Mother's Day: అమ్మ కూడా మనిషే

International Mothers Day 2021 Recognise Mothers Role At Home - Sakshi

అమ్మ.. టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌
నాన్న... భక్తితో ఇచ్చే గౌరవం
అమ్మ.. ఏమీ తెలియదనే అభిప్రాయం
నాన్న.. అన్నీ తెలుసనే నమ్మకం
అమ్మ.. జీతం అక్కర్లేని పనిమనిషి
నాన్న.. జీవితాలు నిలబెట్టే యజమాని 
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు వర్ణనలు అమ్మానాన్న గురించి. అన్నింట్లోకి.. నాన్నే మిన్న. అన్నీ భరించేది అమ్మే. ఆత్మగౌరవ భంగపాటు నుంచి వెట్టి చాకిరి వరకు అవమానాలు అన్నీ ఆమె ఖాతాలోనే. వాటికోసం ఆమె పుట్టలేదు. అమ్మను వరించడానికే అవి వేచి చూడట్లేదు. త్యాగం అమ్మకు పర్యాయ పదం కాదు. సహనం అమ్మ ఆస్తి కాదు. భరించే శక్తి అమ్మకు పేటెంట్‌నివ్వలేదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అమ్మకూ అత్యవసరాలే. సరదాలు, సంతోషాలూ అమ్మకూ హక్కులే. అమ్మ దేవత కాదు..  అభయహస్తం ఇవ్వడానికి.అమ్మ రోబో కాదు.. కోరిందల్లా క్షణాల్లో చేసిపెట్టడానికి.అమ్మ మనిషి... రక్తమాంసాలున్న మనలాంటి మనిషి. అలసట, అనారోగ్యం, నీరసం, నిస్తేజం, నిస్పృహ ఆమెకూ అనుభవమే! ఈ ఎరుక మనకు రావాలి. తేగల.. తెప్పించగల వ్యక్తి నాన్న.  కుటుంబ సభ్యుల్లో వచ్చే ఆ సోయే అమ్మకు కానుక.. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా!!

దూరదర్శన్‌ రోజుల్లో (1980లు) ఆహారంలో ఐరన్‌కు సంబంధించి ఒక యాడ్‌ వచ్చేది. వండిందంతా ఇంట్లో వాళ్లకు పెట్టేస్తుంది ఆ ఇంటి ఇల్లాలు. ‘మరి మీకేది?’ అని అడిగితే.. ‘నాకేంటి ఈ కాస్తంత అన్నం చాలు. పచ్చడితో సరిపెట్టుకుంటా’ అంటుంది. దాని వల్ల ఐరన్, ఇతర పోషక పదార్థాలు అందవు. ఇంట్లో వాళ్లకే కాదు మీకూ బలవర్థకమైన ఆహారం కావాలి. మీరిలా మిగిలిన అన్నాన్ని పచ్చడితో సరిపెట్టుకుంటే కుదరదు’ అని వాయిస్‌ ఓవర్‌ వస్తుంది.. మహిళల్లో ఆరోగ్య స్పృహ కలిగించేలా.

ప్రైవేట్‌ చానెళ్ల కాలంలో (2020.. అంటే ఇప్పటికీ).. 
ఉదయం లేవగానే మామగారు తనకేం టిఫిన్‌ కావాలో ఆర్డర్‌ వేస్తారు. భర్తా తన ఫర్మాయిష్‌ను వినిపిస్తాడు. పిల్లలూ వాళ్లకు నచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌కు అర్జీ పెట్టుకుంటారు. ఏమాత్రం విసుగు, ఇంకో మనిషి సహాయం లేకుండా కుటుంబ సభ్యులు కోరినవన్నీ క్షణాల్లో వండిపెడుతుంది. ఇంటిల్లిపాదీ వాటిని ఆస్వాదించి ఆమె వైపు అభినందనగా చూస్తారు. ఆమె సంతృప్తిగా నిట్టూరుస్తుంది. ఇది ఎమ్‌టీఆర్‌ వాళ్ల ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ వ్యాపార ప్రకటన. ఇంట్లో వాళ్ల కోరికల చిట్టా తీసుకొని ఆమె వంటింట్లోకి వెళ్లగానే ఆమెకు ఆరు చేతులు వచ్చినట్టుగా గ్రాఫిక్స్‌ చేస్తారు.

