వేడుకగా నరసన్న కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్.జగన్నా పురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అర్చకులు, పండితులు నిత్యహోమములు, మూలమంత్ర హవనములు, బలిహరణ, వేదపారాయణ ఔపాసన మండప పూజలు జరిపి స్వామివారికి, అమ్మవార్లకు హారతి, మంత్రపుష్పములు సమర్పించారు. సాయంత్రం మూలమంత్ర హవనములు, బలిహరణలు, హారతి, మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిగాయి.
ప్రాణాచారాలు పడిన మహిళలు
సంతానం కోసం పరితపించే పలువురు మహిళలు ఉదయం ఆలయ ప్రాంగణంలో దీక్షతో ప్రాణాచారాలు నిర్వహించారు. ముందుగా వారంతా నారసింహుడిని దర్శించారు. అనంతరం సుందరగిరిపై పాలపొంగళ్లను వండి స్వయంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆ తరువాత తడిదుస్తులతో వారంతా ఆలయం వెనుక ప్రాణాచారం పడ్డారు. సాయంత్రం వరకు ఆ మహిళలు నరసింహుని స్మరిస్తూ ఉపవాస దీక్షను చేశారు. ఇలా చేయడంవల్ల వారికి స్వామివారు మదిలో సాక్షాత్కరించి కోరిన కోర్కెలను తీరుస్తాడని భక్తుల నమ్మకం. అలాగే వారు నవగ్రహ పూజలు జరిపారు.
నేడు నారసింహుడి కల్యాణం..
సుందరగిరి దిగువనున్న కల్యాణ మండపంలో నరసన్న దివ్య కల్యాణ మహోత్సవం శనివారం ఉదయం 11.10 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ కోరారు.
నేడు నారసింహుని దివ్య కల్యాణం
వేడుకగా నరసన్న కల్యాణోత్సవాలు


