స్థిరపడి, వారి ఆలోచనలలో, జీవన విధానంలో, ప్రవర్తనలో, అవగాహనలో సమతుల్యత ఏర్పడి ప్రపంచమంతా మనం కోరుకున్న విశ్వమానవ సౌభ్రాతృత్వం, వసుదైక కుటుంబం ఏర్పడి విశ్వనిర్మల ధర్మం స్థిరపడుతుంది అని శ్రీమాతాజీ నిర్మలాదేవి ఒక నిర్ణయానికి వచ్చారు. మానవులు తమ మూర్ఖత్వం వలన లేక అంధ విశ్వాసాల వలన భగవంతుని సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే పరిస్థితి వస్తే చాలా ప్రమాదానికి, భవంతుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది అని గ్రహించి అందుకు ఒకే ఒక పరిష్కారం మనిషి లోని కుండలినీ శక్తిని తిరిగి జాగృత పరిచి తద్వారా ఆత్మసాక్షాత్కారానికి పాదుకొల్పడం సాధ్యమవుతుందని తెలుసుకున్నారు.
ఇంతకు పూర్వం కుండలినీ జాగృతి కావాలంటే సర్వస్వం త్యాగం చేసి అడవులకో, హిమాలయాలకో వెళ్ళి వందల సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తేగాని దొరకని భాగ్యం అది. ఈ ఆధునిక కాలంలో అది అసాధ్యం. మనిషి ఏ త్యాగమూ చేయనవసరం లేకుండా, దేనినీ పరిత్యజించనవసరం లేకుండా తన రోజువారీ జీవితానికి ఏ ఆటంకం లేకుండా ఈ కార్యం నిర్వహించడానికి, ఆత్మసాక్షాత్కారం ΄÷ందడానికి ఏదైనా మార్గం కనుగొనాలని శ్రీమతి నిర్మలాదేవి నిశ్చయించుకున్నారు. అది కూడా 1970వ సంవత్సరం మే 6వ తారీఖు లోపునే జరగాలని అనుకున్నారు. వెంటనే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న నార్గోల్ సముద్రతీరాన ఓ సరుగుడు చెట్టు చెంతనకూర్చుని ఒక రాత్రంతా సుదీర్ఘ ధ్యానం (తపస్సు)లో వున్నారు.
అంతే! మే నెల 5వ తేదీ తెల్లవారు ఝామున శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం ఒక్కసారిగా తెరుచుకుంది. భూమినుండి ఒక్కసారిగా భూగర్భజలం ఉవ్వెత్తున ఆకాశం వైపు అతి వేగంగా లేచినట్లుగా తనలోని కుండలినీ శక్తి ఉత్థానం జరిగి మాడు మీద బ్రహ్మరంధ్రం ఛేదించుకుని ఆకాశంలోకి ఒక కాంతిపుంజం చక్రాల గుండా ప్రయాణించి 7 రంగుల హరివిల్లులా వెదజల్లబడింది. శ్రీమాతాజీ మాటల్లో చెప్పాలంటే ఒక రాకెట్టును అంతరిక్షంలోకి పంపినప్పుడు అది ఒక్కొక్క ఛాంబర్‌ను నెట్టుకుంటూ అత్యంత వేగంతో, నిప్పులు కక్కుకుంటూ, రంగురంగుల వెలుగులు విరజిమ్ముతూ ఆకాశంలోనికి ఎలా దూసు కెళుతుందో అలాంటి అనుభూతే కలిగిందన్నారు. ఇది ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అద్వితీయ, అపురూప ఘట్టం. మానవ మాత్రులకు ఇది అసాధ్యం అనుకున్న కార్యం సుసాధ్యం అయ్యిందని శ్రీ మాతాజీ నిర్మలాదేవి పేర్కొన్నారు.
ఇంతకుముందు చెప్పినట్లుగా 1970 మే 5 తేదీన ముంబైకి దగ్గరలో గుజరాత్ రాష్ట్రం పరిధిలో వున్న నార్గోల్ సముద్ర తీరాన శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహస్రార చక్రం తెరచిన సహస్రారధామ్ అనే ఆ స్థలాన్ని పుణ్యస్థలిగా భావించి ప్రతి ఏటా మే 5 తేదీన ప్రపంచవ్యాప్తంగా సహజయోగ సాధకులందరు దీనిని సహస్రార దినోత్సవంగా జరుపుకుంటారు. సహజయోగ సాధన చేస్తున్నవారు తమ శారీరిక, మానసిక, భావోద్వేగ బాధలనుండి, సమస్యలనుండి సునాయసంగా స్వాంతన పొందుతున్నారు. సహజయోగం పూర్తిగా ఉచితం.
– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులు


