Facts About Indelible Ink In Telugu: ఎన్నికల సిరాకు పెద్ద చరిత్రే ఉంది, ఎంతో రహస్యంగా తయారీ విధానం

Interesting Facts About Indelible Ink Used In Elections - Sakshi

ఎన్నికల్లో చాలా ప్రధానమైన అంశం సిరాచుక్క. మనం ఓటేశామని చెప్పడానికి సిరాచుక్క ఓ గుర్తుగా మాత్రమే కాదు, దొంగ ఓట్లను చెక్‌ పెట్టే ఆయుధంలానూ పనిచేస్తుంది. నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఒకసారి ఓటు వేసిన వారిని గుర్తు పట్టేందుకు భారత ఎన్నికల సంఘం ఈ విధానాన్ని దశాబ్ధాలుగా అమలు చేస్తోంది. ఇంతకీ ఈ సిరా ఎక్కడ తయారవుతుంది? దీని వెనకున్న చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం. 

తెలంగాణలో ఓట్ల పండగకి సర్వం సిద్ధమైంది. రేపే(నవంబర్‌30) తెలంగాణలో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఓటు వేశాక చూపుడు వేలిపై ఇంక్‌ మార్క్‌ వేస్తారన్న విషయం తెలిసిందే. ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా గుర్తుగా ఇండెలబుల్ ఇంక్‌ను ఉపయోగిస్తారు. ఈ సిరా వెనుక పెద్ద చరిత్రే ఉంది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ చాలా సమస్యలు ఎదుర్కొంది. ఓటు వేసినవాళ్లు మళ్లీ ఓటు వేసేందుకు వస్తుండటంతో ఎలా అడ్డుకోవాలో అర్థం కాలేదట. అప్పుడే కొన్నిరోజుల వరకు చెరిగిపోని సిరాతో గుర్తు వేయాలన్న ఆలోచన వచ్చింది. అదే “బ్లూ ఇంక్” పద్ధతి.

భారతదేశంలో 1962లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొదటిసారిగా బ్లూ ