ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం | Natural menopause among women below 50 years in India | Sakshi
Sakshi News home page

ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం

Apr 10 2025 1:02 AM | Updated on Apr 10 2025 11:58 AM

Natural menopause among women below 50 years in India

2026 కల్లా దేశంలో దాదాపు 40 కోట్ల మంది మహిళలు మెనోపాజ్‌ దశకు చేరుకోనున్నారని  అంచనా!

ప్యూబర్టీ, మాతృత్వంలాగే  స్త్రీ జీవితంలో మెనోపాజ్‌ కూడా శారీరక, మానసిక మార్పులతో కూడిన సహజమైన దశ! అయితే... ఇది సాఫీగా సాగిపోయే దశ కాదు. కొన్ని హార్మోన్ల ఉత్పత్తి మందగించి ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. అవి స్త్రీ దైనందిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఇంత తీవ్రమైన అంశం మన సాంస్కృతిక నేపథ్యం కారణంగా సైలెంట్‌గా ఉండిపోయింది. 

ఆ సైలెన్స్‌ మెనోపాజ్‌ మీద అవగాహన కొరవడేలా చేస్తాయి. ఎంతలా అంటే  సమాజం సంగతి అటుంచి మెనోపాజ్‌ ఎఫెక్ట్స్‌ మీద ఆ దశను అనుభవిస్తున్న స్త్రీలకే తెలియనంతగా! అందుకే ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి... మెనోపాజ్‌ మీద విస్తృతమైన చర్చ కొనసాగాలి.  అప్పుడే సమాజం ఆమెను అర్థం చేసుకోగలుగుతుంది. తన వంతు మద్దతు అందించగలుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నేటి నుంచి సాక్షి ఫ్యామిలీలో మెనోపాజ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది.

‘నేనిప్పుడు ఫ్రిజ్‌ డోర్‌ ఎందుకు తెరిచానబ్బా..?’ ఎంత చించుకున్నా అరుంధతికి గుర్తు రావడం లేదు. ‘ముందిక్కడి నుంచి వెళ్లు...’ చిన్న విషయానికే పెద్దగా అరిచేసింది ప్రతిమ. కంగుతిన్నాడు భర్త. ఆఫీస్‌లో సీరియస్‌ వర్క్‌లో ఉన్న అపర్ణ ఒక్క ఉదుటన లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్వసాగింది. ఎందుకంత దుఃఖం వచ్చిందో తెలియదు ఆమెకు. పనిమీద ఏకాగ్రత కుదరట్లేదు వైశాలికి. 

మాలతికి జాయింట్‌ పెయిన్స్, నీలిమకు నీరసంగా, నిస్సత్తువగా ఉంటోంది. విజయ డిప్రెసివ్‌గా ఫీలవుతోంది. దిగులు వెంటాడుతోంది. కారణం లేకుండానే ఆందోళన చెందుతోంది ప్రేమ. జీవనాసక్తి లేదు. గిరిజ అయితే కళావిహీనంగా మారిపోయింది. రజితకు ఉన్నట్టుండి వేడి ఆవిర్లు వస్తున్నాయి. క్షణంలో జ్వరమొచ్చినట్టుగా అయిపోతోంది. వీణకు నిద్ర కరవైంది. దాంపత్య జీవితం పట్లా ఆసక్తి పోయింది. దాంతో భర్త ఆమెను సాధిస్తూ తన అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నాడు.

పైన చెప్పిన మహిళలవే కాదు 40– 50 మధ్య వయస్సు వనితలందరివీ దాదాపు అవే సమస్యలు!  మెనోపాజ్‌ ఎఫెక్ట్స్‌! చిత్రవిచిత్రమైన ఆ పరిస్థితి అనుభవిస్తున్న వాళ్లకే అర్థంకాకపోతే కుటుంబ సభ్యులు, ఆఫీస్‌ సిబ్బందికేం అర్థమవుతుంది.. వాళ్ల సహకారమెలా అందుతుంది! దీని మీద అవగాహన కల్పించేందుకు రమావైద్య, ఊర్వశి ఝా అనే వైద్యులు 1995 (ముంబై)లోనే తమ ప్రయత్నాన్నిప్రారంభించారు ‘ద ఇండియన్‌ మెనోపాజ్‌ సొసైటీ’ని స్థాపించడం ద్వారా ఇది ఇప్పటికీ తన సేవలను అందిస్తూనే ఉంది. 

జర్నలిస్ట్, రచయిత, మహిళా హక్కుల కార్యకర్త శైలీ చోప్రా కూడా ‘మెనోపాజ్‌’ మీద అవగాహన కల్పించేందుకు, దానికి సంబంధించిన మెడికల్‌ కేర్, కమ్యూనిటీ సపోర్ట్‌ను కూడగట్టేందుకు ఉద్యమిస్తున్నారు. మెనోపాజ్‌కి సంబంధించి విప్లవమే రావాలి అంటూ ఆమె రోడ్‌ షోస్‌ చేస్తున్నారు. గైనకాలజిస్ట్‌ల ప్రకారం వరుసగా పన్నెండు నెలలు నెలసరి రాకపోతే మెనోపాజ్‌ వచ్చినట్టే! రుతుక్రమంలోని స్త్రీలు తప్పించుకోలేని దశ అది! కానీ మన సాంస్కృతిక నేపథ్యం దీనిగురించి మాట్లాడనివ్వకుండా చేస్తోంది. దానిమీద విస్తృతమైన చర్చ జరిగితేనే అదో వినకూడని మాటలా కాకుండా సాధారణమైన అంశగా మారుతుంది.