1980లకు, 2020వ దశకానికి తేడా అది. ఒక్క ఎమ్‌టీఆరే కాదు రకరకాల బ్రాండ్ల నూనెలు, సాంబారు, మసాల పొడుల కంపెనీల వ్యాపార ప్రకటనలూ ఇదే ధోరణిలో కనిపిస్తున్నాయి. ఆరు చేతుల సూపర్‌ ఉమన్‌గా, తన ఆకలిని త్యాగం చేసి ఇంట్లో వాళ్ల సంక్షేమమే లక్ష్యంగా జీవించే ఇల్లాలిగా మాతృమూర్తిని చిత్రీకరిస్తున్నాయి. అమ్మ అనే హోదా మీద అపోహలను పెంచుతున్నాయి. తమ ఉత్పత్తులకు పేరుగాంచిన నటీమణులను మోడల్స్‌గా పెట్టి  అమ్మ అంటేనే బండెడు చాకిరి అనే తప్పుడు భావనలను ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ మంచిగానో... చెడుగానో ప్రభావితం చేస్తాయని మానసిక, మార్కెట్‌ విశ్లేషకుల అభిప్రాయం. 

మార్చుకుంది
మెఘన్‌ మార్కల్‌ (అమెరికన్‌ నటి, ప్రిన్స్‌ హ్యారీ భార్య) చిన్నప్పటి సంఘటన ఇది.  స్కూల్లో ఇంటర్వెల్‌ బ్రేక్‌లో ఆమె టీవీ చూస్తుండగా ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కంపెనీ ‘డిష్‌ బార్‌ సోప్‌’  యాడ్‌ వచ్చిందట. అందులో అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డు పాత్రలతో యుద్ధం చేస్తున్నారు అనే మాట వాడారట. అది విని పదకొండేళ్ల మెఘన్‌ బాగా నొచ్చుకుంది. ఇంటికెళ్లాక వాళ్ల నాన్నను అడిగింది. ‘గిన్నెలు తోమడం కేవలం ఆడవాళ్ల పనేనా?’ అని. ‘కాదు ఏం?’ అన్నాడు తండ్రి. ఆ వ్యాపార ప్రకటన గురించి చెప్పింది. ‘ఆ కంపెనీ యజమానికి ఉత్తరం రాయు’ సలహా ఇచ్చాడు. రాసింది.

ప్రతిస్పందనా వచ్చింది ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ యాజమాన్యం నుంచి. ‘అమెరికాలోని ప్రజలంతా జిడ్డు పాత్రలతో యుద్ధం చేస్తున్నారు’ అని యాడ్‌ను మార్చుకుంటూ.  వంట చేయడం, వంటపాత్రలు తోమడం, బట్టలుతకడం, పిల్లలను పెంచడం కేవలం ఆడవాళ్ల పనులే  కాదు  మగవాళ్లూ  పంచుకోవాల్సినవి అనే ఎరుక మెఘన్‌కు వాళ్ల నాన్న కల్పించాడు కార్యాచరణతో. 

అమ్మతో నాన్న ఉండే తీరు.. ఆమెను తనతో సమానంగా చూసే పద్ధతి ..  కచ్చితంగా పిల్లలను ప్రభావితం చేస్తాయి. నాన్నా అమ్మను గౌరవంగా చూస్తేనే పిల్లలూ ఆమెను గౌరవిస్తారు. శశి వంటల్లో మేటి. ఆ ఘుమఘుమలతోనే ఆకలి పుడుతుంది. అది అరుదైన ప్రతిభ అని భర్త సతీష్‌కు అర్థం కాదు. అందుకే   ‘ఆడవాళ్లు చేసిన వంట మగవాళ్లు చేస్తే ఆర్ట్‌ (కళ) అవుతుంద ’ని శశి వెటకారమాడుతుంది. తగ్గట్టుగానే సతీష్‌ ఆమెను మెదడులేని యంత్రంగానే పరిగణిస్తాడు. మూర్ఖురాలిగా అవమానిస్తుంటాడు. తల్లిని అలా జమకట్టే ఆ తండ్రి.. బిడ్డకు ప్రతిభావంతుడిగా కనిపిస్తాడు.

