Career pedia: నేర్చుకుంటే సాధించవచ్చు | Sakshi
Sakshi News home page

Career pedia: నేర్చుకుంటే సాధించవచ్చు

Published Sun, May 15 2022 4:30 AM

Jyotsna Reddy starts skill development programs - Sakshi

గతంతో పోల్చితే ఈ రోజుల్లో చదువుకున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. మంచి కంపెనీలలో ఉద్యోగమూ సంపాదిస్తున్నారు. ‘కానీ, ఆ ఆనందం వారిలో కొన్నాళ్లలోనే ఆవిరైపోతుంది..’ అంటున్నారు జ్యోత్సా్నరెడ్డి. నైపుణ్యాల లేమి కారణంగా నవతరం ఎదుర్కొంటున్న ఒత్తిడిని గమనించి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారిలో అవగాహన కలిగిస్తున్నారు.
కాలేజీలలో వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నారు.

‘ప్రపంచానికి ఇప్పుడు మార్కులు, పర్సెంటేజీలు కాదు నైపుణ్యాలు కావాలి’ అని చెబుతున్న ఈ కెరీర్‌ గైడ్‌ హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘కెరీర్‌ పీడియా’ ద్వారా తన సేవలను అందిస్తున్నారు. మల్టిపుల్‌ కంపెనీలలో ఉద్యోగం చేసిన అనుభవం సొంతం చేసుకున్న జ్యోత్స్న తను తీసుకున్న నిర్ణయం గురించి, యువతరం ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి, వాటి పరిష్కారాల దిశగా తాము చేస్తున్న ప్రయాణం గురించి వివరించారిలా...

‘‘ఎంబీయే పూర్తయ్యాక బెంగళూరు, హైదరాబాద్‌లో అనేక కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. అక్కడ గమనించిన వాటిలో ముఖ్యమైనది యువత ఎంత ఎక్కువ శాతంలో ఉద్యోగంలో చేరుతున్నారో.. అంతే శాతంలో రిజెక్ట్‌ కూడా అవడం. కారణం... వారు చదువుకున్న కాలేజీలలో పాఠ్యాంశాలే తప్ప ఇతర నైపుణ్యాలు నేర్పించరు. విద్యార్థులు కూడా వాటి మీద దృష్టి పెట్టరు. కొందరు మాత్రమే రాణించడానికి, మిగతావాళ్లు వెనకబడటానికి గల కారణాలేంటో కొన్నాళ్లు గమనించాను.

ఉద్యోగంలో చేరినా.. పని సకాలంలో పూర్తిచేసే సామర్థ్యం చాలా మందిలో ఉండటం లేదు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండవు, టెక్నికల్‌ నాలెడ్జ్‌ అంతంత మాత్రమే. ఇలాంటప్పుడు కంపెనీలపై కూడా వీరి వల్ల ఒత్తిడి ఉంటుంది. కొన్నాళ్లు కొత్తగా చేరిన ఉద్యోగుల పనితీరును గమనించి, వారి ఫైల్స్‌ పక్కన పెట్టేస్తుంటారు. ఒక్క ఐటీ రంగమే కాదు, ఇతర రంగాల్లోనూ నైపుణ్యాల లేమి అనే సమస్య ఉంది. దీనికి కోవిడ్‌ కూడా ఒక అడ్డంకి అయ్యింది. కంపెనీలు చాలా వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అనే కాన్సెప్ట్‌ను ఎడాప్ట్‌ చేసుకున్నాయి.

క్యాంపస్‌ సెలక్షన్స్‌ లేవు. దీంతో విద్యార్థుల్లో సంస్థలకు కావల్సిన క్వాలిటీ శాతం బాగా తగ్గింది. సంస్థలు ఇప్పుడు క్వాలిటీ ఎంప్లాయీస్‌ కోసం అన్వేషిస్తున్నాయి. ఉద్యోగులకు నైపుణ్యాలు కల్పిస్తే కంపెనీలకు కావాల్సిన టెక్నికల్‌ మాన్‌ పవర్‌ను అందించగలం అనుకున్నాం. మావారు రాహుల్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవడంతో ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. మా ఇద్దరిదీ ఒకే రంగం అవడం వల్ల తీసుకున్న నిర్ణయాలను త్వరగా అమలు చేయగలుగుతున్నాం.   

మార్కులు కాదు ముఖ్యం..
నిజానికి ఇదొక ప్రయోగాత్మక కార్యక్రమమనే చెప్పవచ్చు. విద్యార్థులు–సంస్థల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలనుకున్నాను. అయితే, ఇందుకు కావల్సిన వనరుల గురించి కూడా ఆలోచించాం. అప్పటికే మాకున్న మాతృసంస్థ ‘ఇన్‌ప్రాగ్‌’ ద్వారా ఆర్థికసాయం తీసుకుంటున్నాం. పేద విద్యార్థులకు ఉచిత సేవలు అందించడానికి, అలాగే ఇతరులకూ నామమాత్రపు ఫీజుతో స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి సాధ్యమయ్యింది.

‘చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకున్నారు’ అని తెలిసిన వారంటుంటారు. కష్టమైనా ఇష్టంతో చేస్తున్న పని. ఎంతో మందికి ఉపయోగపడే పని’ అని చెబుతుంటాను. అత్యాధునిక నైపుణ్యాలకు అన్ని రంగాల్లోనూ అధిక డిమాండ్‌ ఉంది. అందుకని విద్యార్థులు ముందుగా స్పెషలైజేషన్‌లో భాగంగా వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది’ అని వివరించారు ఈ కెరీర్‌ప్లానర్‌.  

 చదువుకుంటూనే నైపుణ్యాలు
‘ఇది కొంచెం కష్టమైన పనే. కానీ, విద్యార్థులు తమ డిగ్రీ స్థాయిలోనే నైపుణ్యాలను అలవర్చుకుంటే, తర్వాత ఉద్యోగావకాశాలకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇది గుర్తించి కాలేజీల్లో వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నాం. డిగ్రీస్థాయివారి మాత్రమే కాదు ఇతర డిప్లొమా కోర్సులు చేసిన వారికి కూడా వారి కెరీర్‌ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తున్నాం. ఫలితంగా విద్యార్థి డిగ్రీ నాలుగేళ్లలోనే స్కిల్స్‌ పెంచుకుంటే, నేరుగా సంస్థల్లో తమ నైపుణ్యాలను చూపవచ్చు. విద్యార్థులు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సంపాదన మొదలుపెట్టడానికి ఫ్రీలాన్స్‌ అవకాశాలను కూడా సెట్‌ చేస్తున్నాం. ఇందుకు ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకున్నాం.’

– నిర్మలారెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement