
∙నిర్మల వాణి
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్
అనేది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది.వేదాల ప్రకారం సవితా దేవి గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత. గాయత్రీ మంత్రం ప్రాచీనమైనది. నాలుగు వేదాల సృష్టికి ముందు బ్రహ్మ 24 అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని రచించాడని చెబుతారు.
ఈ గాయత్రీ మంత్రం సవితా దేవిని, సూర్యదేవుని కీర్తిస్తూ, సూర్య (పింగళా) నాడిని ముఖ్యంగా స్వాధిష్టాన చక్రాన్ని చైతన్యపరచడానికి చదివే మంత్రం. సుమారు 5000 సం.క్రితం విశ్వామిత్రునిచే స్తుతింపబడిన ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. గాయత్రి మంత్ర పరమార్థం ఏమిటో, ఎప్పుడు ఆ మంత్ర పఠనం చేయాలో అనే అవగాహన వుండడం మంచిది. అతి సర్వత్రా వర్జయేత్ .. ఏది అతిగా చేయడం, ఆచరించడం శ్రేయస్కరం కాదు. దానివలన ఒక్కోసారి ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు. గాయత్రి మంత్రం మన సూక్ష్మ నాడీవ్యవస్థలోని చక్రాలలో ఉన్న పంచ మహాభూతాల సారాన్ని మనకుబోధిస్తుంది. మంత్రాల గురించి చాలా పెద్ద శాస్త్రమే ఉందని చెప్పవచ్చు. మానవ అంతర్గత సూక్ష్మశరీర వ్యవస్థలో చక్రాలలోనూ, నాడులలోను దేవీదేవతలు అధిష్టాన దేవతలుగా ఉంటారు. దేవీకవచంలో చెప్పినట్లు మన శరీరంలోని అంగప్రత్యంగాలన్నీ కూడా ఏదో ఒక దేవత అధీనంలో ఉండి వారి చేత రక్షింపబడుతుంటాయి. మన సమస్య ఏ అవయవంలో ఉంటే ఆయా అవయవానికి సంబంధించిన అదిష్టాన దేవతా మంత్రాన్ని పఠించుకుని ఆ దేవతని సంతృప్తిపరుచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చును. అంటే మనకున్న సమస్య కాలికి అయితే, వైద్యం చేతికి చేసినట్లు కాకుండా మన ప్రార్థన కూడా ఏ ఏ చక్రాలలో, లేదా ఏ నాడిలో లోపం వుందో వాటికి సంబంధించిన అధిష్టాన దేవీ దేవతలను ప్రసన్నం చేసుకునేదిలా ఉండాలి.
మన శరీరంలోని కుడి పార్శ్వపు నాడి (పింగళా నాడి)లో గాయత్రి దేవి నివాస స్థానం ఉంటుంది. నా అంతటి వాడు లేడనే అత్యహంకారం వలన ఈ పింగళా నాడి సమస్యకు లోనవుతుంది. దీనివలన ఈ నాడి అసమతుల్యతకు లోనై అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అలా కుడి పార్శ్వంలో సమస్యలు ఉన్నవారు అతిగా గాయత్రి మంత్ర పారాయణ చేయటం వలన వారు మరింత కోపిష్టిగా, అహంకారిగా మారి విజ్ఞతను కోల్పోయే అవకాశం ఉంది. పూర్వ కాలంలో ఎంతో కఠోర తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం పొందిన మునీశ్వరులు, ఋషులలో కొందరు ఇటువంటి కారణం చేతనే భగవంతుని ఆగ్రహానికి గురయ్యారని మనకు తెలిసున్నదే. పంచ మహాభూతాలైన మూలకాలన్నీ మన కుడి పార్శ్వంలో ఉన్న పింగళనాడిలో నిక్షిప్తమై ఉంటాయి. గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలు మన చక్రాలలోని పంచ భూత తత్వాలతో అనుసంధానిపబడి ఉంటాయి. ఇదే గాయత్రి మంత్ర విశిష్టత, పరమార్థం.
కుండలినీ జాగృతి చెంది బ్రహ్మ రంధ్రం ఛేదించుకుని వచ్చి సహస్రారం మీద భగవంతుని పరమ చైతన్యశక్తితో ఏకీకృతమైనప్పుడు మనం ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందుతాం. అలా ఆత్మసాక్షాత్కారంపొంది సహజయోగ సాధన చేస్తున్న వారికి గాయత్రి మంత్రం ప్రాధాన్యత గాయత్రి మంత్రోచ్ఛారణ ఫలితం బాగా అవగతమవుతుంది.
– డా. పి. రాకేశ్
( శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)