స్పెల్లింగ్‌ బీ  బాద్‌షా...  దేవ్‌ షా | National Spelling Bee champion Dev Shah special story | Sakshi
Sakshi News home page

స్పెల్లింగ్‌ బీ  బాద్‌షా...  దేవ్‌ షా

May 8 2026 6:14 AM | Updated on May 8 2026 6:14 AM

National Spelling Bee champion Dev Shah special story

ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న అబ్బాయి పేరు... దేవ్‌ షా. నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ చాంపియన్‌. ‘స్పెలింగ్‌ బీ’ గురించి దేవ్‌ షా మాటలు వింటే ఆ పోటీ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ‘నేను కూడా సాధించాలి’ అనే పట్టుదల మీలో పెరుగుతుంది. ‘స్పెల్లింగ్‌ బీ’ గురించి దేవ్‌ షా మాటల్లో...

నేను సెకండ్‌ గ్రేడ్‌ నుంచి స్పెల్లింగ్‌ బీ పోటీల్లో పాల్గొంటున్నాను. ఎన్నోసార్లు ఓడిపోయాను. కొన్నిసార్లు పోటీకి అర్హత కూడా సాధించలేకపోయాను. నేను తడబడిన మొదటి పదం వెన్స్‌డే. స్పెలింగ్‌ తప్పుగా చెప్పాను. ఈ పోటీల కోసం ప్రిపేర్‌ కావడం చాలా భారంగా అనిపించేది. దీంతో గూగుల్‌ షీట్‌లో నా ప్రిపరేషన్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవడం మొదలుపెట్టాను. నేను చదివిన పదాల సంఖ్య, మూల పదాలు, ఎటిమోలజీ టెక్ట్స్‌ బుక్‌లో నేను చదివిన పేజీలు నమోదు చేసేవాడిని.

పెద్దపనులు... చిన్న చిన్న భాగాలుగా...
డిక్షనరీలో దాదాపు 5,00,000 పదాలు ఉంటాయి. వాటిలో నాకు చాలా కష్టంగా అనిపించేవి, సులభంగా అనిపించేవి...ఇలా రకరకాలుగా వాటిని గూగుల్‌ ఎక్సెల్‌ షీట్‌లో వర్గీకరించుకున్నాను. పెద్ద పెద్ద పనులను చిన్న చిన్న పార్ట్స్‌గా విభజించడం మొదలుపెట్టాను. ఇలా విభజించాలంటే ఓపిక ఉండాలి. ప్రతిరోజూ ఏడు నుంచి పదిగంటల వరకు మధ్య మధ్యలో బ్రేక్‌ ఇస్తూ చదివేవాడిని. ఇలా చదవడం వల్ల చరిత్ర నుంచి జీవశాస్త్రం వరకు ఎన్నో పదాలు, వాటి మూలాల గురించి తెలుసుకోగలిగాను.

గుర్తుంచుకోవడానికి...
స్పెల్లింగ్‌లను గుర్తుంచుకోవడానికి బండ గుర్తులు, రైమింగ్‌ ట్యాక్టిక్స్, రకరకాల మెమొరీ టిప్స్‌ ఉపయోగించేవాడిని. రోజూ ప్రిపేర్‌ కావడం ద్వారా నాలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగాయి.

నేషనల్‌ స్పెల్లింగ్‌ బీలో పదజాలం(వొకాబులరీ) అనేది ముఖ్యమైన భాగం. ఒక పదాన్ని సరిగా యూజ్‌ చేయకపోతే దాన్ని నేర్చుకోవడంలో అర్థం లేదు. నేను నేర్చుకున్న పదాలను నేను రాసే వ్యాసాలలో ఎక్కడో ఒకచోట వాడుతుంటాను.

ఎలాగైనా గెలవాలి అనే ఆరాటం వద్దు!
ఎలాగైనా గెలవాలి...అనే ఆరాటం వల్ల ఒత్తిడికి గురవుతాము. ఈ ఒత్తిడి వల్ల మైండ్‌ పనిచేయదు. నేను ఒకప్పుడు స్పెల్లింగ్‌ బీ పోటీకి ఎంపిక కానప్పుడు బాగా బాధపడ్డాను. ‘నేను గతంలో కంటే చాలా కష్టపడ్డాను. మరి ఎందుకు ఓడిపోయాను?!’ అని నా డైరీలో రాసుకున్నాను. ఆ తరువాత మాత్రం నాలో మార్పు వచ్చింది. గెలవాలనే ఒత్తిడిని వదిలేసి, దానికి బదులుగా కొత్త కొత్త పదాలను నేర్చుకోవడం ద్వారా ఆనందించడంపై ఎక్కువ దృష్టి పెట్టాను. నేను స్పెలింగ్‌ చెబుతున్నప్పుడు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన స్థితిలోకి వెళతాను. స్పెల్‌ బీ ప్రయాణం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ  ఆనందమే చివరికి నన్ను చాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెల్చుకునేలా చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement