గాటు లేకుండా ‘పొడి’చేసే గన్‌! | Modern medical procedure to Removal of kidney stones | Sakshi
Sakshi News home page

గాటు లేకుండా ‘పొడి’చేసే గన్‌!

Jun 7 2026 5:15 AM | Updated on Jun 7 2026 5:15 AM

Modern medical procedure to Removal of kidney stones

కిడ్నీలో స్టోన్స్‌

మూత్రపిండాల్లో రాళ్లు వచ్చినప్పుడు కలిగే బాధ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి మూత్రపిండాలు మన దేహంలోని జీవక్రియల తర్వాత వెలువడే అనేక వ్యర్థాలూ, విషపదార్థాలను వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తాయి. ఈ క్రమంంలో కొన్ని రకాల వ్యర్థాలు పేరుకుపోయి ఒక స్ఫటికంలా మారే అవకాశాలుంటాయి. 

వీటినే మనం రాళ్లుగా చెబుతుంటాం. ఇటీవల ఈ రాళ్ల తొలగింపు చాలా సులభం అయ్యింది. ఇప్పటికీ సంప్రదాయ శస్త్రచికిత్సతో రాళ్లను తొలగించే అవకాశమున్నప్పటికీ కొన్ని ఆధునిక వైద్య ప్రక్రియలతో దేహంపై ఎలాంటి గాటు పెట్టకుండానే శబ్దతరంగాల సహాయంతో వాటిని పౌడర్‌లా చేసే ప్రక్రియలూ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...

సహజంగానే రోజూ తక్కువ నీళ్లు తాగేవారిలో, అలాగే నిత్యం ఏసీ రూముల్లో ఉండటం వల్ల నీళ్లు తక్కువగా తాగేవారిలో, చాక్లెట్లు, కెఫిన్‌ వంటివి ఎక్కువగా తీసుకునేవారితోపాటు... కొందరిలో వారి దేహస్వభావంలోనే రాళ్లు ఏర్పడే అవకాశముంటుంది. వీటి తొలగింపు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రాయి సైజు, దాని గట్టిదనం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని శస్త్రచికిత్స నిపుణులు తొలగింపు ప్రక్రియను ఎంపిక చేస్తారు. అయితే చిన్నపాటి గాటు పెట్టి చేసే శస్త్రచికిత్సలతో పాటు అసలు ఎలాంటి గాటూ లేకుండా కేవలం ఒక గన్‌లాంటి ఉపకరణంతో రాళ్లను పౌడర్‌ చేయడం ద్వారా వాటిని తొలగిస్తారు.

కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి?
రెండు మూత్ర పిండాలూ రక్తంలోని వ్యర్థాలను వడపోస్తూ ఉంటాయి. రక్తంలోని అనేక అంశాలను శుద్ధి చేసి సమయం లో అవసరమైన వాటిని తీసుకొని, వ్యర్థాలను మాత్రం మూత్రంతో పాటు బయటకు పంపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని వ్యర్థాలైన క్యాల్షియమ్‌ ఆక్సలేట్, సిస్టిన్‌ వంటివి స్ఫటికాలుగా పోగుపడుతూ రాళ్ల రూపాన్ని సంతరించుకుంటాయి. నిజానికి ఆ రాళ్లు యురేటర్‌ లేదా మూత్రనాళం సైజు కంటే తక్కువగా ఉంటే అవి మూత్రంతో పాటు బయటకు వెళ్తుంటాయి. కానీ ఒక రాయి 5 మి.మీ. కంటే ఎక్కువ సైజ్‌కు పెరిగితే మూత్రంలో కొట్టుకొనిపోలేక... మూత్రవిసర్జక వ్యవస్థలో  ఇరుక్కుపోవచ్చు. ఇలా రాళ్లు ఇరుక్కుపోయినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి, మూత్రధారకు ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం వరకు అనేక లక్షణాలు కనిపిస్తాయి.  

