జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2022: పిల్లలకు బంధాలు కావాలి

Jaipur Literature Festival 2022: Neena Gupta discusses mental health and relationships - Sakshi

స్త్రీ కలం.. స్త్రీ గళం – 4

‘ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవ్వరి మాటా వినం. కాని పిల్లలు పుట్టాక అన్నీ మెల్లగా అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి. తల్లీ తండ్రీ ఇద్దరూ కావాలి. తల్లి తరఫు ఉన్నవారూ తండ్రి తరఫు ఉన్నవారూ అందరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్‌ అవుతారు’ అంది నీనాగుప్తా. జీవితం ఎవరికైనా ఒక్కో దశలో ఒక్కోలా అర్థం అవుతుంది. క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌తో కుమార్తెను కన్న నీనా పిల్లల గురించి చెబుతున్న మాటలు వినదగ్గవి. ఆమె తన ఆత్మకథ ‘సచ్‌ కహూ తో’ గురించి జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో మాట్లాడింది.

‘వివ్‌ రిచర్డ్స్‌ (క్రికెటర్‌)తో నేను ప్రేమలో ఉన్నాను. పెళ్లితో సంబంధం లేకుండా బిడ్డను కనాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఎందరో మిత్రులు ఎన్నో రకాలుగా నాకు సలహాలు ఇచ్చారు. కాని నేను ఎవ్వరి మాటా వినలేదు. ముందుకే వెళ్లాను. మసాబా పుట్టింది. కాని సింగల్‌ పేరెంట్‌గా పిల్లల్ని పెంచడం చాలా చాలా కష్టం. ఆ విధంగా నేను మసాబాకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు బంధాలు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. వారి వైపు ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులు అందరూ కావాలి. మసాబాకు ఆ విధంగా తండ్రి వైపు నుంచి పెద్ద లోటును మిగిల్చాను’ అంది నటి నీనా గుప్తా.

 ఆమె రాసిన ‘సచ్‌ కహూ తో’ ఆత్మకథ మార్కెట్‌లో ఉంది. దాని గురించి మాట్లాడటానికి ఆమె ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’కు హాజరయ్యింది.
‘మాది తిండికి హాయిగా గడిచే కుటుంబం. కాని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. దాని వల్ల పిల్లలుగా మేము ఎదుర్కొన్న ఇబ్బంది పెద్దగా లేకపోయినా మా అమ్మ చాలా సతమతమయ్యేది. ఆమె బాధ చూసి నాకు చాలా బాధ కలిగేది. బాల్యంలో అలాంటి ప్రభావాలు గాఢమైన ముద్ర వేస్తాయి’ అందామె.

నీనా గుప్తా నటిగా పూర్తిగా నిలదొక్కుకోని రోజులవి. హటాత్తుగా వివ్‌ రిచర్డ్స్‌తో గర్భం దాల్చాను అని పత్రికలకు చెప్పి సంచలనం సృష్టించింది. 1989లో కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఎలా ఉంటుందో అని చాలా మంది ఆందోళనగా, కుతూహలంగా గమనించారు. ఇప్పుడు ఆమె నటిగా, కుమార్తె ఫ్యాషన్‌ డిజైనర్‌గా సక్సెస్‌ను చూస్తున్నారు. కాని ఈలోపు ఎన్నో జీవితానుభవాలు.

 ‘మసాబాను నెలల బిడ్డగా ఇంట్లో వదిలి నేను పనికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి షూటింగ్‌కి కూడా తీసుకెళ్లి షాట్‌కు షాట్‌కు మధ్యలో పాలు ఇచ్చేదాన్ని. ఆమె రంగు, రూపం... వీటిని చూసి పిల్లలు కామెంట్లు చేసేవారు. తండ్రి కనిపించేవాడు కాదు. నా కూతురుకు ఏది ఎలా ఉన్నా ‘యూ ఆర్‌ ది బెస్ట్‌’ అని చెప్తూ పెంచుకుంటూ వచ్చాను. కాని మనం ఎంత బాగా పెంచినా బంధాలు లేకుండా పిల్లలు పెరగడం ఏమాత్రం మంచిది కాదని చెప్పదలుచుకున్నాను’ అందామె.

