
అరవైల్లో మోడలింగ్
అందరూ పనిచేసి రిటైర్ అయ్యే వయసులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు ఆరు పదుల వయసు దాటిన ఈ మహిళలు. ఇటీవల జరిగినపారిస్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది 60 ఏళ్ల జర్మన్ మోడల్ గినా. భారతదేశంలో రాజస్థాన్ వాసి 60 ఏళ్ల ముక్తాసింగ్(Mukta Singh) మోడలింగ్‌ను కెరియర్‌గా ఎంచుకొని, అందానికి కొత్త నిర్వచనం చూపుతోంది. అరవై ఏళ్ల వయసులో వీరి ఆరోగ్యకరమైన జీవనశైలి 20 ఏళ్ల యువతులకు కూడా స్ఫూర్తిని కలిగిస్తోంది.మలివయసును అందంగా తీర్చిదిద్దుకోవడానికి గినా, ముక్తా లనే ఉదాహరణగా తీసుకోవచ్చు.
గినా డ్రెవాలోవ్సీ్క జర్మన్ మోడల్. కంటెంట్ క్రియేటర్. 60 ఏళ్ల వయసులో అందం, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని కొత్తగా మలుచుకుంది. ఇటీవలపారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐకానిక్ లె డే ఫైల్ షో సందర్భంగా రన్ వే పై నడిచింది గినా. ఆమె ప్రదర్శన ఫ్యాషన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాకుండా ప్రతిచోటా మహిళలు తమ బలాన్ని, సామర్థ్యాన్ని ఎంతలా నమ్ముకోవచ్చో లోకానికి చూపింది.
బోల్డ్ విజన్..: గినా డ్రెవాలోవ్సీ్క
కంటెంట్ క్రియేటర్, ఫ్యాషన్ ప్రపంచంలోకి 58 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది గినా. ఐదు పదులు దాటిన మహిళలకు సాధికారత కల్పించడం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, స్వీయప్రేమను ్రపోత్సహించడమే లక్ష్యంగా కంటెంట్‌ను సృష్టించడం ప్రారంభించింది. 30 ఏళ్లపాటు ఫ్యాషన్ పరిశ్రమలోని దిగ్గజాలతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెది. కమ్యూనికేషన్, మార్కెటింగ్‌లో రాణించింది. డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి తన ఉత్సాహకరమైన జీవనానికి ఊపిరిపోసింది.
గినా సోషల్ మీడియా ద్వారా తన ప్రయాణాన్ని పంచుకుంటూ ‘58 ఏళ్ల వయసులో నేను సున్నా నుండి నా జీవితాన్ని ప్రారంభించాను. నచ్చిన పని, దూర దృష్టి, నా బలం, నమ్మకం, ఫీల్‌గుడ్ పవర్‌ను నా చుట్టూ ఉన్నవారిలో నింపడానికి ఇదో మార్గంగా ఎంచుకున్నాను. 60 ఏళ్ల వయసులోపారిస్‌లో రన్‌వేపై నడవడం సాధారణమైనది కాదు. అది నా వయసున్న ఎంతోమందికి సందేశం. వయసు మన ఆలోచనలను పరిమితం చేయదు’ అని తెలియజేసింది.
ఆమె చేసిన ఈ పని చాలామందిని ఆకట్టుకుంది. వృద్ధాప్య జీవనాన్ని అందంగా మలుచుకోవాలనేవారికి గినా రోల్‌మోడల్‌గా నిలిచింది. వృద్ధాప్యంలోనూ ఆమె చర్మం, శరీరాకృతి, వెలుతురు నింపుకున్న నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆశ్చర్యపరిచింది. గినా కథ కేవలం ఫ్యాషన్ విజయం మాత్రమే కాదు. ఆమె పట్టుదల, శక్తి, జీవనశైలి, సానుకూల మనస్తత్వానికి నిదర్శనం. మహిళలు అనుకుంటే తమ జీవనాన్ని ఎలా మార్చుకోగలరో, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుకు ఎంత ప్రాధాన్యత ఇవ్వగలరో, అద్భుత విజయాలను ఎలా సొంతం చేసుకోగలరో ఉదాహరణగా చూపిస్తుంది. కలలను కొనసాగించే విషయంలో వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని మరోమారు నిరూపించింది.
