గుడ్‌ గర్ల్స్‌ స్లీప్‌ ఎర్లీ

Markandey Katju Comments Good Girls Sleep Early In Social Media - Sakshi

లక్నో: నైంటీ పర్సెంట్‌ భారతీయులు బుద్ధిహీనులు అని బహిరంగంగా కామెంట్‌ చేసిన భారతీయుడు మార్కండేయ ఖట్జూ. ఆశ్చర్యం లేదు. అన్నీ ఇలాగే మాట్లాడేవారు ఆయన. సుప్రీంకోర్టు మాజీ జడ్జి. జడ్జిగా ఉన్నప్పుడే చాలా వరకు తన అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి కాలానుగుణంగా రిటైర్‌ అయ్యారు. భారతీయులను మాత్రమే ఓ మాట అని శాటిస్‌ఫై అవలేదు అప్పట్లో ఆయన. భారతీయులలో 20 శాతం మంది హిందువుల్ని, 20 శాతం మంది ముస్లిములను కూడా అన్నారు. ఆ ‘శాత’వాహనులు ఇద్దరూ మతాన్ని మోసుకుంటూ తిరుగుతుంటారట. ఇంకోసారి సాల్మన్‌ రష్దీని పట్టుకున్నారు ఖట్జూ. మరీ ఎక్కువ పొగిడేశామ్, అంతలేదు రష్దీకి అంటారు. ఒరిస్సా వాళ్లని డర్టీ ఫెలోస్‌ అన్నారు. బిహార్‌ వాళ్లను చికాకు మనుషులు అన్నారు. జడ్జిల్ని కూడా ఏదో అన్నట్లున్నారు.. రేప్‌ కేసులో ఒక దోషికి మరణశిక్ష వెయ్యకుండా వదిలేశారని! ఇలా చాలా వివాదాలు తెచ్చుకున్నారు. (న్యాయవ్యవస్థపై మార్కండే కట్జు సంచలన వ్యాఖ్యలు)

ప్రస్తుతం ఆయన లక్నోలో ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆయన గడపడం కాదు, ప్రపంచాన్ని ప్రశాంతంగా గడపనిస్తున్నారనుకోవాలి. ఈ సమయంలో ఆయన పడక్కుర్చీని నెటిజన్స్‌ కొందరు కదిలించారు. ‘ఓయీ.. పితృస్వామ్య భావజాలీ.. కళ్లు తెరువు‘ అని తట్టి లేపారు. లేచి, వెంటనే రెప్పలు వాల్చేశారు తప్ప రిప్లయ్‌ ఇవ్వలేదు ఖట్జూ. నెటిజన్‌ లు ఈ వయసులో ఆయన్ని డిస్టర్బ్‌ చెయ్యడానికి తగిన కారణమే ఉంది. ఫేస్‌ బుక్‌ లో ఆయన ఏదో పోస్ట్‌ పెడితే, దానిపై ఓ మహిళ ఏదో కామెంట్‌ పెట్టారు. ఆ కామెంట్‌కి ఆయన.. ‘గుడ్‌ గర్ల్స్‌ స్లీప్‌ ఎర్లీ’ అని రిప్లయ్‌ ఇచ్చి పడుకుండిపోయారు. ‘మంచి అమ్మాయిలు ఎక్కువసేపు మేల్కొని ఉండరు’ అని అనడంలోని ఆయన భావం.. పెద్ద పెద్ద విషయాలు ఆడవాళ్లకు ఎందుకు అని! ఆ మాట నిజమే. ఖట్జూకి ప్రస్తుతం 74 ఏళ్లు. పెద్ద వాళ్లవి పెద్ద పెద్ద విషయాలే అయివుంటాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top