భూమాత నా చేతిని వదలదు

Kavitha Mishra Farmer And Social Worker Special Story In Karnataka - Sakshi

ఆమె ఎన్నో మధురోహలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. ఊహలు.. కలల రెక్కలను తన చేత్తోనే కత్తిరించకోక తప్పలేదు. ఒక కలకు కత్తెర పడితే... మరొక కలకు రూపమివ్వాలి. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ కలను పక్కన పెట్టింది. ఊహలను నేలమీదకు దించింది.. కొత్త కలను సాగు చేసింది. ఇప్పుడామె విజయం... తొలినాటి ఊహకంటే ఎత్తులో ఉంది.

కవితామిశ్రాది, కర్నాటక రాష్ట్రం, రాయచూర్‌ జిల్లా. ఎంఎ, సైకాలజీ చేసి కంప్యూటర్‌ సైన్స్‌లో డిప్లమో చేసింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం అంటే ఇష్టమే కానీ, అంతకంటే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ అంటే ఎక్కువ ఇష్టం. ఇష్టంగా చేసిన కోర్సులో అద్భుతాలు సాధించాలనుకుంది. ఆమె భర్త ఉమాశంకర్‌ 43 ఎకరాల రైతు, పెళ్లి తర్వాత ఆ ఇంట్లో ‘కవిత ఉద్యోగం చేయడం అవసరమా’ అనే ప్రశ్న మొదలైంది. చర్చోపచర్చల తర్వాత ఉద్యోగం మానేయడమే తుదినిర్ణయమైంది. ‘మరి నేనేం చేయాలి? ఊరికే తిని కూర్చోవడం ఏమిటి’ అన్న కవిత ప్రశ్నకు బదులు గా ఎనిమిది ఎకరాల పొలాన్నిచ్చాడు ఉమాశంకర్‌. భర్త బలవంతం మీద ఆ పొలాన్ని స్వీకరించింది. అయితే ఈ బంజరు భూమిని ఏం చేయాలో అర్థం కాలేదామెకు. ఏం చేయాలన్నా ముందు నేల చదును చేయాలి కదా... అనుకుని ఆ పని పూర్తిచేసింది. ఖర్చుల కోసం పెళ్లికి పుట్టింటి వాళ్లు పెట్టిన ఆభరణాలను అమ్మేసింది.
 
నీళ్లున్నాయి కానీ...
కవిత తన పొలంలో బోరు వేసింది. నీరు పెద్దగా పడలేదు. రెండంగుళాల మందం ధార మాత్రమే వస్తోంది. ఈ నీటిని నమ్ముకుని వరిసాగు చేయడం అయ్యే పని కాదని తెలుసు. పండ్లతోటల పెంపకంలో అనుభవం ఉన్న వారిని సంప్రదించింది. తొలిగా చేతికొచ్చిన పంట దానిమ్మ. మంచి అమ్మకాలు, చక్కటి ఆదాయంతో చేసిన పనిలో సంతృప్తినిచ్చింది. పండ్లతోటల పెంపకంలో ఆదాయం, ఆత్మసంతృప్తి బాగానే ఉన్నాయి. ఉద్యోగం కంటే ఏం తక్కువగా లేదు. మరి... వయసైపోయిన తర్వాత సంగతేంటి? తనకు తానే ప్రశ్న వేసుకుంది. ఆ ప్రశ్నకు బదులుగా టేకు, చందనం వంటి దీర్ఘకాల రాబడినిచ్చే వృక్షజాతుల పెంపకం మేలనుకుంది. వర్షాకాలం పోగా మిగిలిన ఎనిమిది నెలల్లో బోరు నీటితోనే లాక్కొచ్చింది. ‘పొలం ఇస్తే మాత్రం... అందులో పంట పండించి చూపించాలనే  షరతు ఎవరైనా పెట్టారా? ఎందుకంత శ్రమ’ అని ఇంట్లో వాళ్లు ఎంత చెప్పినా కవిత వినలేదు. ‘‘భూమాత నా చేతిని వదలదు... అని గటిగా నమ్మాను. పదకొండేళ్ల నిరంతర శ్రమ తర్వాత అందుకున్న ఫలితం ఇది. సేంద్రియ వ్యవసాయం నన్ను కాపాడింది. ఆవు మూత్రం, గొర్రెల ఎరువుతోనే సాగు చేశాను. నా పొలంలో పక్షులు, పాములు ఎల్లవేళలా సంచరిస్తుంటాయి. పొలంలో పక్షులు, పాములు  పంటలనాశించే క్రిమికీటకాలను, ఎలుకలను తినేస్తాయి’’ అని చెప్తారామె. ఇప్పుడామె టేకు, చందనం చెట్లతోపాటు మామిడి, జామ, సీతాఫలం, ఉసిరి, బత్తాయి, నిమ్మ, కొబ్బరి, మునగ, నేరేడు వంటి పండ్లు, కూరగాయల చెట్లను కూడా సాగుచేస్తోంది. ఏడాదికి కోట్లలో ఆదాయాన్ని తీసుకుంటోంది.

హైటెక్‌ సెక్యూరిటీ
కవిత... తన పొలంలో పెరుగుతున్న ఖరీదైన చందనం, టేకు చెట్లకు, పండ్ల చెట్లకు కాపలాగా కుక్కలను పెట్టింది. ఒకవేళ కుక్కలను ఏమార్చి దొంగలు పొలంలో జొరబడినప్పటికీ... దొంగతనం మాత్రం సాధ్యమయ్యే పని కాదక్కడ. ఆమె టేకు, చందనం చెట్లకు మైక్రో చిప్‌ను అమర్చింది. చెట్టు మీద గొడ్డలి వేటు పడిన వెంటనే మైక్రోచిప్‌ నుంచి ప్రకంపనలు మొదలవుతాయి. ఆ ప్రకంపనలతోపాటు కవిత స్మార్ట్‌ఫోన్‌కు అలర్ట్‌ వస్తుంది. ఫోన్‌ అలర్ట్‌ చూసుకుని పొలానికి వెళ్లేలోపు దొంగలు చెట్లను నరికి పట్టుకెళ్లిపోయినా కూడా జీపీఎస్‌ (గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌) ద్వారా పట్టుకోగలిగినంత పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లను చేసుకుందామె. మట్టిలో మొక్కలు నాటడానికి అంతంత చదువులు చదవాలా? అని మూతి తిప్పిన వాళ్లకు, అంతంత చదివింది పొలంలో చెట్లు పెంచుకోవడానికా? అని నొసలు చిట్లించిన వాళ్లకు ఆమె విజయమే సమాధానం. అంత చదివింది కాబట్టే టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చో ఆచరణలో చూపించగలిగింది. పంటను రక్షించుకోవడంలో పదిమందికి దారి చూపించగలుగుతోంది. ఏ వృత్తిని ఎంచుకున్నప్పటికీ, ఏ పని చేసినప్పటికీ... చదివిన చదువు, నేర్చుకున్న అక్షరం వృథాగా పోవని నిరూపిస్తోంది.


Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top