జాతరకు పటిష్ట ఏర్పాట్లు
నిత్యం డ్రోన్లతో నిఘా
● ఏలూరు పడమరవీధి శ్రీ గంగమ్మ జాతర
● 800 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు
ఏలూరు టౌన్: ఏలూరు నగరం పడమర వీధిలోని శ్రీ గంగమ్మతల్లి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా.. భక్తి శ్రద్దలతో జరుపుకునేందుకు భక్తులు సిద్ధపడుతున్నారు. వేలాదిగా భక్తులు జాతర మహోత్సవాలకు తరలివస్తారనే అంచనాలతో పోలీస్ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులకు అసౌకర్యం లేకుండా జాతర కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ సూచించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌తో కలిసి ఆయన శుక్రవారం పడమరవీధి గంగమ్మ తల్లి జాతర మహోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భారీ పోలీస్ బందోబస్తు
వన్‌టౌన్ ప్రాంతంలో శ్రీ గంగమ్మతల్లి జాతర మహోత్సవం ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 1, 2 తేదీల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణతోపాటు పోలీస్ సిబ్బందిని భారీ సంఖ్యలో నియమించారు. జాతర ముసుగులో మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే వ్యక్తులను ముందుగానే గుర్తించేలా మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించారు. ఆలయ సమీపంలో సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు.
ఫిబ్రవరి 1న ఆదివారం మహా కుంభం, ఫిబ్రవరి 2న ఊరేగింపునకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. జాతర ప్రాంతంలో భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతర కమిటీ సభ్యులు, రెవెన్యూ, ఏలూరు నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో పోలీస్ యంత్రాంగం సమన్వయం చేసుకుంటూ భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టేలా ఎస్పీ ప్రత్యేక ప్రణాళికతో ఆదేశాలు జారీ చేశారు.
ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాం. ఆదివారం తెల్లవారుజాము నుంచి నగరంలోకి భారీ వాహనాలకు అనుమతులు లేవు. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. మఫ్టీలో పోలీసులు అల్లర్లకు పాల్పడే వారిపై నిఘా ఉంచుతారు.
– డీ.శ్రావణ్‌కుమార్, డీఎస్పీ
జాతరకు పటిష్ట ఏర్పాట్లు


