పురాణ స్త్రీల మరో అన్వేషణ

Ira Mukoti Literaure In Jai Pur Literature Festival 2022 - Sakshi

జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌ 2022 స్త్రీ కలం.. స్త్రీ గళం – 5

‘నేను రాసిన మహా భారతంలో
ద్రౌపది వస్త్రాపహరణం ఉంటుంది...
కాని శ్రీ కృష్ణుడు వచ్చి దుస్తులు ఇవ్వడు...
ద్రౌపది తానే ఆ ఘట్టాన్ని ఎలా
ఎదుర్కొని ఉంటుందో రాశాను’ అంటుంది ఇరా ముఖోటి.
మహా భారతాన్ని అందులోని స్త్రీ పాత్రల కోణంలో
వ్యాఖ్యానిస్తూ ఇరా ముఖోటి రాసిన
‘సాంగ్‌ ఆఫ్‌ ద్రౌపది’ ఎన్నో ఆలోచనలు రేపుతోంది.
ప్రశంసలూ పొందుతోంది.
కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో నేచురల్‌ సైన్సెస్‌ చదివిన ఇరా పురాణ స్త్రీలను పునర్దర్శించే పనిలో ఎందుకు పడిందో ‘జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాఠకులతో పంచుకుంది.
 

‘సమాజం చాలా ఆధునిక స్థాయికి చేరింది. ఇంగ్లిష్‌ భాషలో మాట్లాడి ఆలోచించే వర్గం మన దేశంలో స్థిరపడింది. అదే సమయంలో ప్రతి ఇల్లూ మూలాలకు దూరంగా జరుగుతూ ఏకాకిగా మారుతోంది. అలాంటి సమయాలలో పురాణాల వైపు చూసి వాటిని మళ్లీ చదవడం ద్వారా అంతో ఇంతో ఓదార్పు పొందడం జరుగుతోంది. పురాణాలను మళ్లీ వ్యాఖ్యానిస్తూ ఇంగ్లిష్‌లో వస్తున్న రచనలను కూడా అలాగే చూడాలి’ అంటుంది ఇరా ముఖోటి.

ఫార్మస్యూటికల్‌ రంగంలో చాలా ఏళ్లు ఉన్నతోద్యోగం చేసిన ఇరా రచన పట్ల తన ఆసక్తిని కూడా పెంచుకుంటూ వచ్చింది. ఒక దశలో ఉద్యోగం మానేసి గమ్యం లేనట్టుగా తిరుగుతూ రచయితగా ఉండటమే తన నిర్ణయంగా బలపరుచుకుంది. ఆ తర్వాత ఆమె ఉద్యోగం వైపు చూళ్లేదు. ఫుల్‌టైమ్‌ రైటర్‌గా మారిపోయింది.

‘నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నా కూతుళ్లు ఇద్దరూ చిన్నవాళ్లు. వాళ్లను తీసుకుని ప్రతి సంవత్సరం రామ్‌లీల చూడటానికి వెళ్లేదాన్ని. నాటకం చివరలో సీత రాముడి పక్కన సింహాసనం పై కూచోవడం చూసి నా కూతుళ్లు చప్పట్లు కొట్టేవాళ్లు. నాకు అనిపించేది... సీత అలా కూచోవడం వెనుక ఎన్ని సవాళ్లను ఎదుర్కొంది.. ఎన్ని పరీక్షలకు తల ఒంచింది... ఇవన్నీ నా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలనిపించేది. సీత ఎంతో ఆదర్శప్రాయమైన స్త్రీ. ఆమెకు కష్టాలు తప్పలేదు. అదే సమయంలో ‘నిర్భయ’ ఘటన జరిగింది. అది నా మనసు కలచి వేసేలా చేసింది. స్త్రీలు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా, ఎంత ముందంజ వేసినా వారిపై దాష్టీకాలు ఉంటాయి అనిపించింది. ఆ సమయంలోనే పురాణపాత్రలను మళ్లీ రాయాలనుకున్నాను. వెంటనే ‘సాంగ్‌ ఆఫ్‌ ద్రౌపది’ నవల రాశాను.’ అందామె.

అలా రైటర్‌ అయిన ఇరాను ఆమె పబ్లిషర్‌ ప్రోత్సహించాడు. ‘నీకు చరిత్ర అవగాహన బాగా ఉంది. ముందు హిస్టారికల్‌ నాన్‌ ఫిక్షన్‌ రాయి’ అని సలహా ఇచ్చాడు. దాంతో ఇరా రాయడం మొదలెట్టింది. ‘హీరోయిన్స్‌: పవర్‌ఫుల్‌ ఇండియన్‌ విమెన్‌ ఆఫ్‌ మిత్‌ అండ్‌ హిస్టరీ’, ‘క్వీన్స్‌ అండ్‌ బేగమ్స్‌ ఆఫ్‌ మొఘల్‌ అంపైర్‌’, ‘అక్బర్‌– ది గ్రేట్‌ మొఘల్‌’ పుస్తకాలు వచ్చాయి. ఆ తర్వాత అన్నింటి కంటే ముందు రాసిన ‘సాంగ్‌ ఆఫ్‌ ద్రౌపది’ నవల బయటకు వచ్చింది.

