ఏదో చేయాలి​.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’

Kerala Woman Turns Waste Coconut Shells Into Thriving Business - Sakshi

గోల్‌ కొట్టిన కొబ్బరి కప్‌

‘మనసుంటే మార్గమూ ఉంటుంది’ అనే నానుడి మరోసారి నిజమైంది. కేరళ, త్రిశూర్‌ అమ్మాయి మారియా కురియాకోస్‌ ఎంబీఏ చేసింది. ముంబయిలో ఒక సోషల్‌ ఎంటర్‌ ప్రైజ్‌లో ఉద్యోగం చేసింది. ‘తనకు తానుగా ఏదో ఒకటి ఆవిష్కరించలేకపోతే జీవితానికి పరమార్థం ఏముంటుంది?’ అని కూడా అనుకుంది. ఉద్యోగం మానేసి సొంతూరు త్రిశూర్‌కి వచ్చేసింది. ఏదో చేయాలని ఉంది, కానీ ఏం చేయాలనే స్పష్టత రావడం లేదు.

ఊరికే ఇంట్లో కూర్చుంటే ఆలోచనలు ఎలా వస్తాయి? అలా ఊరంతా తిరిగి నలుగురిని చూస్తే కదా తెలిసేది... అనుకుంది. త్రిశూర్‌లో ఏమున్నాయి? ఏమి లేవు అనేది కూడా తెలుసుకోవాలి కదా! అనుకుంటూ త్రిశూర్‌లోని రోడ్లన్నీ చుట్టిరావడం మొదలుపెట్టింది. తనకు తెలిసిన ఊరే అయినా, ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఒక కొబ్బరి నూనె మిల్లు కనిపించింది. కేరళ అమ్మాయికి కొబ్బరి నూనె మిల్లును చూడడం కొత్తేమీ కాదు.

అయితే ఈసారి ఆమె దృష్టిని ఆకర్షించింది కొబ్బరి నూనె కాదు, నూనె కోసం కొబ్బరి వలిచిన తర్వాత మిగిలిన ఖాళీ కొబ్బరి చిప్పలు. రాశులుగా ఉన్నాయి. వాటిని ఏం చేస్తారని అడిగింది. పొయ్యిలో వంటచెరకుగా వాడతారు, ఇటుకలను కాల్చడానికి బట్టీల్లో వాడతారని తెలుసుకుంది. అంత గట్టి మెటీరియల్‌ బొగ్గుగా కాలిపోవడమేంటి? వీటిని ఉపయోగించే తీరు ఇది కాదు, మరింత ఉపయుక్తంగా ఉండాలని ఆలోచించింది మారియా.

కోకోనట్‌ కప్‌
కొబ్బరి చిప్పలు కిందపడినా పగలవు. ఇంకేం! సెంటెడ్‌ క్యాండిల్‌ తయారు చేయడానికి గాజు కుండీలకంటే కొబ్బరి పెంకులే మంచి బేస్‌ అనుకుంది మారియా. సూప్‌ తాగడానికి కూడా పింగాణీ కప్పుల కంటే కొబ్బరి పెంకు కప్పులే సేఫ్‌. అంతే కాదు, హ్యాంగింగ్‌ గార్డెన్‌కి కూడా కొబ్బరి కుండీలే. ఫోర్క్‌లు, స్పూన్‌లు కూడా. మన్నిక ఓకే, మరి కొబ్బరి పెంకును అందంగా తీర్చిదిద్దడం ఎలా? తండ్రి మెకానికల్‌ ఇంజనీర్‌.

రిటైరయ్యాడు కాబట్టి ఆయన కూతురికి అవసరమైన యంత్రాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. పూర్వం స్టీలు గరిటెలు, గిన్నెలు లేని రోజుల్లో గరిటలుగా కొబ్బరి చిప్పలనే వాడేవారని తెలుసుకున్న తర్వాత మారియా ఆ వృత్తి పని వారి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ పని అన్నానికి భరోసా ఇవ్వకపోవడంతో వాళ్లు ఇతర ఉపాధి పనులకు మారిపోయారు. త్రిశూర్, కొట్టాయం, వయనాడుల్లో విస్తృతం గా సర్వే చేసి, ఆ వృత్తిదార్లను సమీకరించింది. ఇప్పుడామెతో కలిసి పదిమంది పని చేస్తున్నారు.

గతంలో అయితే కొబ్బరి చిప్పలను ఉలి సహాయంతో చేత్తోనే నునుపుగా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మారియా డిజైన్‌ చేయించుకున్న మెషీన్‌తో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ‘తెంగ’ పేరుతో ఆమె రిజిస్టర్‌ చేసుకున్న పరిశ్రమ ఇప్పుడు స్థిరమైన రాబడినిస్తోంది. తెంగ ఉత్పత్తులకు కేరళతోపాటు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా ఆర్డర్‌లు వస్తున్నాయి. కస్టమర్‌లకు పేర్లు ముద్రించి ఇవ్వడం ఆమె ఎంచుకున్న మరో చిట్కా. అమెజాన్‌ ద్వారా జర్మనీలో అమ్మకాలకు కూడా రంగం సిద్ధమైంది. కేరళలో కొబ్బరి వలిచిన ఖాళీ కొబ్బరి చిప్పలు సూప్‌ బౌల్స్‌గా జర్మనీకి చేరనున్నాయి.

తండ్రితో మారియా కురియాకోస్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top