ర్యాప్‌ అండ్‌ రాకెట్ లవ్‌ స్టోరీ‌

Naomi Osaka Relationship With US Rpper cordae - Sakshi

ఇష్టం లేని పనుల్ని కూడా కూర్చోబెట్టి మరీ చేయిస్తుంది ప్రేమ! తాజా గ్రాండ్‌ స్లామ్‌ టెన్నిస్‌లో విజేత అయిన నయోమీకి.. కార్డీ అని ఒక బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు. ఆమె కోసం ఆమె ఆటని ప్రతిసారీ ఏడ్చుకుంటూ చూస్తుంటాడు. నయోమీ గెలుపు, ఓటమి లెక్క కాదు అతడికి. ఆటను త్వరగా ముగించేస్తే ఇద్దరూ వెళ్లి ఎక్కడైనా డిన్నర్‌ చేస్తూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోవడం అతడికి ఇష్టం. రెండేళ్ల నుంచీ రిలేషన్‌లో ఉన్నారు. ఆమెలో అతడికి నచ్చింది ఆమే. ఆమె ఆట కాదు. అతడిలో ఆమెకు నచ్చింది అతడొక్కడే కాదు. అతడి ‘ర్యాప్‌’ కూడా. ఎలా కుదిరింది? ఎలా కుదురుతుంది?

నయోమీ ఒసాకా.. టెన్నిస్‌ స్టార్‌. కార్డే అమరీ.. ర్యాప్‌ స్టార్‌. ఆమె నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌. అతడు గ్రామీ–నామినేటెడ్‌ ర్యాపర్‌. ఇద్దరూ యూఎస్‌లోనే ఉంటారు. అయితే ఇద్దరివీ వేర్వేరు ప్రపంచాలు. ఆమెకు ‘ర్యాప్‌’ పనిగట్టుకునేమీ ఇష్టం లేదు. అతడికి ఈ లోకంలో టెన్నిస్‌ అనే ఆట ఒకటుందనే స్పృహే లేదు. అలాంటి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వీళ్లు పడ్డారు సరే. వీళ్ల ప్రేమ నిలబడుతుందా? అది మన సందేహం మాత్రమే. వాళ్ల సమాధానం వేరుగా ఉంది. ‘‘నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామంటే మన ప్రేమకు కాళ్లలో శక్తి లేదనే’’ అని నవ్వుతూ అనేస్తారు. ఆమె రాకెట్‌ శక్తి, అతడి ర్యాప్‌ శక్తి కలిపి ఎప్పటికప్పుడు పునఃస్థాపించుకోవలసిన స్థితిలోనైతే వారి ప్రేమ లేదనే అనిపిస్తోంది. దానిక్కారణం ఉంది. ఇద్దరి లో ఒకరు ఇంకొకరి కోసం ‘ట్రై’ చేస్తే జనించిన ప్రేమ కాదు వాళ్లది. తనకై తను ఆవిర్భవించిన ప్రేమ!
∙∙
మొదట నయోమీ దృష్టే కార్డే మీద పడింది. అప్పటికే ఆమె తన తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ (యు.ఎస్‌. ఓపెన్‌) సాధించి ఉన్న టెన్నిస్‌ ప్లేయర్‌. లాస్‌ ఏంజెలిస్‌ క్లిప్పర్స్‌ బాస్కెట్‌ బాల్‌ గేమ్‌ చూడ్డానికి వెళ్లింది. అక్కడే కార్డే కూడా ఉన్నాడు. అతడూ ఆట చూడ్డానికే వచ్చాడు. అతడిని గుర్తుపట్టిన కొందరు ఫొటోల కోసం చుట్టుముట్టడం, కార్డే పసి పిల్లాడిలా నవ్వుతూ అడిగిన వారందరితో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం నయోమీ దూరాన్నుంచి చూసింది. వెళ్లి పలకరించింది. ‘హాయ్‌’ అన్నాడు. ‘నేను నయోమీ. టెన్నిస్‌ ప్లేయర్‌’ అంది. ‘నువ్వు టెన్నిస్‌ ప్లేయర్‌ ఎలా అవుతావు? సెరెనా సిస్టర్స్‌ కదా టెన్నిస్‌ ప్లేయర్స్‌’ అన్నట్లు చూసి.. ‘‘టెన్నిస్‌ గురించి నాకేమీ తెలీదు’’ అన్నాడు. ‘‘నాకు కార్డే ర్యాప్‌ గురించి కొంచెం తెలుసు’’ అని నవ్వింది. కార్డే మాత్రం ఇప్పటికీ అదే మాట చెబుతుంటాడు. ‘‘నయోమీ మాత్రమే నాకు తెలుసు. నయోమీ ఆట గురించి తెలీదు. కానీ ఆమె కోసం ఆమె ఆటను చూస్తూ కూర్చుంటాను’’ అంటాడు.


