
వర్షాకాలంలో మనసు వెచ్చదనాన్ని కోరుకుంటుంది. వెచ్చని నీడతో పాటు వేడి వేడి పానీయాలను కూడా ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. ఈ సీజన్‌కు అనుగుణంగా నగరవాసులను ఆకట్టుకునే క్రమంలో.. మాన్సూన్ కోసం నగర కేఫ్స్‌లో కొత్త అందాలను.. వాటి మెనూతో సరికొత్త రుచులను సంతరించుకుంటాయి. ముసురు పట్టిన వాతావరణంలో ముచ్చటైన వేడి వేడి రుచులను ఆస్వాదించే సిటిజనుల్లో ఎవరి రూటు వారికే సపరేట్.. అలా వెచ్చదనాన్ని అందించే పానీయాల్లో కొన్నింటి గురించి..
వర్షాకాలంలో మరీ ముఖ్యంగా ఆస్వాదించే ఒక ముఖ్యమైన పానీయం చాయ్/ కాఫీ. ముసురు పట్టిందంటే చాలు ఈ దుకాణాలు జనంతో కిటకిటలాడిపోతాయి. వీటిని బంకమట్టితో తయారైన సంప్రదాయ పాత్రలైన కప్పులో అందిస్తారు. అలాగే అల్లం టీ (అద్రాక్ చాయ్) కూడా రుతుపవనాల సీజన్‌కు రుచికరమైన ఎంపిక. చాయ్‌తో మరిగించిన తురిమిన తాజా అల్లం అలరిస్తుంది. బంజారాహిల్స్‌లోని రోస్టరీ కాఫీ హౌస్ వీటికి పేరొందింది. అలాగే బంజారాహిల్స్‌లోనే ఉన్న రోస్ట్ సీసీఎక్స్‌లో అమెరికానో కూడా చాలా మంది ఫేవరెట్.
జూబ్లీ హిల్స్ కేఫ్ వంటి కేఫ్స్‌లో డార్క్ చాక్లెట్‌తో తయారు చేసిన ఇటాలియన్ హాట్ చాక్లెట్ కూడా ఈ సీజన్‌లో పలువురి ఎంపిక. దీనిని కేవలం ఒక పానీయంగా మాత్రమే కాదు.. ఒక ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంటారు దీని అభిమానులు.
ఫిలింనగర్‌లోని ఆరోమలె కేరళ థీమ్‌తో రూపొందిన కేఫ్. మాన్సూన్‌లో అతిథుల కోసం తడవకుండా చినుకుల్ని ఆస్వాదించే స్పెషల్ సీటింగ్ దీని ప్రత్యేకత. ఈ కేఫ్ అందించే క్యాన్ బెర్రీ బ్రూ టీనీ, బ్రౌనీ హాట్ చాక్లెట్ వంటి పానీయాలు కూడా హాట్ లవర్స్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో ఉన్న టైగర్ లిల్లీ కేఫ్ అండ్ బిస్ట్రోలో మిక్స్‌డ్ బెర్రీ మచ్చా పలువురి ప్రత్యేక ఎంపిక.
బంజారాహిల్స్, కార్ఖానాల్లో ఉన్న మనం చాక్లెట్.. బ్రౌనీ హాట్ చాక్లెట్ రుచులకు నగరవాసులు, మరీ ముఖ్యంగా యువత ఫిదా అవుతున్నారు.
సూప్‌లు, సుగంధ ద్రవ్యాలు..
ఇదే విధంగా సూప్‌లు, టీలతో సహా వేడి లేదా గోరువెచ్చని ద్రవ పదార్థాలు వర్షాకాలంలో ఊరటనిస్తాయి. వెచ్చగా ఉండటానికి మాత్రమే కాక జీర్ణక్రియకు సైతం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సీజన్‌లో పానీయాల్లో అల్లం, పసుపు, తులసి వంటి సుగంధ ద్రవ్యాలను జోడించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందనీ, రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ వైద్యులు చెబుతున్నారు.
అలాంటి ఆరోగ్యకరమైన పానీయాలను కోరుకునే వారు కథా లాంటి హెర్బల్ ‘టీ’ల ను ఎంచుకుంటున్నారు. ఈ కథా అనేది ఒక సంప్రదాయ భారతీయ పానీయం. దీనిని చాయ్ లేదా ‘టీ’గా తీసుకుంటారు. దగ్గు, జలుబు సీజనల్ ఫ్లూ వైరస్‌లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తారు. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ కథా.. సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, గొంతు నొప్పికి ఉత్తమ నివారణగా ఎంచుకుంటారు. ఇది పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.
పలు రకాల రుచులు, థీమ్‌లు..
జూబ్లీహిల్స్‌లోని కేఫ్ ఉకుసా పెప్పర్ మింట్ హాట్ టాడీ పేరిట అందించే మాన్సూన్ స్పెషల్స్‌కు సైతం అధిక సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు.
బేగంపేట్‌లో ఉన్న ఫన్నెల్ హిల్‌లో హాట్ చాక్లెట్ కూడా ఈ సీజన్‌లో నగర యువతను ఆకట్టుకుంటోంది.
నీలోఫర్, పిస్తా హౌజ్‌లతో పాటు ఓల్డ్ సిటీలోని ఘాన్సీ బజార్‌లో ఉన్న నిమ్రా కేఫ్ వంటి ప్రదేశాలు, ఇరానీ చాయ్‌కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.
జూబ్లీ హిల్స్‌లోని చాయ్ పానీ వేడి పానీయాలు స్నాక్స్ కాంబోకు ప్రసిద్ధి చెందింది. క్రిస్పీ సమోసాలు, పకోడాలు, వడా పావ్‌లతో పాటు వెరైటీ రుచుల టీలతో ఇక్కడ గెస్ట్స్ మాన్సూన్‌ను ఆస్వాదిస్తారు.
బంజారాహిల్స్‌లో చాలా మందికి కల్చరల్ స్పేస్‌గానే పరిచయమున్న లామకాన్.. సమోసా వంటి స్నాక్స్‌కు మాత్రమే కాదు కడక్ చాయ్ వంటి ప్రత్యేక వెరై‘టీ’లకు పేరొందింది.
చాయ్ పకోడాకు బదులు హాట్ చాక్లెట్ క్రోయిసెంట్‌లను ఎంచుకునే వారు జూబ్లీహిల్స్‌లోని ఫోన్స్ చాక్లెట్‌ను సందర్శిస్తున్నారు. ఇటాలియన్ క్లాసిక్ హాట్ చాక్లెట్‌తో ఈ సీజన్‌కు ఫేమస్ అయ్యింది.
(చదవండి: అత్యంత వృద్ధ 'డ్రైవర్ అమ్మ'..!)