USA Boy In The Box Mystery: నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టు.. పాపం చిన్నారి.. ఇంతకీ ఆ బాబు ఎవరు?

Mystery: America Philadelphia Unknown Child Shocking Facts In Telugu - Sakshi

అమెరికన్‌ అన్నోన్‌  చైల్డ్‌

కొన్ని పైశాచిక చర్యలు.. చరిత్రపుటలను రక్తపుధారలతో తడిపేస్తాయి. మానవాళికి మాయని మచ్చలుగా మిగిలిపోతాయి. సరిగ్గా 65ఏళ్ల క్రితం.. అమెరికాలో ఫిలడెల్ఫియాలో వెలుగు చూసిన ఈ ఉదంతం అలాంటిదే.

అది 1957, ఫిబ్రవరి 26.. సుస్కెహన్నా అడవిలో కుందేళ్ల అలికిడి కాస్త అనుమానంగా అనిపించి.. రోడ్డు పక్కనే కారు ఆపాడు ఓ కాలేజీ కుర్రాడు. ‘జంతువుల్ని పట్టేందుకు అడవిలో అక్రమంగా బోనులేమైనా పెట్టి ఉంటారా? కుందేళ్లు ఎందుకు అలా బెదురుతున్నాయి?’ అనే అనుమానంతో.. అడవి వైపే అడుగులు వేశాడు. లోపలికి వెళ్లే కొలదీ తట్టుకోలేని దుర్గంధం అతడ్ని ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడనివ్వలేదు.

అయినా ఏదో కీడు శంకించి.. అడుగులు ముందుకే కదిపాడు. అతడి అనుమానమే నిజమైంది. ఓ నాలుగు నుంచి ఆరేళ్లలోపు పసివాడు నిర్జీవంగా కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన అతడు.. ‘ఈ విషయంలో నన్ను విచారణ పేరుతో ఇబ్బంది పెట్టొద్దు’ అని రిక్వెస్ట్‌ చేయడంతో... ఫిలడెల్ఫియా పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది.

బాడీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి వెళ్లింది. నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టుతో ఉన్న ఆ బాబు.. ఎంతో కాలంగా పోషకాహారలోపంతో బాధపడుతున్నట్లు స్పష్టమైంది. తలపై లోతైన గాయాలు, శరీరమంతా దెబ్బలు, గాట్లు.. ఆ బాబు దయనీయ స్థితికి అద్దంపడుతుంటే.. చనిపోయిన తర్వాతే బాబు జుట్టు, గోళ్లు కత్తిరించిన ఆనవాళ్లు(ఒంటి నిండా వెంట్రుక ముక్కలు) ఉన్నాయి. పైగా శవాన్ని చాలాసేపు నీటిలో ఉంచినట్లు కాళ్లు, చేతులపై ముడతలు పడ్డాయి.

తమ బాబు కనిపించడం లేదని ఏ ఒక్కరూ స్టేషన్‌కి రాలేదు. బాబు ఊహాచిత్రాన్ని గీయించిన పోలీసులు.. 4 లక్షల కాపీలు ప్రింట్‌ వేయించి.. ఆ చుట్టుపక్కల అందరికీ పంచారు. ప్రధాన కూడళ్లలో గోడలకు అతికించారు. వార్త వేయమంటూ పత్రికలకు వివరాలు ఇచ్చారు. ఫిలడెల్ఫియాలో ఇచ్చే ప్రతీ గ్యాస్‌ బిల్లుతోనూ బాబు ఫొటోను అందించారు. అయినా ఎలాంటి సమాచారం లేదు.

