House Decoration: వాటితో డిజైన్‌.. ఇంటిని ప్యాలస్‌లా మార్చండి!

Latest Trends House Decoration People Want This - Sakshi

ఆకాశంలో విరిసే హరివిల్లుతో పాటు అక్కడ ఉండే మబ్బులు, తారలు, చందమామ.. అన్నీ మన ఇంటి రూఫ్‌ మీద కనువిందు చేస్తుంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా! ‘ఆ హంగులన్నీ ఏ ప్యాలెస్‌లోనో కనిపిస్తాయి.. మన ఇళ్లకు అంత సీన్‌ లేదు’ అని అనుకోనక్కర్లేదు. ఇప్పుడు ఆ ప్యాలెస్‌ స్టైల్‌ ట్రెండ్‌లోకి వచ్చేసింది. సీలింగ్‌ స్టిక్కర్‌తో మనిళ్లనూ అలా అలంకరించుకోవచ్చు.  

గది గదికో తీరు
లివింగ్‌ రూమ్‌ గ్రాండ్‌గా కనిపించే స్టిక్కర్‌ డిజైన్స్‌లో అడవి అందాలు, వన్యమృగాలు, పువ్వుల చందాలతో  సీలింగ్‌  సిత్రాలు కనువిందు చేస్తున్నాయి. బెడ్‌రూమ్‌లో చుక్కల ఆకాశాన్ని, సముద్రపు సొగసును దించేస్తున్నాయి. ఎలాంటి ఆర్భాటాలూ వద్దూ అనుకునేవారికి సింపుల్‌ చిత్రాలూ ఉన్నాయి.

మది మెచ్చిన జోరు
కార్లు, విమానాలు.. ఏవి కోరుకుంటే అవి సీలింగ్‌కి అతికించేసి ముచ్చట తీర్చేసుకునే రోజు వచ్చేసింది. లైట్లు ఆర్పేస్తే తళుక్కున చుక్కలు మెరిసేలా రూఫ్‌ డిజైన్‌ చేయించుకునేవారు ఇదివరకు. ఇప్పుడు ఇది కాస్త అడ్వాన్స్‌ అయ్యి ఏకంగా ఆకాశాన్నే ఇంటి పైకప్పుకు కట్టేసుకుంటున్నారు ఈ రూఫ్‌ స్టిక్కర్స్‌తో. 

సీలింగ్‌ ఆర్ట్‌
యాంటిక్‌ థీమ్‌నూ రూఫ్‌ మీద పరచవచ్చు. దాని కోసం ఎంపిక చేసుకున్న డిజైన్‌ను వాల్‌ ఆర్ట్‌లాగే రూఫ్‌ మీదా ఆర్ట్‌గా వేయించుకోవచ్చు. 

కార్టూన్‌ హుషారు
పిల్లల బెడ్‌రూమ్‌లలో పాలపుంతనే కాదు కామిక్‌ రూపాలనూ కనువిందుగా డిజైన్‌ చేయించవచ్చు. ఇందుకు సులువైన ఎంపిక సీలింగ్‌ స్టిక్కర్సే! పిల్లలకు ఇష్టమైన కామిక్‌ క్యారెక్టర్లు, బొమ్మల చిత్రాలు, కార్ల జోరు.. వగైరా రూఫ్‌ పేపర్స్‌ జాబితాలో ఉన్నాయి. రూ.200 నుంచి లభించే ఈ  సీలింగ్‌ స్టిక్కర్స్‌తో ఇంటి రూపాన్నే మార్చేయచ్చు. కొంచెం బోర్‌ కొట్టిన ఇంటి రొటీన్‌ డిజైన్‌ నుంచి ‘వావ్‌’ అనిపించేలా క్రియేట్‌ చేయచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top