
బ్రహ్మ మానస పుత్రుడు అత్రి మహర్షి. మహా సాధ్వి అనసూయ ఆయన భార్య. యోగ్యులూ, ముల్లోకాలకూ పూజనీయులూ స్తుతిపాత్రులూ అయిన మహనీయులు తమకు సంతానంగా కలగాలని అత్రి మహర్షి నూరేళ్ళు తపస్సు చేశాడు. ప్రాణాయామం చేత మనసును నియంత్రించి, గాలి మాత్రమే ఆహారంగా, ఒంటి కాలి మీద నిలబడి తపస్సు చేశాడు. ‘ఈ జగత్తు అంతటికీ ప్రభువైన భగవంతుడెవరో, ఆయన తనతో సమానమైన ఘనులను నాకు సంతానంగా ప్రసాదించు గాక!’ అని తపస్సు చేశాడు. నూరేళ్ల తరవాత, కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో, హంస, గరుడ, వృషభ వాహనాలను అధిష్ఠించి ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏకకాలంలో ఆయన ముందు సాక్షాత్కరించారు. ‘‘త్రిమూర్తులారా! నేను తపస్సు చేసింది. జగదీశ్వరుడొక్కడి గురించి. ఆయన కాకుండా, నా తపఃఫలంగా, మీ ముగ్గురు మహనీయులూ నాముందు ప్రత్యక్షం కావటం, నా తపః సంకల్పానికి భిన్నంగా ఉంది!’’ అని.
‘‘సాటిలేని మహర్షివి నువ్వు తపస్సు చేస్తే, నీ సంకల్పమే సిద్ధిస్తుంది. అన్యదా జరగదు. ‘యథా కృతః తే సంకల్పః భావ్యం తేన ఏవ, న–అన్యధా!’ (భాగవతం) మా ముగ్గురి కలయికే నువ్వు ధ్యానించిన జగదీశ్వరుడు. కాబట్టి జగదీశ్వరుడిని నువ్వు ధ్యానించినప్పుడు, నువ్వు ధ్యానించింది మా ముగ్గురినీ! నువ్వు సంకల్పించినట్టే, మా ముగ్గురి అంశలతో, మాకు సములైన ముగ్గురు కుమారులు కలుగుతారు’’ అని వరమిచ్చి వెళ్ళారు. ఆ ప్రకారమే, అత్రి–అనసూయలకు బ్రహ్మ అంశతో చంద్రుడూ, విష్ణువు అంశతో దత్తాత్రేయుడూ, శివాంశతో దుర్వాసుడూ కుమారులుగా కలిగారు. అత్రి–అనసూయ పుణ్య దంపతుల గురించిన కథలు రామాయణ, భారత, భాగవతాలలోనూ, ఇతర పురాణాల్లోనూ కనిపిస్తాయి. జగదీశ్వర తత్త్వం గురించిన పై కథ భాగవతం నాలుగో స్కంధంలోనిది.
– ఎం. మారుతి శాస్త్రి