ఆమే తండ్రి వరుసను కొనసాగిస్తుంటుంది.  ఏదైనా చెప్పబోతే ‘ఇదేమన్నా లడ్డూలు చేయడం అనుకున్నావా?’ అంటూ హేళన చేస్తుంది. తల్లి పేరెంట్‌ మీటింగ్‌కి  వస్తే ఆమె ఇంగ్లిష్‌ ఉచ్ఛారణకు టీచర్స్‌ ఎక్కడ నవ్వుతారోనని బెంబేలెత్తిపోతుంది. తండ్రీకూతుళ్ల పద్ధతితో శశి అహం దెబ్బతింటుంది. పట్టుదలతో ఇంగ్లిష్‌ నేర్చుకుంటుంది. ఆ ఇన్‌స్టిట్యూట్‌లోని సహ విద్యార్థి శశి టాలెంట్‌ను ఇష్టపడ్తాడు. ప్రేమను వ్యక్తం చేస్తాడు.

అప్పుడు చెప్తుంది ఆ అమ్మ.. ‘నాకు ప్రేమకు కొదవలేదు.. గౌరవమే కరువైంది’ అని. ఇది ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ చిత్రంలోని శశి పాత్ర (శ్రీదేవి) మాటే అయినా ప్రపంచంలోని దాదాపు తొంభై శాతం అమ్మలు చెప్పాలని.. గొంతెత్తి అరవాలనుకుంటున్న మాట కూడా. దీన్ని నాన్నలు వినాలి. ఇంట్లో పని వ్యాకరణాన్ని మార్చాలి. తగ్గట్టుగా సిలబస్‌ను కూర్చాలి. 

నాన్నే గురువు
పిల్లలకు తొలి గురువు అమ్మే కాదు నాన్న కూడా. ఇంకా చెప్పాలంటే నాన్నే. మాటలు, చేతల్లో మంచి మర్యాద నేర్పేది.. నేర్పాల్సింది నాన్న. అమ్మను తన తోటి జెండర్‌గా పరిగణిస్తూ, ఆమె ఆలోచనలను గౌరవిస్తూ, ఆమె ఇంటి నిర్వహణా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, ఆమె కర్తవ్యాల్లో తానూ భాగమవుతూ! అవి చూస్తూ పెరిగిన పిల్లల్లో అమ్మ పట్ల ఉన్న చులకన భావం పోతుంది. నాన్నంటే ఉన్న అతిశయోక్తీ కరిగిపోతుంది. ఆకలిదప్పులకు ఎలా లింగ వివక్ష ఉండదో, వంటవార్పు, ఇల్లు ఊడ్వడం, బట్టలు ఉతకడం వంటి ఎన్నో ఇంటి పనులకూ జెండర్‌ డిస్క్రిమినేషన్‌ ఉండదు. ఉద్యోగం పురుష లక్షణం అనే నానుడితో ఇల్లే ఇల్లాలి ఉద్యోగం అనే ప్రాక్టికాలిటీని ముందుంచారు. రెండూ తప్పే అని తెలుసుకోవాల్సిన కాలం ఇది. 

చదువుకి జెండర్‌ లేదు. ఉద్యోగాలకూ జెండర్‌ ఉండదని నిరూపితమవుతోంది. ప్రతిభకు లింగ వివక్ష అన్న తలంపే రాదని తెలిసిపోయింది. అమ్మలు ఏలని రంగాల్లేవు. రాకెట్లనూ డిజైన్‌ చేస్తున్నారు. అంతరిక్ష కక్ష్యలోకీ ప్రవేశ పెడుతున్నారు.. పొత్తిళ్లలో బిడ్డను ఎత్తుకున్నంత జాగ్రత్తగా. ఇలా బయటి ప్రపంచంలో తమ ఉనికిని వీళ్లు ఇంత సునాయాసంగా చాటగలుతున్నప్పుడు ఇంట్లోని అంట్ల పనుల్లో.. వంట పనుల్లో.. ఇతరత్రా పనుల్లో పురుషులు ఎందుకు తమ నైపుణ్యాన్ని పరీక్షించుకోరు! మీ ఇంటి అమ్మాయి అత్తింట్లో గౌరవంగా ఉండాలంటే మీ ఇంటి కోడలిని మీరు గౌరవించాలి. ఈ పాఠాన్ని నాన్న నుంచే నేర్చుకుంటాడు కొడుకు. ఆర్థిక వ్యవహారాలను నిర్వహించగలిగే భార్య దొరికినప్పుడు.. అంట్ల పనిలో నైపుణ్యం చూపించే సత్తా కొడుక్కీ ఉండాలి. దానికి నాన్నే గురువు కావాలి. 

