వింత పోకడలు.. 30 సెకన్ల ప్రమాదం

MP Home Minister Calls For Action Against Indore Woman Shreya Kalra - Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయెర్స్‌ను పెంచుకోవడానికి నేటి కుర్రకారు 30 సెకన్ల రీల్స్‌ ద్వారా వింత పోకడలు పోతోంది. ఇండోర్‌ ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్‌ శ్రేయ కాల్రా ట్రాఫిక్‌ సమయంలో జీబ్రా క్రాస్‌ మీద డాన్స్‌ చేసి సమస్యలు తెచ్చుకుంది. ఏకంగా హోమ్‌ మినిస్టర్‌ ఆమె మీద చర్యలకు ఆదేశించాడు. తెలుగు ప్రాంతాలతో మొదలు దేశం మొత్తం వేల మంది అమ్మాయిలు ఇన్‌స్టా అకౌంట్ల ద్వారా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిలో కొందరి రీల్స్‌ అందరి మెచ్చుకోలు పొందేలా ఉంటే మరికొందరివి తల్లిదండ్రులకు గుండెపోట్లు తెస్తున్నాయి. రీల్స్‌ ట్రెండ్‌పై ఒక నజర్‌.

మొన్నటి ఆగస్టు నెలలో అహమదాబాద్‌ (గుజరాత్‌)లో ఒక టీనేజ్‌ అమ్మాయి తన ఫాలోయెర్స్‌ను పెంచుకోవడానికి అర్ధనగ్న వీడియోలు చేస్తోందని తెలిసి ఆమె తల్లిదండ్రులిద్దరికీ ఒకేసారి హార్ట్‌ఎటాక్‌ వచ్చింది. ఇద్దరూ బతికి బట్ట కట్టాక కూతురు ఏం చేస్తున్నదో వివరంగా తెలుసుకున్నారు. కరోనా వల్ల ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యేసరికి ఆమె చదువుకు భంగం కలగకూడదని ఒక గదీ ఫోన్‌ ఇచ్చారు. ఆ అమ్మాయి ఆ గదిలో ఒక సోషల్‌ మీడియాలో తన వీడియోలు పోస్ట్‌ చేయడమే కాకుండా తన కజిన్స్‌ను తనను ఫాలోకమ్మని చెప్పింది. అంతేకాదు వాళ్లను కూడా అలాంటి వీడియోలు చేయమని చెప్పింది.

ఆమెకు ఈ వీడియోల పిచ్చి ఎంత పట్టిందంటే తల్లిదండ్రులు హాస్పిటల్‌ పాలయ్యి ఇంటికి చేరినా ఆ వీడియోలు పోస్ట్‌ చేయడం మానలేదు. దాంతో వారు టీనేజ్‌ కౌన్సిలర్లను సంప్రదించి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. ‘ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేస్తే సైబర్‌ చట్టాల కింద కేస్‌ అవుతుంది. అరెస్ట్‌ కూడా చేయొచ్చు’ అని కౌన్సిలర్‌ ఆ అమ్మాయికి చెప్తే అప్పుడుగాని ఆ అమ్మాయి వాటిని మానలేదు. ఆ తర్వాత తన అకౌంట్‌ డీయాక్టివేట్‌ చేసుకుంది. సోషల్‌ మీడియాలో మనకో అకౌంట్‌ ఉంటే దానికి ఫ్రెండ్సో, ఫాలోయెర్సో ఉంటారు. వారి సంఖ్య పెరిగితే కొన్ని మీడియాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి. దాంతో కొన్ని అనవసర ధోరణులను ఈ కాలపు అమ్మాయిలు అవలంబిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

రెండు పద్ధతులు
కేరళకు చెందిన టీనేజ్‌ అమ్మాయి నివేద్య ఆర్‌.శంకర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 16 లక్షల మంది ఫాలోయెర్స్‌ ఉన్నారు. ఆ అమ్మాయికి 13– 14 ఏళ్లకు మించవు. ఆమె తన సోదరితో కలిసి 30 సెకన్ల రీల్స్‌ చేస్తూ విపరీతంగా ఫాలోయింగ్‌ పెంచుకుంది. అయితే ఆ రీల్స్‌ అన్నీ సినిమా పాటలకు చేసిన డాన్సులే. ఆహార్యంలో ఎటువంటి ‘అసభ్యత’ లేకుండా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వుతూ ఆమె అన్ని లక్షల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. అయితే ఇదే సమయంలో మరో ఐదుమంది టాప్‌ ఇన్‌స్టాగ్రామర్స్‌ ఉన్నారు. వారు నేహా సింగ్‌ (16 లక్షల ఫాలోయెర్లు), శాశీ పూనమ్‌ ( 8.5 లక్షలు), శ్రిష్‌ (27 లక్షలు), ఏంజల్‌ రాయ్‌ (39 లక్షలు), సోఫియా (39 లక్షలు).