అలాగే ఒంటరి స్త్రీని సమాజం ఎంత అభద్రతగా చూస్తుందో కూడా ఆమె వివరించింది. ‘సింగిల్‌ ఉమెన్‌గా ఉండటం వల్ల నేను ఇబ్బంది పడలేదు కానీ నా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదైనా పార్టీకి వెళ్లి ఏ మగాడితోనైనా ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ మగాడి భార్య తుర్రున పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేసేది. సింగిల్‌ ఉమెన్‌ అంటే పురుషులను వల్లో వేసుకునేవారు అనే ఈ ధోరణి అన్యాయం’ అని నవ్వుతుందామె.

స్త్రీలను వారి దుస్తులను బట్టి జడ్జ్‌ చేయడం అనే మూస నుంచి బయడపడాలని నీనా గట్టిగా చెబుతుంది. ‘నేను ఢిల్లీలో ఎం.ఏ సంస్కృతం చదివాను. కాలేజ్‌కు చాలా మోడ్రన్‌ బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని. సంస్కృతం చదువుతూ ఇలాంటి బట్టలు వేసుకుని వస్తుంది ఏమిటి అని ఏ ఆడపిల్లా నాతో మాట్లాడేది కాదు. నేను ఆ పక్కనే ఉండే మరో కాలేజ్‌కు వెళ్లి క్యారెమ్స్‌ ఆడుతూ కూచునేదాన్ని. చివరకు ఫస్ట్‌ ఇయర్‌లో నాకు మంచి మార్కులు రావడం చూసి అందరూ నాకు ఫ్రెండ్స్‌ అయ్యారు’ అందామె.

ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది. ‘ముంబైలో నా కెరీర్‌ మొదలులో రచయిత గుల్జార్, నేను రోజూ బాడ్‌మింటన్‌ ఆడటానికి కారులో వెళ్లేవాళ్లం. ఇద్దరం షార్ట్స్‌ వేసుకుని పక్కపక్కన కూచుని వెళ్లేవాళ్లం. ఇన్నేళ్ల తర్వాత మొన్న నేను షార్ట్స్‌లో ఆయన ఇంటికి వెళ్లి నా ఆత్మకథ కాపీ అందించాను. అది నెట్‌లో చూసి ‘హవ్వ.. గుల్జార్‌ గారిని కలవడానికి వెళ్లి ఈ వయసులో షార్ట్స్‌ వేసుకుంటావా’ అని ట్రోలింగ్‌. అరె.. ఏమిటిది? ఎండగా ఉంది వేసుకున్నాను... లేదా కాళ్లు బాగున్నాయని వేసుకున్నాను. మీకేంటి నొప్పి’ అంటుందామె.

 నీనా గుప్తాకు నటిగా ఎంత ప్రతిభ ఉన్నా ఆమెకు కమర్షియల్‌ సినిమాల్లోకాని పార్లల్‌ సినిమాల్లో కాని లీడ్‌ రోల్స్‌ రాలేదు. ‘షబానా ఆజ్మీ తన సినిమాల్లో వేసిన పాత్రలన్నీ వేయాలని నాకు ఉంటుంది. ఆర్ట్‌ సినిమాల్లో కూడా అన్నీ హీరోయిన్‌ పాత్రలు షబానా, స్మితా పాటిల్, దీప్తికి దక్కాయి. అది నాకు బాధే. కాని ఇప్పుడు నేను లీడ్‌ రోల్స్‌ చేసి హిట్స్‌ కొడుతున్నాను. అది ఆనందం’ అంటుందామె.

 నీనా గుప్తా అమెరికాలో తీస్తున్న ఒక బాలీవుడ్‌ సినిమాలో తెలుగు పనిమనిషిగా నటిస్తోంది. ఆమె నటించిన ‘పంచాయత్‌’ వెబ్‌ సిరీస్‌ చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
‘స్త్రీలుగా మీరు ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్‌ ఉంటుంది. అది గమనించుకుని యూ ఆర్‌ ది బెస్ట్‌ అనుకోండి. అదే మీ సక్సెస్‌మంత్ర’ అందామె.
ఆమె నిజమే చెబుతోంది. అందుకే ఆమె పుస్తకం పేరు ‘సచ్‌ కహూ తో’.

– సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top