స్టైలిష్ అమ్మమ్మ: ముక్తాసింగ్
తెల్లని జుట్టుతో మోడలింగ్‌ను కెరీర్‌గా తీసుకుని విజయవంతంగా రాణిస్తోంది 62 ఏళ్ల ముక్తాసింగ్. తల్లి, అమ్మమ్మ నుండి ప్రేరణ పొందాను అని చెప్పే ముక్తా సింగ్ రాజస్థాన్ వాసి. తన సెకండ్ జర్నీ గురించి సోషల్ మీడియా ద్వారా వీక్షకులకు తరచూ చెబుతూనే ఉంటుంది. ఆత్మగౌరవాన్ని అందాన్ని పునర్ నిర్వచించడంలోని ప్రాముఖ్యతను వివరిస్తుంది. వయసు కారణంగా గుర్తింపును పరిమితం చేయలేమని చెబుతుంది.
50 ఏళ్ల వయసులో మోడల్ కావాలని నిర్ణయించుకొని, అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు ముక్తాసింగ్ చాలా విమర్శలను ఎదుర్కొంది. ఎగతాళి చేసే కామెంట్స్‌కు బాధపడింది. కానీ, ఎవరి కోసమో తన తీరు మార్చుకోనవసరం లేదని, తనకు ఎంతో ఇష్టమైన పనిని ఎంచుకుంది.
ముక్తా చిన్నతనంలో స్టైలిష్‌గా ఉండే వృద్ధమహిళలను ఎప్పుడూ మెచ్చుకునేది. ‘మా అమ్మమ్మపెద్ద వయసులోనూ బెంగాలీ కాటన్ చీరలలో ఎంతో అందంగా కనిపించేది. మరణశయ్యపై ఉండి కూడా మంచి దుస్తులు ధరించాలని కోరుకునేది. వృద్ధాప్యంలో స్టైలిష్‌గా ఉండటం గురించి ఆలోచనే అవసరం లేదనే మాటలను పట్టించుకోకూడదు. అది ఆత్మగౌరవానికి సంబంధించింది’ అని ముక్తా చెబుతుంది.
ఇంగ్లిష్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ముక్తా యుద్ధ విమాన పైలట్‌ను పెళ్లి చేసుకుంది. తర్వాత ఇద్దరు పిల్లలను పెంచడంలో, కంటెంట్ రైటర్‌గానూ బిజీగా మారిపోయింది. ‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని. నా పిల్లలు పెద్దవాళ్లయ్యాక వారిపాత చొక్కాలు, జీన్స్ వేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయేదాన్ని. మెల్లగా వయసు పైబడటం జరిగిపోతూనే ఉంది. తెల్లబడుతున్న జుట్టుకు రంగు వేయాలన్న ఆలోచన కూడా లేదు. చాలా మంది జుట్టుకు రంగు వేసుకోకపోతే జీవితాన్ని వదులుకున్నట్టే అని చెప్పేవారు. కానీ, తెల్ల జుట్టుతోనే మెరుస్తాను చూడండి అని వారికి చెప్పేదాన్ని. ఇప్పుడు దానిని నిజం చేస్తున్నాను. మంచి పేరున్న కంపెనీలకు మోడలింగ్ చేస్తున్నాను. ఆదాయాన్నీ ఆర్జిస్తున్నాను. ఈ వయసులోనూ నా కలలను నెరవేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని వివరిస్తుంది ముక్తాసింగ్.
ఆడ–మగ ఎవరైనా సరే, స్వీయ ఆవిష్కరణ, సాధికారత కోసం తప్పక ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తినిస్తుందని గినా, ముక్తా తమ జీవనం ద్వారా మనకు విలువైనపాఠాలు బోధిస్తున్నారు.