మాంట్రియల్: కెనడా టెన్నిస్ ప్లేయర్ మిలోస్ రావ్‌నిచ్ ఆటకు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల రావ్‌నిచ్ 2016లో కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌ను అందుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారి టెన్నిస్ మ్యాచ్ ఆడిన రావ్‌నిచ్ ఆ తర్వాత బరిలోకి దిగలేదు. 2008లో ప్రొఫెషనల్‌గా మారిన రావ్‌నిచ్ తన కెరీర్‌లో మొత్తం 8 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించాడు.
‘సమయం వచ్చేసింది. నేను టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. ఏ క్రీడాకారుడైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడు. నా జీవితంలో చాలా ఏళ్లు టెన్నిస్ అంతర్భాంగా ఉంది. ఈ ఆట నాకెంతో ఇచ్చింది’ అని రావ్‌నిచ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఫెడరర్‌ను ఓడించి
2016లో రావ్‌నిచ్ కెరీర్ అత్యుత్తమ దశలో నిలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్ సెమీఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను ఓడించి రావ్‌నిచ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
అయితే ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓడిపోయి ఈ కెనడా స్టార్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. అదే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెమీఫైనల్ చేరిన అతను ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు.
కెరీర్‌లో సాధించిన మొత్తం ప్రైజ్‌మనీ - 2,07,64,512డాలర్లు (రూ. 187 కోట్లు).
రావ్‌నిచ్ సాధించిన కెరీర్ బెస్ట్ ర్యాంక్-3.
ప్రొఫెషనల్ కెరీర్‌లో రావ్‌నిచ్ గెలిచిన మ్యాచ్‌లు- 383
కెరీర్‌లో సాధించిన ఏటీపీ సింగిల్స్ టైటిల్స్- 8