 మెనోపాజ్‌ ఫేజ్‌లోని మహిళల శారీరక, మానసిక ఆరోగ్యం గురించి ఆలోచన మొదలవుతుంది. ఆ దశలో వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం మొదలు శారీరక వ్యాయామం, ధ్యానం, ఎమోషనల్‌ బ్యాలెన్స్‌ లాంటివాటి మీద ఎరుక వస్తుంది. అప్పుడే మెనోపాజ్‌ ప్రభావాన్ని స్త్రీ సమర్థంగా ఎదుర్కోగలదు. ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ సాక్షి ఫ్యామిలీ కూడా శారీరక, మానసిక వైద్యనిపుణుల విశ్లేషణలు, వివరాలు, సలహాలు, సూచనలతో నేటినుంచి మెనోపాజ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను మొదలుపెడుతోంది.

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 2019– 21) డేటా ప్రకారం..ప్రీమెచ్యూర్, అర్లీ మెనోపాజ్‌ గ్రామీణప్రాంతాల్లో ఎక్కువగా కనపడుతోంది. దానికి పేదరికం, నిరక్షరాస్యత వంటివి కారణాలుగా చూపెడుతోంది. మద్యపానం, ధూమపానం, పోషకాహారలోపం, బహిష్టు సమయంలో అపరిశుభ్రంగా ఉండటం, అనారోగ్య పద్థతులు అనుసరించడం కూడాప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌కి కారణాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక సంతానం,18 ఏళ్లకే తొలి కాన్పు, పన్నెండేళ్లు లేదా అంతకంటే చిన్నవయసులో రుతుక్రమం ప్రారంభం అవడం లాంటి వాటివల్లా ప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌ రిస్క్‌ పెరగొచ్చని తెలుపుతున్నాయి. దేశంలోని మిగిలినప్రాంతాల కన్నా బిహార్‌లో ప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌ రేట్‌ ఎక్కువగా కనబడుతోందని సర్వేల సారాంశం. అలాగే  యాభై పైబడ్డాక కూడా నెలసరి కొనసాగిన వాళ్లల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ డెవలప్‌ అయ్యే రిస్క్‌ ఎక్కువ.


నలభై ఏళ్ల కంటే ముందే మెనోపాజ్‌ వచ్చేస్తే దాన్నిప్రీమెచ్యూర్‌ మెనోపాజ్‌ అంటారు. మన దేశంలో 2.2 శాతం మంది మహిళలు ప్రిమెచ్యూర్‌ మెనోపాజ్‌లో ఉన్నట్లు అంచనా. నలభైనుంచి నలభై నాలుగేళ్ల మధ్య వయసులో గనుక మెనోపాజ్‌ దశ మొదలైతే దాన్ని అర్లీ మెనోపాజ్‌ అంటారు. ఈ దశలో ఉన్న మహిళల సంఖ్య 16. 2 శాతం.

దేశంలో మెనోపాజ్‌ సగటు వయసు నలభై ఆరున్నరేళ్లు. అయితేప్రాంతాల వారీగా ఈ సగటు వయసులో తేడాలున్నాయి. దక్షిణ భారతదేశంలో 46 ఏళ్లు. ఉత్తర భారతంలో 45.5, మధ్య భారతంలో 47.8, పశ్చిమ భారతంలో 46.2, తూర్పు భారతంలో 47.3 ఏళ్లు.


ముందు తరాల వారితో పోలిస్తే.. మెనోపాజ్‌ సింప్టమ్స్‌కి ఆధునిక జీవన శైలి, అధిక ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, రోజులో ఎక్కువ సమయం ఫోన్లలో గడపడం వంటివన్నీ కారణాలుగా చెబుతున్నారు నిపుణులు.

మెనోపాజ్‌లో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి ప్రతి మహిళా అవగాహన పెంచుకోవాలి. ఈ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ స్టేజ్‌లోని తమ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. నిర్లక్ష్యం చేయకూడదు. నిస్పృహకు లోను కారాదు. 
– షబానా ఆజ్మీ, నటి

మెనోపాజ్‌ దశలోని మహిళలు ముందు తమ పట్ల తాము శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యల గురించి నిస్సంకోచంగా కుటుంబంతో చర్చించి, సపోర్ట్‌ అడగాలి. ఎమోషనల్‌ చాలెంజెస్‌కి డీలా పడిపోకుండా కుటుంబ సభ్యుల మద్దతుతో వాటిని నార్మలైజ్‌ చేసుకోవాలి. 
– ప్రీతి జింటా, నటి

– సరస్వతి రమ

(చదవండి: 'ట్విన్‌టాస్టిక్‌'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్‌ టు సేమ్‌..!)

Advertisement
 
Advertisement
Advertisement