కానీ వీరంతా ఫాలోయెర్స్‌ కామెంట్స్‌ను బట్టి ‘బోల్డ్‌’గా ఉండటం వల్లే ‘బోల్డ్‌’ వీడియోస్‌ చేయడం వల్ల ఇంతమంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకున్నారు. ఫాలోయెర్స్‌ వేటలో ‘సౌందర్య ప్రదర్శన’కు ‘శరీర ప్రదర్శన’కు ఈ సోషల్‌ సెలబ్రిటీలకు తేడా తెలియడం లేదని కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. వీరిలో కొందరు ఇన్‌స్టాగ్రామర్లు ప్రత్యేక యాప్‌లు తయారు చేసుకుని వాటిలో తమ వీడియోలు పోస్ట్‌ చేస్తూ తద్వారా యాడ్స్‌ను ఆకర్షించి లాభాలు కూడా పొందుతున్నారు. మొదటి కోవకు చెందిన అమ్మాయి అందరి మన్ననలు పొందుతుంటే రెండో తరగతి అమ్మాయిలు కొన్ని సెక్షన్ల నుంచి విమర్శలు పొందుతున్నారు. ట్రోలింగ్‌ ఎదుర్కొంటున్నారు.

పెద్ద సరంజామా
30 సెకన్ల వీడియోలు చేసి ఫాలోయెర్స్‌ను సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. ప్రతి వీడియోకి ఒక డ్రస్‌ సంపాదించుకోవాలి. దానికి మేకప్, ఆభరణాలు, చెప్పులూ... ప్రతిదీ సమకూర్చుకోవాలి. దానికి ఖర్చు అవుతుంది. సరైన పద్ధతిలో షూట్‌ చేసేవారు కావాలి. ఇన్‌స్టాలో ఇవన్నీ సమకూర్చుకోగల ‘స్తోమత ఉన్న’ సెలబ్రిటీలు ఉన్నారు.. మరోవైపు మురికివాడల్లో ఉంటూ రేకుల గదిలో ఉన్న బట్టల్లో డాన్స్‌ ప్రతిభ చూపుతూ గుర్తింపు పొందిన వారు ఉన్నారు.

రూపాలీ అగర్వాల్‌ అనే శ్రీమంతురాలు తన భర్త, ఇద్దరు టీనేజ్‌ కుమార్తెలతో సరదా వీడియోలు, సినిమా పాటల వీడియోలు చేసి 12 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకున్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ఎలా చూసినా ‘బోల్డ్‌ వీడియోలు చేస్తేనే ఫాలోయెర్స్‌ పెరుగుతారు’ అనుకునే ప్రమాదం ఈ రీల్స్‌ ద్వారా సెలబ్రిటీలు అయిన వారిని చూస్తే అనిపించవచ్చు. కొందరు ఆ దారి పడుతున్నారు కూడా.

ఇండోర్‌లో డాన్స్‌
తాజాగా ఇండోర్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామర్‌ శ్రేయా కాల్రాకు రెండున్నర లక్షల మంది ఫాలోయెర్స్‌ ఉన్నారు. ఈమె కూడా అడపా దడపా బోల్డ్‌ వీడియోస్‌ చేస్తూ ఉంటుంది. రెండు రోజుల క్రితం ఇండోర్‌ సిగ్నల్‌ దగ్గర రెడ్‌ లైట్‌ పడినప్పుడు హటాత్తుగా జీబ్రా క్రాస్‌ మీద ప్రత్యక్షమై అమెరికన్‌ ర్యాపర్‌ డోజా క్యాట్‌ పాట ‘లెట్‌ మి బి యువర్‌ ఉమన్‌’కు డాన్స్‌ చేసింది. 30 సెకన్ల ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ ‘రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు ఆగి ట్రాఫిక్‌ నియమాలు పాటించండి. మాస్క్‌ వాడండి’ అని సందేశం ఇచ్చిందిగాని నెటిజన్లకు, ఇండోర్‌ పోలీసులకు ఈ వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు.

అంతేకాదు మధ్యప్రదేశ్‌ హోమ్‌ మినిస్టర్‌ నరోత్తమ్‌ మిశ్రా శ్రేయా మీద చర్య తీసుకోమని కోరారు. పోలీసులు ఆమెపై న్యూసెన్స్‌ కేస్‌ బుక్‌ చేయడమే కాక మరెవరూ ఇలాంటి తలతిక్క పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వచ్చే పేరు ఎన్నాళ్లు నిలబడుతుందో చెప్పడం కష్టం. ఆ గుర్తింపును కొనసాగించడమూ కష్టమే. ఒక్కసారి ఫాలోయెర్స్‌ డ్రాప్‌ అయ్యాక దాంతో వచ్చే డిప్రెషన్‌ కథలు వేరు.

మంచి చెడ్డలను గమనించుకుంటూ సోషల్‌ మీడియాను ఉపయోగించేలా స్త్రీలు, యువతులు జాగ్రత్త తీసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యం తాము ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియ చేసి వారి అంగీకారమో లేదా వారిని ప్రిపేర్‌ చేయడమో తప్పనిసరిగా చేయాలి. వ్యక్తులు ఒక వయసు వచ్చాక సర్వ స్వతంత్రులే అయినా వారితో పాటు ఒక కుటుంబం ఉంటుంది కదా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top