అమ్మకూ స్వాతంత్య్రం కావాలి
అమ్మ కంటే ముందు ఆమె ఒక మనిషి. ఆశలు, ఆశయాలూ ఉన్న యాంబీషియస్‌ (చదువు, ఉద్యోగం మొదలైనవాటితో సంబంధం లేకుండా) ఉమన్‌. వాటిని నెరవేర్చుకునే స్వేచ్ఛ, స్వాతంత్య్రం కావాలి ఆమెకు. ఆ వెసులుబాటు కుటుంబమే కల్పించాలి. దీనికీ నాన్నే నాంది పలకాలి అమ్మను అర్థం చేసుకుంటూ. చూస్తూ తెలుసుకుంటారు  ఇంటి పనికి లింగవివక్ష ఉండదని. అమ్మ స్థానాన్ని   గౌరవించడం అలవర్చుకుంటారు. ఇంట్లో పనిభారం తగ్గి సమయం దొరికితే బయటి ప్రపంచంలోనూ అమ్మ అద్భుతాలు చేస్తుంది. అలా తన సొంత ప్రయత్నాలతో ఆమె తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడమంటే జెండర్‌ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో మన దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టడమే. మన ప్రగతిని చాటడమే. 

అమ్మలూ అప్‌డేట్‌ అవ్వాలి
మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్థకం వంటి మాటలను ఒంటబట్టించుకోకపోవమే మంచిది. ఇది కఠోర వాస్తవంలా అన్పించినా నిఖార్సయిన నిజం.  అమ్మ బిడ్డ ఆకలి తీరిస్తే నాన్న బిడ్డ కాలకృత్యాల సంగతి చూడాలి. అమ్మ బిడ్డకు స్నానమూ, నిద్ర పుచ్చడమూ చేయిస్తుంటే నాన్న వంట సంగతి పట్టించుకోవాలి. హలో.. ఇవన్నీ నాన్న చేస్తూ కూర్చుంటే ఆఫీస్‌ పని ఎవరు చూస్తారంటూ విసుక్కోవద్దు. ఇప్పుడు చాలాచోట్ల మెటర్నిటీ లీవునే కాదు పెటర్నిటి లీవునూ కల్పిస్తున్నారు. లేనిచోట డిమాండ్‌ చేసే అవకాశమూ ఉంది. అదీలేకపోతే  పిల్లల పెంపకం డ్యూటీలో వంతుల సర్దుబాటునూ చేసుకోవచ్చు. మనసుంటే మార్గాలు అనేకం. అన్వేషించుకోవచ్చు. 

ఉద్యోగం, ఇంటి పని.. మనిషి లక్షణం. ఆలస్యంగానైనా ఈ సత్యాన్ని గుర్తించాయి  చాలా కంపెనీలు. తగ్గట్టుగానే తమ ఉత్పత్తుల వ్యాపార ప్రకటనలను మారుస్తున్నాయి. ల్లాయిడ్‌ తన వాషింగ్‌ మెషీన్‌ కోసం చేసిన వ్యాపార ప్రకటనే ఒక ఉదాహరణ. కొత్తగా పెళ్లయిన ఓ జంట వాషింగ్‌ మెషీన్‌ కొనడానికి వెళ్తారు. భార్య వాషింగ్‌ మెషీన్స్‌ చూస్తుంటే భర్త ఫోన్‌ చెక్‌ చేసుకుంటుంటాడు. సేల్స్‌మన్‌ ‘సర్‌ వాషింగ్‌ మెషీన్‌ మెడల్స్‌’ అని చూపించబోతాడు.  ‘అది ఆమె డిపార్ట్‌మెంట్‌.. ఆమెకు చూపించండి’ అని భార్యనుద్దేశిస్తూ అంటాడు భర్త.

అప్పుడు భార్య అడుగుతుంది సేల్స్‌ మన్‌ని ‘యూనిసెక్స్‌ వాషింగ్‌ మెషిన్‌ మోడల్స్‌ ఉన్నాయా?’ అని.  ‘వాషింగ్‌ మెషీన్‌ ఆడవాళ్ల బట్టలు, మగవాళ్ల బట్టలు ఇద్దరివీ ఉతుకుతుంది’ అని వ్యంగ్యంగా అంటాడు భర్త. ‘నిజమే కాని మీరెప్పుడూ ఆ పని చేయలేదు కదా’ అని కౌంటర్‌ ఇస్తుంది భార్య. అప్పుడు చూపిస్తాడు సేల్స్‌మన్‌ ఆడవాళ్లు, మగవాళ్లు ఎవరైనా తేలికగా ఆపరేట్‌ చేసే ఫుల్లీ ఆటోమెటిక్‌ వాషింగ్‌ మెషీన్‌ని. అనివార్యంగా దాని గురించి తెలుసుకుంటాడు భర్త. ఇలా వంటింటి సామాగ్రిని అమ్మే కంపెనీలు కొన్నీ తమ వ్యాపార ప్రకటనలను సవ్యం చేశాయి. రజనీగంధ పెరల్స్‌ వాళ్లు మదర్స్‌ డే సందర్భంగానే పిల్లల్లో అమ్మ టేకెన్‌ ఫర్‌ గ్రాంటెడ్‌ కాదు అని చూపించే యాడ్స్‌ చేశారు. ఒక తల్లి తన టీన్స్‌ కూతురి ప్రవర్తన గురించి ఆందోళన పడుతూంటుంది. ఎక్కడికి వెళ్తున్నావ్, ఎవరితో వెళ్తున్నావ్‌ వంటి ప్రశ్నలతో అమ్మాయి భద్రతను పర్యవేక్షిస్తుంటుంది.

ఒకరోజు చాలా పొద్దుపోయాక ఇల్లు చేరిన కూతురితో ‘ఇంత రాత్రిదాకా ఎక్కడికెళ్లావ్‌? ఫోన్‌ చేస్తుంటే కూడా ఆన్సర్‌ చేయవు’ అని అడుగుతుంది. ఇరవై నాలుగ్గంటలూ నన్ను కనిపెట్టుకొని ఉండకపోతే అమ్మమ్మ దగ్గరకు వెళ్లొచ్చు కదా.. నీకు, మాకూ తెరిపిగా ఉంటుంది’ అంటుంది చిరాగ్గా. ఆ తెల్లవారే పిల్లలు లేచేసరికి అమ్మ ఇంట్లో ఉండదు. అమ్మ చేసే పనంతా ఆ కూతురి మీదే పడుతుంది. తనకన్నా చిన్నవాళ్లయిన తోబుట్టువులిద్దరినీ స్కూల్‌కు రెడీ చేయడం, వాళ్లకు, నాన్నకు లంచ్‌ బాక్స్‌లు పెట్టడం, ఇల్లు సర్దుకోవడం, సాయంకాలానికి స్నాక్స్‌ తయారు చేయడం, రాత్రి భోజనం వండడం వగైరా వగైరా.

ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు అమ్మాయికి. ఒక్కరోజుకే చుక్కలు కనిపించి ‘అమ్మా ఎప్పుడొస్తావ్‌’ అనుకుంటుంది. ఆ రాత్రికే అమ్మ వచ్చేస్తుంది. బిడ్డ కళ్లల్లో నీళ్లు. ‘థాంక్స్‌ అమ్మా.. ఒక్కరోజు సెలవు తీసుకొని నీ వాల్యూ ఏంటో తెలుసుకునేలా చేశావు’ అంటూ అమ్మను హత్తుకుంటుంది. పనిగంటల నియమం లేని అమ్మ  చాకిరీకి డబ్బులతో లెక్కగడితే నాన్న సంపాదన సరిపోదు. తరతరాల ఆస్తీ సరితూగదు.  