జంటగా నయోమీ, కార్డే  ; జీక్యూ మ్యాగజీన్‌ తాజా సంచికపై నయోమీ, కార్డే

మొన్నటితో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచింది నయోమీ. 2018లో యూ.ఎస్‌. ఓపెన్‌. అప్పటికి ఇద్దరికీ పరిచయం లేదు. 2019 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌. అదే తొలిసారి టెన్నిస్‌ ఆటను చూడటం కార్డే. ‘కూర్చొని చూడు’ అని నయోమీ అంటే కూర్చొని చూశాడు. 2020లో యు.ఎస్‌. ఓపెన్‌. కరోనా టైమ్‌లో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన నయోమీ.. ‘‘నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది’’ అని ఫోన్‌ చేస్తే న్యూయార్క్‌ నుంచి ఫ్లయిట్‌లో దిగి ఆమె మ్యాచ్‌కి గ్యాలరీలో కూర్చొని గెలిపించాడు. ‘అవును. కార్డే వచ్చినందు వల్లనే నేను గెలిచాను’ అంటుంది నయోమీ. ఆ మ్యాచ్‌ జరుగుతున్నపుడే.. ‘ఇది నా ప్లేస్‌ కాదు. కానీ నయోమీ కోసం నాది కాని ప్లేస్‌లోకి వచ్చాను’ అన్నాడు కార్డే. మొన్న శనివారం నయోమీ 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలవగానే యూఎస్‌ పత్రికలన్నీ ఈ జంటను చుట్టేశాయి.. పెళ్లెప్పుడని. ఇద్దరూ ఈడూ జోడు. ఒకే ఏడాది పుట్టినవారు. వయసు 23.
∙∙
పెళ్లా! అసలు ఈ రెండేళ్లుగానే నయోమీ, కార్డే కాస్త దగ్గరగా ఉండటం. ప్రారంభంలో వాళ్లిద్దరి మధ్యా కుదురుకోడానికి వాళ్ల ప్రేమ చాలా తిప్పలు పడింది. ఆమె ఉండటం కాలిఫోర్నియాలో. అతడు ఉండటం నార్త్‌ కరోలినాలో. కలుసుకోడానికి పెద్ద దూరం ఏమీ కాదు. కలుసుకున్నాక మాట్లాడుకోడానికే టైమ్‌ ఉండదు. చీకటింకా పోక ముందే రాకెట్‌ పట్టుకుని ప్రాక్టీస్‌కి వెళ్లిపోతుంది నయోమీ. ఆ ప్రాక్టీస్‌ మధ్యాహ్నం దాటిపోయేవరకు, కొన్నిసార్లు చిన్న చిన్న బ్రేకులతో సాయంత్రం వరకు సాగుతుంది. కార్డేదీ సాయంత్రం నుంచి, కొన్నిసార్లు మధ్యాహ్నం నుంచే రాత్రంతా సాగే కచేరీ కార్యక్రమం. ఒకరిది పగటి ప్రపంచం. ఇంకొకరిది రాత్రి ప్రపంచం. అయినా చంద్రుడు, సూర్యుడు అప్పుడపుడు ఉదయం, సాయంత్రం ఆకాశంలో ఒకే సమయం లో కనిపించినట్లు వీళ్లు భూమ్మీద సంధ్యా సమయాల్లో కలుసుకుంటూనే ఉన్నారు.

కలిసి డిన్నర్‌ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా.. ‘నిన్ను చూడాలని ఉంది’ అంటే వచ్చి వాలిపోతాడు కార్డే. అతడికి చూడాలనిపిస్తే చెప్పాపెట్టకుండా వచ్చి, కళ్ల నిండా చూసుకుని వెళ్లిపోతాడు. మొన్నటి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మొదలవడానికి ముందు జీక్యూ మ్యాగజీన్‌ వీళ్లను జంటగా చేసిన ఇంటర్వ్యూ వల్ల ఈ మాత్రమైనా వీళ్ల ప్రేమ గురించి ప్రపంచానికి తెలిసింది. లేకుంటే ఇప్పటికీ గుట్టుగా ఉండిపోయేవాళ్లే. ‘కార్డేలో మీకు ఏం నచ్చింది?’ అంటే.. ‘క్వయిట్‌ రొమాంటిక్‌ డూడ్‌’ అంటుంది నయోమీ. ‘నయోమీలో మీకేం నచ్చింది’ అంటే.. ‘నయోమీలో కాదు, నయోమీ మొత్తం నచ్చింది’ అని తన హిప్‌హాప్‌ స్టెయిల్లో ధ్వనిహాసం చేస్తాడు కార్డే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top