అయితే ‘ద్రౌపది’ పాత్ర మీద పున ర్వా్యఖ్యానం, పునఃచిత్రణ కొత్త కాదు. ప్రాంతీయ భాషలలో, ఇంగ్లిష్‌లో ఎన్నో రచనలు వచ్చాయి. తెలుగులో యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌ రాసిన ‘ద్రౌపది’ (2009) నవల  చాలా చర్చోపచర్చలకు కారణమైంది. 2010లో అదే నవలకు సాహిత్య అకాడెమీ బహుమతి దక్కితే దుమారం రేగింది. కాని ఇరా రాసిన ‘సాంగ్‌ ఆఫ్‌ ద్రౌపది’ అమె రచనా శైలి, ఆలోచనా శైలితో ఆకట్టుకుంటోంది.

‘ద్రౌపది భారతీయ స్త్రీల కోపానికి ప్రతిరూపం. స్త్రీ ఆగ్రహానికి పురుష సమాజంలో అనుమతి లేదు. కాని ద్రౌపది తన కోపాన్ని ప్రదర్శించగలిగింది. ఆమె నిండు కౌరవసభలో తన భర్తలను నిలదీయ గలిగింది. ఆత్మగౌరవం కోసం పెనుగులాడింది. ఆ సమయంలో ఆమె ఏకవస్త్ర. అయినా సరే కౌరవసభకు సమాధానం చెప్పగలిగింది.’ అంటుందామె.

అయితే అందరూ తరతరాలుగా చెప్పుకుంటున్న ఆ ‘వస్త్రాపహరణం’ ఘట్టంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యి చీరలు ఇవ్వడాన్ని ఇరా రాయలేదు.

‘1930లో మన దేశంలో ఒక పండిత వర్గం, చరిత్రకారుల వర్గం కలిసి కొన్నాళ్లు పూణెలో కూచుని మహాభారతంలోని ప్రక్షిప్తాలన్నీ తొలగిస్తూ సిసలైన మహాభారతాన్ని తేల్చారు. నేను వారు కూర్చిన మహాభారతాన్ని నా రచనలకు ప్రామాణికంగా తీసుకున్నాను. వాస్తవ దృష్టితో చూస్తే అది రాజ్యం కోసం అన్నదమ్ముల మధ్య తగవు. కృష్ణుడు కూడా ఈ వాస్తవిక దృష్టిలో ఒక రాజకీయవేత్తగా కనిపించాడు నాకు. అందుకే దైవశక్తులు ఉన్న కృష్ణుడిని నా వస్త్రాపహరణ ఘట్టంలో పెట్టలేదు. ద్రౌపదినే ఆ ఘటనను ఎదుర్కోనిచ్చాను’ అంటుందామె.

పురాణాలలో ఉన్నత వర్గాల ప్రయోజనాలు నిమ్నవర్గాల ప్రజలకు ఎలా చేటు చేశాయో చూపే ప్రయత్నం చేస్తుంది. ‘లక్క ఇంటిలో పాండవులను కాపాడటానికి కుంతి ఒక గిరిజన తల్లిని, ఐదుమంది పిల్లలను తమకు మారుగా పడుకోబెడుతుంది. ఆ అమాయకులు అగ్నికి ఆహుతి అవుతారు. ఇది ఎంత అన్యాయం. ఏకలవ్యుడు, ఘటోత్కచుడు పాండవ, కౌరవులతో సమగౌరవం ఎందుకు పొందలేదో చూడాలి’ అంటుంది. కురుక్షేత్ర యుద్ధం వల్ల వితంతువులుగా మారిన కౌరవుల భార్యల దిక్కులేని స్థితిని ఇరా తన పుస్తకంలో రాస్తుంది. ‘సతీ సహగమనం’ ఆ సమయంలోనే ఉనికిలోకి విస్తారంగా వచ్చి ఉంటుందని ఆమె ప్రతిపాదన.

ఏమైనా ఇది అంతులేని అన్వేషణే. కాలం గడిచేకొద్ది నాటి పాత్రలు కొత్త అర్థాలతో భారతజాతిని మేల్కొలుపుతూనే ఉంటాయి. ఇరా ముఖోటి వంటి మహిళా రచయితలు ఆ పనిలో భాగం కావడమే ఇప్పుడు వార్త.
– సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top