చిన్న గాటు కూడా పెట్టాల్సిన అవసరమే లేకుండా... 
ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ షాక్‌ వేవ్‌ లిథోట్రిప్సీ (ఈఎస్‌డబ్ల్యూఎల్‌) అని పిలిచే ఈ అత్యాధునిక ప్రక్రియ సహాయంతో మూత్రపిండం ఉండే భాగంలో చర్మంపై నుంచే  కేవలం గన్‌లాంటి అత్యాధునిక ఉపకరణం సహాయంతో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌ తరంగాలూ అలాగే బలమైన అల్ట్రా సౌండ్‌ తరంగాలను పంపుతారు. ఈ చికిత్స ప్రక్రియలో అల్ట్రాసోనిక్‌ తరంగాల ద్వారా రాయిని చాలా చిన్న చిన్న పలుకులు లేదా పొడి పొడి అయ్యేలా చేస్తారు. ఆ పలుకులు, పొడి రూపంలో ఉన్న రాళ్లు మూత్రంతో పాటు బయటకు వెళ్లిపోతాయి. రాతిని పలుకులు, పొడిగా చేశాక... కొన్ని కేసుల్లో మాత్రమే యురేటర్‌లో స్టెంట్‌  వేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈ రాతిపలుకుల వల్ల మూత్రనాళాలు లేదా బ్లాడర్‌ గోడలు ఒరుసుకుపోయి గాయపడకుండా ఉండటానికి ఈ ఏర్పాటు చేస్తారు. బాధితుల ఒంట్లోనుంచి రాతి పౌడర్‌లాంటి చిన్న చిన్న పలుకులు పూర్తిగా పడిపోయాక స్టెంట్‌ను తొలగిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా బాధితులకు ఎలాంటి బాధ, శ్రమ లేకుండా చికిత్స జరుగుతుంది. రాయి సైజు ఎక్కువగా ఉన్నా... ఎక్కువ గట్టిగా ఉన్నా రెండో సిట్టింగ్‌ అవసరం పడవచ్చు. 

సర్జరీ ఎప్పుడంటే... బాధితుల్లో  తీవ్రమైన నొప్పి ఉండి, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్‌ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అదే పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్‌ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్‌ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి. 

చివరగా... మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి పెరుగు చాలా తోడ్పడుతుంది. దీంతోపాటు తగినన్ని నీళ్లు ద్రవాహారాలు తీసుకోవడం మంచిది.

లక్షణాలు... 
→ భరించలేని నొప్పి 
→ మూత్రంలో రక్తం పడటం 
→ మూత్రంలో చీము రావడం 
→ విసర్జన సమయంలో మూత్ర మార్గంలో మంట 
→ మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు ∙∙
అబ్డామినల్‌ డిస్టెన్షస్‌లో... తల తిరగడం, వాంతులవడం. ఈ లక్షణాలతో పాటు ఒక్కోసారి చలి, జ్వరం. 
పోస్ట్రిరీనల్‌ అజోటీమియా... కిడ్నీలో రాయి యురేటర్‌ని బ్లాక్‌ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయడం 
ఫ్రీక్వెన్సీ ఇన్‌ మిక్చ్యురిషన్‌... ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని ఒక రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం 
జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆకలి లేకపోవడం / ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, దాంతో బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

నిర్థారణ పరీక్షలు...
మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్‌ పరీక్ష, ఇంట్రావీనస్‌ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్‌–రే, సీటీ స్కాన్‌ అబ్డామిన్‌ల వంటి పరీక్షలు అవసరమవుతాయి. వీటితో పాటు డాక్టర్లు సూచించే మరికొన్ని నిర్దిష్టమైన పరీక్షలూ చేయించాల్సి రావచ్చు.

ఇతర చికిత్సలు... కిడ్నీ స్టోన్స్‌ చాలావరకు ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, మూత్రవిసర్జక  వ్యవస్థలో రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఉదాహరణకు రాయి సైజు 2 సెం.మీ కంటే తక్కువగా ఉంటే యుటెరోస్కోపీ (యూఆర్‌ఎస్‌) అనే ప్రక్రియతోనూ, 2 సెం.మీ కంటే ఎక్కువగా ఉండి, కాస్తంత సంక్లిష్టంగా అంటే జింక కొమ్ముల (స్టాగ్‌ హార్న్‌) వంటి ఆకృతి ఉన్నవాటిని పీసీఎన్‌ఎల్‌ అనే చిన్న గాటు పెట్టే ప్రక్రియలతోనూ అలాగే 2 సెం.మీ. పరిణామంలో ఉండే రాళ్లను ఆర్‌ఐఆర్‌ఎస్‌ అనే బ్లాడర్‌లోకి పైప్‌ను పంపుతూ లేజర్‌ సహాయంతో లోపల ఉన్న రాయిని పౌడర్‌ చేసే ప్రక్రియలాంటి వాటిని ఉపయోగిస్తారు. పీసీఎన్‌ఎల్‌ మినహా యూఆర్‌ఎస్, ఆర్‌ఐఆర్‌ఎస్‌లలోనూ ఎలాంటి గాటూ ఉండదు.

డాక్టర్‌ పూర్ణచంద్రా రెడ్డి
సీనియర్‌యూరాలజిస్ట్‌

– యాసీన్‌

Advertisement
 
Advertisement
Advertisement