నారాయణ స్కూల్లో దారుణం | - | Sakshi
Sakshi News home page

నారాయణ స్కూల్లో దారుణం

Sep 2 2025 7:18 AM | Updated on Sep 3 2025 11:52 AM

-

తరగతి గదిలో హార్పిక్‌ పౌడర్‌ తినేసిన ఎల్‌కేజీ చిన్నారి

విజయవాడలో నాలుగు రోజులుగా అందిస్తున్న చికిత్స

పాలకొల్లు సెంట్రల్‌: తరగతి గదిలో ఓ చిన్నారి హార్పిక్‌ యాసిడ్‌ పౌడర్‌ తినేయడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పాలకొల్లు శంభన్న అగ్రహారం ప్రాంతంలో చోటుచేసుకుంది. పట్టణంలోని స్థానిక బుధవారపు వీధి ప్రాంతానికి చెందిన మామిడిపల్లి సంయుక్త, అనుదీప్‌ వివరాలను విలేకరులకు వెల్లడించారు. తమ కుమార్తె నాలుగేళ్ల చిన్నారి హార్వి సహస్ర పట్టణంలోని నారాయణ స్కూల్లో ఎల్‌కేజీ చదువుతోందని తెలిపారు. గత గురువారం స్కూల్‌కు వెళుతుండగా పాప బ్యాగ్‌లో బిస్కెట్‌ ప్యాకెట్‌ వేసి పంపించామని చెప్పారు. 

మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చిన్నారికి అస్వస్థతగా ఉందని ఆసుపత్రికి తీసుకు వెళుతున్నామని స్కూల్‌ నుంచి ఫోన్‌ రావడంతో వెళ్లినట్టు చెప్పారు. అక్కడ చిక్సిత చేసిన వైద్యులు ఇక్కడ కష్టమని, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించాలని సూచించారన్నారు. వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. అసలు విషయంపై ఆరా తీయగా స్కూల్లో ఇచ్చిన స్నాక్స్‌ బ్రేక్‌లో చిన్నారి బిస్కెట్‌ ప్యాకెట్‌ అనుకొని హార్పిక్‌ యాసిడ్‌ పౌడర్‌ తినేసిందని, దీంతో నోటి నుంచి రక్తం వచ్చినట్లు తెలిసిందన్నారు.

 చిన్నారి నాలుక, పేగులు, గొంతు లోపల భాగంలో కాలిపోయాయని వైద్యులు చెప్పినట్టు బాలిక తల్లి సంయుక్త కన్నీరుమున్నీరవుతూ వివరించారు. ప్రస్తుతం శరీరంలోకి పైపు ద్వారా ఓఆర్‌ఎస్‌ ద్రావణం, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు ఐదేసి చుక్కలు చుక్కలుగా వేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో కేసు నమోదు చేయించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

తప్పించుకునే ప్రయత్నంలో బుకాయింపు
ఈ ఘటనపై స్కూల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించగా మీ పాప ఆ ప్యాకెట్‌ తెచ్చుకుందని బుకాయిసున్నారని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. సీసీ ఫుటేజీ తీయాలని అడుగుతుంటే కెమెరాలు పనిచేయడం లేదని చెబుతూ ఎదురు వాదనకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ స్నాక్స్‌ సమయంలో పాపకు ఇబ్బంది ఏర్పడినట్టు తెలియగానే నోరు కడిగి ఆస్పత్రికి తరలించామని, ఈ ప్యాకెట్‌ ఎక్కడిది అని పాపని అడిగితే ఇంటి నుంచి తెచ్చుకున్నానని చెప్పిందని సమాధానమిచ్చారు. సుమా రు నెల రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఓ చిన్నారిపై టీచర్‌ అగ్గిపుల్ల అంటించి వాత పెట్టిన ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

నారాయణ స్కూల్లో దారుణం 1
1/2

నారాయణ స్కూల్లో దారుణం

నారాయణ స్కూల్లో దారుణం 2
2/2

నారాయణ స్కూల్లో దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement