
మోనిషా రాజేష్(Monisha Rajesh)... 42 ఏళ్ల ఈ ట్రావెల్ రైటర్‌కు గత 15 సంవత్సరాలుగా రైలే ఇల్లు. 2010లో ఆమె 80 రైళ్లలో దేశమంతా తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశారు. ఆ తర్వాత లోకమంతా 80 రైళ్లలో చుట్టేసి ‘అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 ట్రైన్స్’ రాసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు స్త్రీలు రాత్రిపూట చేసే రైలు ప్రయాణాలు ఎలా ఉంటాయో ప్రపంచమంతా తిరిగి ‘మూన్‌లైట్ ఎక్స్‌ప్రెస్’ వెలువరించారు. ఈ రైలు ప్రయాణాల ప్రేమికురాలి పరిచయం...
‘భారతదేశాన్ని చూడాలంటే రైలులోనే చూడాలి’ అంటారు మోనిషా రాజేష్. యు.కె.లో స్థిరపడ్డ ఈ మాజీ జర్నలిస్టు ఇప్పుడు పూర్తిగా ‘ట్రావెల్ రైటర్’గా మారారు. ఆశ్చర్యకరంగా ఆమె తన కెరీర్‌కు ‘రైలు’ను ఒక ఆధారంగా మలుచుకున్నారు. అంటే పుస్తకాలు అమ్ముడవగా వచ్చే డబ్బు ఆమెకు రైలు ద్వారా వస్తున్నట్టే. ‘హఠాత్తుగా నాకు ఏమర్థమైందంటే నా పుస్తకాలకు రైలు కంటే మించిన కథానాయకుడు లేడని’ అంటారామె నవ్వుతూ.
ఆమె తాజా పుస్తకం ‘మూన్‌లైట్ ఎక్స్‌ప్రెస్ – అరౌండ్ ద వరల్డ్ బై నైట్ ట్రైన్’ మార్కెట్‌లోకి వచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాలలో రాత్రి జర్నీల ద్వారా ట్రైన్‌లలో సంచారం చేస్తూ తాను చూసిన ప్రపంచాన్ని పరిచయం చేశారు మోనిషా. ఇప్పటివరకూ ‘రైలు’ ప్రయాణాల ఆధారంగా ఆమెవి నాలుగు పుస్తకాలు వచ్చాయి.
మొదటిసారి రైలుతో ప్రేమ
మోనిషా తల్లిదండ్రులది చెన్నై. ఇద్దరూ డాక్టర్లు. అయితే యు.కెలోని నార్‌ఫోక్‌లో స్థిరపడ్డారు. మోనిషా అక్కడే పుట్టి పెరిగింది. ఆమెకు 9 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు రెండేళ్లపాటు వెనక్కు వచ్చి చెన్నైలో ఉన్నారు కాని ఆ సమయంలో మోనిషాకు దేశం గురించి తెలుసుకునే అవకాశం రాలేదు. తర్వాత ఆమె చదువు సాగి, జర్నలిస్టుగా మారాక, 2010 లో మరోసారి ఇండియాకు వచ్చారు. ‘నా దేశాన్ని చూడాలి అని నేను అనుకున్నప్పుడు విమాన ప్రయాణం బడాయి వద్దనుకున్నాను. రోడ్డు సేఫ్ కాదు. అందుకే రైలు ప్రయాణం ఎంచుకున్నాను.
90 రోజుల పాస్ తీసుకుని రైళ్లలో తిరగడం మొదలైన రెండు నెలల్లోనే నాకు అర్థమై పోయింది భారతదేశంలో రైలు ప్రయాణం అద్భుతమని. అందుకే ఈసారి ఒక ప్లాన్‌తో వచ్చి 80 ట్రైన్లలో తిరిగి ‘అరౌండ్ ఇండియా ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశాను. దానికి బోల్డంత పాఠకాదరణ, అవార్డులు లభించాయి. ఆ ఉత్సాహం నన్ను రైలులో ప్రపంచ యాత్ర చేసేలా చేసింది’ అని తెలిపారు మోనిషా. ఆమె ఇండియాలో తిరుగుతూ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.. మోనిషా రైలు మార్గం ఉన్న ప్రతి దేశంలో తిరుగుతూ ‘అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 ట్రైన్స్’ పుస్తకం రాశారు. ఇప్పుడు రాత్రి ప్రయాణాలు ఉన్న రైళ్లలో ప్రయాణించి ‘మూన్‌లైట్ ఎక్స్‌ప్రెస్’ పుస్తకం రాశారు.
ధన్యమయ్యే ప్రయాణం
‘నేను భారతదేశమంతా సెకండ్ క్లాస్ ట్రైన్‌లో తిరిగాను. భారతదేశం అర్థం కావాలంటే ట్రైను ప్రయాణం చేయాలి. అదీగాక మనుషులు విమాన ప్రయాణాలతో విసుగెత్తారు. కోవిడ్ వల్ల లాక్‌డౌన్ వచ్చి ముగిశాక ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు భ్రమణకాంక్ష పెరిగింది. లోకం చూద్దాం అనుకుంటున్నారు. దానికి గొప్ప మార్గం రైలే. యూరప్‌లో 2015 నాటికి రాత్రి ప్రయాణాలు ఉండే స్లీపర్ ట్రైన్‌లు బంద్ చేశారు. ఇప్పుడిప్పుడే అవి తిరిగి మొదలయ్యాయి. స్త్రీలు ఒంటరిగా రాత్రిళ్లు రైలు ప్రయాణాలు చేయడం, జీవితాన్ని ఆస్వాదించడంలో భాగమే’ అంటారు మోనిషా.
ప్రకృతి కన్నులు
‘టర్కీ నుంచి ఆర్మేనియా వరకూ 26 గంటల పాటు సాగే రైలు ప్రయాణం అద్భుతం. టర్కీ సౌందర్యం మొత్తం అక్కడ చూడొచ్చు. ఇక అత్యుత్తమ రైలు ప్రయాణమంటే నార్వే దేశానికి వెళ్లాలి. అక్కడ రైలు కంపార్ట్‌మెంట్లు ఇల్లంత సౌకర్యంగా ఉంటాయి. భోజనం ఏది కావాలంటే అది దొరుకుతుంది. అదొక్కటే కాదు రాత్రి మూడు గంటలకు రైలు అద్దాల్లో నుంచి సూర్యోదయం చూడొచ్చు. ఇలా మరెక్కడ సాధ్యం?’ అంటారు మోనిషా.