ఈ కేసులో కీలకమైన కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవి బ్లూ కలర్‌ టోపీ, చిన్నారి స్కార్ఫ్, వైట్‌ కర్చీఫ్, ఆ కర్చీఫ్‌ మీదున్న ‘ఎమ్‌’ అనే అక్షరం. అయితే ఏ ఒక్క క్లూ తదుపరి విచారణకు సహకరించలేదు. దాంతో బాబు శవానికి డ్రెస్‌ వేసి.. నిలబెట్టి, కూర్చోబెట్టి కూడా ఫుల్‌ సైజ్‌ ఫొటోలు తీసి పబ్లిష్‌ చేశారు. అయినా ఏ ఒక్కరూ స్పందించలేదు.

ఈ క్రమంలోనే మీడియా, కొందరు ఔత్సాహికులు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బాబు శవం చుట్టూ చాలా కథలల్లేశారు. అందులో ముఖ్యంగా 1960లో ఓ వ్యక్తి చెప్పిన కథ చాలా మందిని నమ్మించింది. పిల్లాడి శవం దొరికిన చోటికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఓ ఫాస్టర్‌ హోమ్‌ ఉంది. అది హాస్టల్‌ లాంటిదే. అక్కడ చిన్న పిల్లల్ని సంరక్షిస్తుంటారు.

ఆ హోమ్‌కి వెళ్లిన అతడు.. బాబు శవానికి వాడిన ఊయల లాంటి బాసీనెట్, శవానికి చుట్టిన దుప్పటిని అక్కడ చూశానంటూ సొంతంగా ఓ కథ అల్లాడు. అతడి ఊహ ప్రకారం.. ‘ఆ ఫాస్టర్‌ హోమ్‌ యజమాని సవతి కూతురికి పుట్టిన బాబే ఈ బాబు. పెళ్లి కాకుండానే బాబు పుట్టడంతో సవతి తల్లి ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఆ బాబుని చంపేసి, అడవిలో పడేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

దాంతో ఎందుకైనా మంచిదని పోలీసులు.. ఆ ఫాస్టర్‌ హోమ్‌ యజమానినీ, ఆమె సవతి కూతురినీ ప్రశ్నించారు. కానీ ఎలాంటి నిర్ధారణ రాలేదు. ఏళ్లు గడుస్తున్నాయి. ఈ మిస్టరీని ఛేదించాలని.. ఆ బ్రాంచ్‌కి వచ్చిన ప్రతి కొత్త పోలీసు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓ రోజు ఈ కేసుపై మాట్లాడాలంటూ.. మార్తా అనే యువతి పోలీస్‌ స్టేషన్‌కి ఎంట్రీ ఇచ్చింది. బాబు శవంతో పాటు దొరికిన కర్చీఫ్‌ మీదున్న అక్షరం, ఆమె పేరులోని మొదటి అక్షరం ‘ఎమ్‌’ కావడంతో.. పోలీసులు ఆమె చెప్పే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

మార్తా ఏం చెప్పిందంటే.. 
మా అమ్మ 1954 వేసవిలో... జొనాథన్‌  అనే గుర్తు తెలియని బాబుని.. ఓ జంట నుంచి కొనుక్కుంది. అప్పటి నుంచీ సైకోలా మారి... దాదాపు రెండున్నరేళ్ల పాటూ ఆ బాబుని భౌతికంగా హింసించింది. సరిగా తిండి కూడా పెట్టేది కాదు. ఓ రోజు చీకటి పడుతున్న సమయంలో... జొనాథన్‌  బేక్‌ చేసిన బీన్స్‌ తిన్నాడు. ఆ వెంటనే వాంతి చేసుకున్నాడు. అది చూసిన మా అమ్మ.. ఎప్పటిలానే ఆ బాబుని చితకబాదింది.

అక్కడితో ఆగకుండా ఆవేశంలో బాబు తలను నేలకేసి కొట్టింది. దాంతో జొనాథన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. భయపడిన మా అమ్మ జొనాథన్‌కు వెంటనే స్నానం చేయించింది. ఆ సమయంలోనే ఆ బాబు చనిపోయాడు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో.. బాబు తల వెంట్రుకలు, చేతి గోళ్లు కత్తిరించి, డెడ్‌ బాడీని దుప్పట్లో చుట్టి.. అడవిలోని నక్కలు తిరిగే ప్రాంతంలో పడేసేందుకు ప్లాన్‌  చేసింది.

