కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబరు 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. బాబా జన్మించిన గొల్లపల్లి– ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడీ సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకొన్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా జీవితంలో ఎన్ని వివాదాలు వచ్చినా, ఆయన సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేకపోయారు. బాబా బంగారు ఉంగరాలు, విబూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు. కోట్లాదిమంది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. కుల మతాలకు అతీతంగా నిలిచారు.
సత్యసాయి భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్‌లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. సత్యసాయి బాబా బాల్యంలోనే చాలా అద్భుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే అపర మేధావిగా, సేవాభావం గల వ్యక్తిగా ముద్రపడ్డారు. అపర మేధావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులకు వినిపించేవారు.
1940 మే 23న తండ్రి ‘నీవెవరు?’ అని అడిగినప్పుడు ‘నేను సాయిబాబా’ను అని సమాధానం చెప్పారు. నిదర్శనం చూపమంటే చేతిలో గుప్పెడు మల్లెపూలను తీసుకుని నేలపైకి విసరగా అవి ‘సాయిబాబా’ అనే అక్షరాలుగా ఏర్పడా›్డయి. ఆ చర్యతో బాబా తండ్రి– బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడిగా భావించారు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పారు. తాను షిరిడీ సాయికి ప్రతిరూపాన్ని అని, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో భక్తులు రావడం ప్రారంభమైంది.
1944లో భక్తులు, బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరం నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభమైన ప్రశాంతి నిలయం 1950 నాటికి పూర్తయింది. 1957 సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారతదేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1956లో చిన్నపాటి జనరల్ హాస్పిటల్‌ను పుట్టపర్తిలో నిర్మించారు. 1968లో బొంబాయిలో ధర్మక్షేత్ర అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. అక్కడ బాబా తాను ఏ మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదని, ప్రేమను పంచడానికి వచ్చానని భక్తులకు చెప్పారు. తన వైపు ఎవరినీ తిప్పుకోవాలని రాలేదని, ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. 1973లో హైదరాబాద్‌లో శివం మందిరాన్ని ప్రారంభించారు.
అనంతరం 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1991లో పుట్టపర్తిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మంచారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో మరొకసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను బెంగళూరులో నిర్మించారు. 1965లో సత్యసాయిబాబా భారతదేశంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించారు. దీని ద్వారా కుల మతాలకు అతీతంగా ప్రజలు సమష్టిగా నిస్వార్థ సేవలో పాల్గొని, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే శాశ్వత విలువలను పెంపొందించు కోవాలని సూచించారు. ఆయన ప్రసంగంలో లవ్ ఆల్.. సర్వ్ ఆల్ (అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు), హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్ (అందరికీ మంచి చేయి.. ఎవరికీ హాని చేయకు) అనే పదాలు ప్రతిసారీ వినిపించేవి. పుట్టపర్తిలో ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ప్రశాంతి నిలయం కేంద్రంగా మొదలైన ఉద్యమం.. ప్రపంచవ్యాప్తంగా 156 దేశాలకు పైగా విస్తరించింది.
ఉచితంగా విద్య, వైద్యం
నిరంతరం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 1972లో ‘శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్’ స్థాపించారు. అప్పటి నుంచి ఆ సంస్థలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇప్పటికీ అమలులో ఉంది. అదేవిధంగా ఖరీదైన వైద్యం ఉచితంగానే చేస్తున్నారు. కోట్లాది మంది ఉచిత వైద్యాన్ని పొందారు. ప్రేమ, సేవ, సార్వత్రిక సోదరభావంతో సమాజానికి నిత్యం కొత్త నమూనాలను తీసుకొస్తున్నారు. ఇక్కడ చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అవతార పురుషుడిగా ప్రకటించుకున్న నాటి నుంచి 86 ఏళ్ల వరకు సేవకుడిగానే నిలిచారు. బాబా భౌతికంగా లేకపోయినా, ఆయన పాటించిన, ప్రారంభించిన విధానాలు నేటికీ కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి అనే పదం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.


