చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3' | NASA Johnson Space Center’s Artemis 3 Space Mission In Houston | Sakshi
Sakshi News home page

చంద్రుడి దారిలో.. 'ఆర్టెమిస్‌-3'

Jun 13 2026 10:40 AM | Updated on Jun 13 2026 11:29 AM

NASA Johnson Space Center’s Artemis 3 Space Mission In Houston

కిడ్స్‌ స్పెషల్‌

చంద్రయానం

పిల్లలూ... చంద్రుడి పై మళ్లీ మనిషి కాలు పెట్టే ప్రయత్నం వేగంగా సాగుతోంది. 2026 జూన్‌ 9న అమెరికా హ్యూస్టన్‌ లోని నాసా జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌ ‘ఆర్టెమిస్‌ 3’ అంతరిక్ష యాత్రకు వెళ్లే నలుగురు వ్యోమగాములను అనౌన్స్‌ చేసింది.

ఆ వ్యోమగాములు

  • రాండీ బ్రెస్నిక్‌ – యాత్రకు కమాండర్‌. ఇంతకు ముందు రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు.

  • లూకా పర్మిటానో – పైలట్‌. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి ఆర్టెమిస్‌ కార్యక్రమానికి ఎంపికైన మొదటి వ్యోమగామి.

  • ఫ్రాంక్‌ రూబియో – మిషన్‌ స్పెషలిస్ట్‌. వైద్యుడు. అంతరిక్షంలో 371 రోజులు గడిపిన అమెరికన్‌ రికార్డు ఇతనిదే!

  • ఆండ్రే డగ్లస్‌ – మిషన్‌ స్పెషలిస్ట్‌. ఇది ఆయన మొదటి అంతరిక్ష యాత్ర.

    వీరి యాత్ర 2027 చివర్లో ప్రారంభం కానుంది. కానీ, ఈ వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టరు.

అసలు సంగతి..
ఆర్టెమిస్‌ 3 మొదట చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాల్సిన యాత్ర. కానీ ల్యాండర్‌ వాహనాలు సిద్ధం కాకపోవడంతో, నాసా 2026 ఫిబ్రవరిలో ప్లాన్‌ మార్చింది. ఇప్పుడు వీరు భూమికి దగ్గరగా ఉన్న లోఎర్త్‌ ఆర్బిట్‌లోనే ఉంటారు.

ప్రధాన లక్ష్యం
ఓరియన్‌ అనే వ్యోమనౌకను, చంద్రుడిపై దిగడానికి స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్‌ తయారు చేస్తున్న ‘హ్యూమన్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌’ వాహనాలతో అంతరిక్షంలో అనుసంధానం చేయడం. దీనినే ‘డాకింగ్‌’ అంటారు. ఇది భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు దిగడానికి చేసే కీలక సన్నాహం.

పిల్లలూ.... మనుషులు చివరిసారిగా 1972 డిసెంబర్‌లో అపోలో 17 యాత్రలో చంద్రుడిపై దిగారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ దేశం కూడా మనుషులను చంద్రుడిపైకి పంపలేదు. 2026 ఏప్రిల్‌లో ‘ఆర్టెమిస్‌ 2’ యాత్ర విజయవంతంగా చంద్రుడి చుట్టూ తిరిగి వచ్చింది. అందులో నలుగురు వ్యోమగాములు ఉన్నారు. కానీ వారు కూడా చంద్రుడిపై దిగలేదు. 2027లో జరగబోయే ‘ఆర్టెమిస్‌ 3’ యాత్ర విజయవంతమైతే, తర్వాత వచ్చే ‘ఆర్టెమిస్‌ 4’ యాత్ర 2028లో మనుషులను నిజంగా చంద్రుడిపై దించుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement