డాక్టరమ్మలు మదర్స్‌ డే సెల్యూట్‌

Sakshi Special Story About Womns Doctors Services

కడుపులో దాచుకుంటుంది. కనురెప్పలా కాచుకుంటుంది. కష్టాన్ని ఓర్చుకోవడం నేర్పుతుంది. పోరాడే శక్తిని ఇస్తుంది. చీకట్లను సంహరించే వెలుగు ఖడ్గాన్ని చేతికి ఇస్తుంది. జయము నీదేనని అభయమిస్తుంది. జయించి వస్తే.. ‘భళి భళి భళి.. భళిరా భళి’ అని భుజం తడుతుంది. ఎవరు?! ఇంకెవరు? మాతృమూర్తి! తొమ్మిది నెలలు కడుపులో మోసే ఓరిమి ఎవరికి ఉంటుంది? అమ్మకే కదా.

అమ్మలా.. మన డాక్టరమ్మలు కూడా గత పదిహేను నెలలుగా విరామం లేకుండా, అలసటను కనిపించనివ్వకుండా, మోముపై చిరునవ్వును మాయం అవనివ్వకుండా కరోనా రోగులను బిడ్డల్లా సంరక్షిస్తున్నారు. ‘మీకేం కాదు’ అని ధైర్యం చెబుతున్నారు. ‘మేమున్నాం’ అని పక్కనే కూర్చుంటున్నారు! ఊపిరి నిలిపి బతుకు దీపాలు వెలిగిస్తున్నారు. అందుకే ఈ మదర్స్‌డేకి ప్రతి డాక్టరమ్మకూ మనం చేతులెత్తి నమస్కరించాలి. ఆ ఫ్రంట్‌లైన్‌ వారియర్‌కి సెల్యూట్‌ చెయ్యాలి. హ్యాపీ మదర్స్‌ డే డాక్టరమ్మా!

మృదుల, భావన, హృద్య, రాఖీ, జుంజుమి, అంజు.. కన్నూర్‌లోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్‌లు. ఒక్కొక్కరూ ఒక్కో విభాగంలో నిపుణులు. అయితే గత ఏడాదిన్నరగా ఆ ఆసుపత్రులలోని కరోనా విభాగాలకే తమ పూర్తి సేవలు అందిస్తున్నారు! మహాశక్తి మాతకు ఉన్నట్లుగా పదీ పన్నెండు చేతులు ఉంటే తప్ప సాధ్యం కాని వైద్యవిధుల్ని ఈ డాక్టరమ్మలు విశ్రాంతి అన్నదే లేకుండా ఉరుకులు పరుగుల మీద నిర్వహిస్తున్నారు. వీళ్లు చెప్పినట్లు కరోనా రోగులు బుద్ధిగా వింటున్నారు. అంటే.. కరోనా రోగులు వినిపించుకునేలా వీళ్లు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు.

రోగి విసుగును ప్రదర్శిం^è వచ్చు. కానీ వైద్యులు సహనాన్ని కోల్పోకూడదు. అంతేకాదు, ఔషధంగా కాస్త ఆత్మీయమైన పలకరింపునూ పంచాలి. సాధ్యం అయ్యేదేనా ఇంత ఒత్తిడిలో! సాధ్యం చేశారు ఈ ఆరుగురు మహిళా వైద్యులు. అందుకే వీరి చేత ‘నేషనల్‌ హెల్త్‌ మిషన్‌’, కేరళ వైద్య శాఖ కలిసి ప్రజలకు ధైర్యమిచ్చే, ప్రజల్లో చైతన్యం కలిగించే వీడియోను రూపొందించాయి! ఆ వీడియో గత సోమవారం నెట్‌లోకి అప్‌లోడ్‌ అయింది. వైరస్‌పై విజయం సాధించడానికి ఈ మహిళా డాక్టర్లు ఇచ్చిన ‘నృత్య సందేశం’ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాదు, ఆలోచన కలిగిస్తోంది. అప్రమత్తతను నేర్పుతోంది.
∙∙
రోగుల మన్ననలను పొందుతున్న ఈ ఆరుగురు మహిళా డాక్టర్‌ల ప్రస్తావన సమీక్షా సమావేశాలలో వచ్చినప్పుడు వీరందరూ కూడా భారత సంప్రదాయ నృత్యాలలో అభినివేశం ఉన్నవారేనన్న ఒక ఆసక్తికరమైన సంగతి యాదృచ్చికంగా వైద్యాధికారుల దృష్టికి వచ్చింది! వైద్యం ప్రాణాల్ని కాపాడే సంజీవని. నృత్యం ప్రజల్ని ప్రభావితం చేసే కళ. వైద్యాన్ని, నృత్యాన్ని కలిపి ప్రజా ప్రయోజం కోసం ఏమైనా చేయొచ్చా అని యోచించారు. అప్పుడు వచ్చిన ఆలోచనే.. ఈ మహిళా డాక్టర్ల నృత్య రూపకం.

మాస్కులు ధరించండి, దూరాన్ని పాటించండి, బాధ్యతగా మెలగండి అని రోజూ ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలనే మృదుల, భావన, హృద్య, రాఖీ, జుంజుమి, అంజు.. తమ నృత్యం ద్వారా నాలుగు నిముషాల సందేశంగా ప్రజల్లోకి పంపారు. హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేశ్‌ శ్రేష్ట పాట రాస్తే, ఆ పాటకు ప్రశాంత్‌ కృష్ణన్‌ అనే సంగీతకారుడు బాణీలు కట్టి, తనే నేపథ్యగానం అందించారు. ‘అలయ దిక్కున్న మహమారి..’ అనే మలయాళ పల్లవితో పాట మొదలవుతుంది. చరణాలకు అనుగుణంగా ఒక్కో డాక్టర్‌ ఫ్రేమ్‌ మీదకు వచ్చి నృత్యాభినయం చేస్తుంటారు.

‘కేరళ గవర్నమెంట్‌ మెడికల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌’కు అనుబంధంగా ‘జ్వాల’ అనే మహిళా విభాగం ఉంది. ఆ విభాగం ఆధ్వర్యంలోనే ఈ వీడియోకు రూపకల్పన జరిగింది. అయితే అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆరుగురు డాక్టర్స్‌కి ఒకేసారి షూటింగ్‌కి సమయం దొరికేది కాదు. వార్డునుంచి అరక్షణం బయట పడాలన్నా మెడికల్‌ స్టాఫ్‌కి వెయ్యి జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుంది. ‘‘మొత్తానికి పూర్తి చేశాం’అని నవ్వుతూ అంటున్నారు డాక్టర్‌ మృదుల. ఆమె పిల్లల వైద్య నిపుణురాలు. పిల్లల కోసం అమ్మ ఎన్ని చేతుల్ని తగిలించుకుంటుందో ఈ మహిళా వైద్యులు కరోనా నుంచి ప్రజల్ని కాపాడేందుకు అన్ని విధాలా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అందుకే వీళ్లు వట్టి డాక్టర్‌లు కాదు. డాక్టరమ్మలు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top