అమ్మలూ మారాలి
మీ సుఖమే నే కోరుకున్నా.. అందుకు నా జీవితాన్నే ధారపోస్తున్నా అని ఆనందబాష్పాలు రాల్చే అమ్మలు మారాలి. ‘నేను లేకపోతే మా ఇల్లు నడవదండీ.. మావారికి స్టవ్‌ వెలిగించడం రాదంటే నమ్మండీ... బ్రష్‌ మీద టూత్‌ పేస్ట్‌ పెట్టడం దగ్గర్నుంచి రాత్రి పడుకున్నాక దుప్పటి కప్పడం వరకు అన్నీ నేనే చేయాలి. ఇప్పటికీ (ఇరవై ఏళ్లు వచ్చినా)పిల్లలకు గోరుముద్దలు తినిపించాల్సిందే. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే సరిపడా కూరలు, రోటి పచ్చళ్లు, పులిహోర పులుసు అన్నీ చేసి ఫ్రిజ్‌లో పెట్టెళ్లినా.. అన్నం  వండుకోవడం చేతకాదు.  పక్కవాళ్లను బతిమాలాలి.. అంటూ గర్వంగా చెప్పుకునే ఇల్లాళ్లు ఆ మాటలను మానేయాలి.

కుటుంబ సభ్యులనంత పరాధీనులుగా చేయడం  స్వయంకృతాపరాధం. నేటి ఆ పరాధీనత రేపు ఆ ఇంటికి వచ్చే మరో ఆడపిల్లకు నరకంగా మారుతుంది. ఇంకో ఇంటి పరాధీనత మనింటి అమ్మాయిని వంటింటికే అంకితం చేస్తుంది. త్యాగమయి అనే బిరుదు భ్రమ. ఎవరి పని వాళ్లు చేసుకునేలా బాల్యం నుంచే పిల్లలకు తర్ఫీదునివ్వాలి. భార్యగా సంసారంలోని మొదటి అడుగులోనే భర్తకు అతని విధుల జాబితానందివ్వాలి. ఈ అవగాహనే కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆడపిల్లను సాటి మనిషిగా భావించే తరాన్ని తెస్తుంది.
‘అమ్మా.. ఎక్కడికెళ్లావ్‌.. నాకు ఆకలేస్తోంది’ 
‘వంటిల్లును వెంటతీసుకెళ్లలేదుగా నేను? ఇక్కడే ఉంది. కావల్సింది చేసుకొని తినొచ్చు కదా’
ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పోస్ట్‌. ఇలా సమాధానం చెప్పే ధైర్యం రావాలి అమ్మకు.  అప్పుడే ఆమె గౌరవం పెరుగుతుంది. 

ఇదేం ఘనత?
2014లో ఎకనమిక్‌ కో ఆపరేషన్‌ డిస్టింక్షన్‌ (OECD) అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో నిగ్గు తేలిన నిజం.. ఇంటి పని తనది కాదనుకొనే మగమహారాజులను మోస్తున్నదేశం మనదే. మనవాళ్లు రోజులో  పందొమ్మిది నిమిషాలు మాత్రమే ఇంటి పనికి కేటాయిస్తారట. ప్రపంచంలోనే ఇంత తక్కువ ఇంటి పనిచేసే మగవాళ్లు మనవాళ్లేట సుమా! మనకన్నా ముందు స్థానాల్లో  కొరియా పురుషులు (21 నిమిషాలు), జపాన్‌ మెన్‌ (24 నిమిషాలు), చైనా వీరులు (48 నిమిషాలు) ఉన్నారట. 

► 71%: ఇంటి పనుల ఒత్తిళ్లతో దేశంలో దాదాపు 71 శాతం మహిళలకు కంటినిండా నిద్ర ఉండడం లేదని సర్వేల సారాంశం. 