అందుకు నా సాయం కోరింది.. నేను సాయం చేశాను’ అంటూ జరిగిందంతా కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. ఆమె చెప్పిన చాలా అంశాలు... ఫోరెన్సిక్‌ పరిశోధనతో సరిపోలాయి. బాబు చనిపోవడానికి రెండు మూడు గంటల ముందు ఏదో తిన్నాడని, పొట్టలో బీన్స్‌ పదార్థాలు ఉన్నాయని, అలాగే బాడీ తడిసినందు వల్లే, కాళ్లు, చేతులు.. ముడతలు పడ్డాయని రిపోర్టులు తేల్చాయి.

మార్తా చెప్పినట్లే జుట్టు, గోళ్లు కతిరించిన సంగతీ తెలిసిందే. అయితే ఇదంతా చెప్పిన మార్తా మానసిక సమస్యతో సతమతమవుతోంది. అలాంటి వాళ్లు చెప్పేది కోర్టులో సాక్ష్యంగా నిలబడదు. అయినప్పటికీ పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. మార్తా ఇంటి చుట్టుపక్కల వాళ్లని ఆరా తీశారు. అయితే వాళ్లంతా.. ‘మేము ఎప్పుడూ మార్తా ఇంట్లో ఆ బాబుని చూడలేదు. అయినా పిచ్చిదాని మాటలు పట్టుకుని మీరెలా ఎంక్వైరీ చేస్తారు?’ అంటూ తిరిగి ప్రశ్నించారు. దాంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మొత్తానికీ ఈ కేసు 270 మంది పోలీసుల చేతులు మారింది. ఇప్పటికీ ఆ కేసు యాక్టివ్‌లోనే ఉంది. 

మరో ఆసక్తికరమైన వాదన ఏంటంటే.. బాబుని ఎవరో అమ్మాయిలా పెంచాలి అనుకున్నారు. అందుకే జుట్టును బాగా పెంచారు. చనిపోయాక కట్‌ చేసేశారు. బాబు కనుబొమ్మలు అంత స్టైలిష్‌గా ఉండటానికి కారణం అదే అంటూ 2008లో పొడవైన జుట్టుతో స్కెచ్‌ గియ్యగా.. అచ్చం ఆడపిల్లలాగే ఉన్నాడు ఆ బాబు. ఇది పోలీసులనే కాదు ఈ కేసుపై దృష్టిసారించిన అందరినీ ఆశ్చర్యపరచింది.

1957లో పోస్ట్‌మార్టం తర్వాత పొట్టర్స్‌ ఫీల్డ్‌లో ఆ చిన్నారి శవాన్ని పూడ్చిపెట్టారు. 1998లో ఓసారి బయటికి తీసి.. అస్థిపంజరం, దంతాల నుంచి డీఎన్‌ఏ సేకరించారు. తిరిగి ఫిలడెల్ఫియా... సెడార్‌బ్రూక్‌లోని ఐవీ హిల్‌ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. ఆ సమాధిపై ఓ భారీ హెడ్‌ స్టోన్‌  ఏర్పాటు చేసిన పోలీసులు... ‘అమెరికన్‌ అన్నోన్‌ బాయ్‌’ అని రాసి ఉంచారు.

2018 ఆగస్ట్‌లో వంశవృక్ష నిపుణురాలు బార్బరా రే–వెంటర్, బాలుడిని గుర్తించడానికి డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ని ఉపయోగిస్తామని చెప్పారు. కానీ నేటికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. దాంతో ఆ బాబు ఎవరు? మార్తా చెప్పిన దానిలో వాస్తవమెంత? జొనాథన్‌  అనేది నిజంగానే ఆ బాబు పేరా? అనే ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. 
-సంహిత నిమ్మన
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top