► డాడీ #షేర్‌  వర్క్‌లోడ్‌
అమ్మంటే ఎముకలు అరిగే చాకిరే అనే అభిప్రాయాన్ని స్థిరపరిచిన వ్యాపార ప్రకటనలే కనిపిస్తున్నా.. అమ్మ కూడా మనిషే.. ఇంటిని నడుముకు కట్టేసుకొని పుట్టలేదు.. ఇంట్లో పని నాన్నది కూడా అని చాటుతున్న వ్యాపార ప్రకటనలూ ఉన్నాయి. ఏరియల్‌ వాషింగ్‌ పౌడర్‌ ‘డాడీ # షేర్‌ వర్క్‌ లోడ్‌’  పేరుతో వాటిని రూపొందించింది. తన కూతురింటికి వెళ్లిన తండ్రి.. కూతురు ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఇల్లు, పిల్లలు,  అటు ఆఫీస్‌ పనితో సర్కస్‌ చేస్తుంటే అల్లుడు మాత్రం ఆఫీస్‌ అయిపోగానే ఇంటికొచ్చి ఫోన్‌లో, టీవీతో ఎంత ధిలాసాగా ఉంటాడో  చూస్తాడు. బిడ్డలో తన భార్య, అల్లుడిలో తను కనిపిస్తారు.  తన భార్య విషయంలో తనూ అలాగే కదా అనుకుంటాడు. అల్లుడూ తన లాంటి తండ్రి ప్రభావంలోనే పెరిగాడని తెలుసుకుంటాడు. ఇంటికి వెళ్లి భార్యకు సహాయపడడం మొదలుపెడ్తాడు. ఇలా వర్క్‌ లోడ్‌ను తండ్రులు ఎలా పంచుకోవాలో చాటుతాయి  ఆ వీడియోలు. 

మన మహిళామణుల చాకిరీ
ఓఈఎస్‌డీ సర్వేలో మన ఆడవాళ్లు రోజులో ఎన్ని నిమిషాలు ఇంటి చాకిరీతో చేతులు అరగ్గొట్టుకుంటారో కూడా చెప్పింది. ఓవైపు ఉద్యోగం చేసుకుంటూనే ఇంటి కోసం అంటే  వంట, బట్టలుతకడం, పిల్లలు, ఇల్లు సర్దడం వగైరా పనుల కోసం రోజులో 298 నిమిషాలు వెచ్చిస్తారట. వాళ్లలా ఇంటి పనుల్లో సతమతమవుతున్న సమయాల్లో మన మగోళ్లు టీవీ చూస్తూ, స్నేహితులతో బాతాఖానీ కొడుతూ, పేకాటాడుతూ దాదాపు 283 నిమిషాలు వినోదం పంచుకుంటారట. మన సగటు మగవాళ్లు రోజులో 703 నిమిషాల కంటే ఎక్కువ అంటే పదకొండు గంటల సమయాన్ని నిద్ర, వినోదం, మద్యంతో పాస్‌ చేస్తారట.

బీ యాన్‌ ఐరన్‌ ఉమన్‌
ఎప్పుడో 80ల్లో ఆడవాళ్లకు పౌష్టికాహారం అనే ప్రభుత్వ ప్రకటనలను దూరదర్శన్‌ ప్రచారం చేసింది. అలాంటివి ప్రైవేట్‌ చానెళ్ల కాలంలో రాలేదు అనుకున్నాం కదా. ధన్‌తే రస్‌ సందర్భంగా రెండు, రెండున్నరేళ్ల కిందట అనుకుంటా స్త్రీధన్‌ పేరుతో కొన్ని ప్రకటనలు వచ్చాయి వీడియోల రూపంలో. ప్రైవేట్‌ చానెళ్లతోపాటు సోషల్‌ మీడియాలోనూ ప్రసారం, ప్రచారం అయ్యాయి. మహిళలకు ఒంటి మీద బంగారం కన్నా ఒంట్లో ఐరన్‌ మిన్న. బీ యాన్‌ ఐరన్‌ ఉమన్‌ అంటూ. కాబోయే అమ్మలు, అమ్మలు  శారీరకంగా, మానసికంగా ఐరన్‌ ఉమెన్‌గా ఉండడం చాలా అవసరం. నిజంగానే బీ యాన్‌ ఐరన్‌ ఉమన్‌.  

మగాళ్లంటే వీళ్లు
ఇంటి పనుల్లో మహిళలకు చేదోడు వాదోడుగా ఉన్న మగాళ్లు స్లోవేనియా దేశంలో ఉన్నారు. వీళ్లు రోజులో 114 నిమిషాలు ఇంటి పనులకు కేటాయిస్తారట. ఈ దేశం తర్వాత స్థానాల్లో డెన్మార్క్, ఈస్టోనేషియా మగవాళ్లున్నారట.
చదవండి: డాక్టరమ్మలు మదర్స్‌ డే సెల్యూట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top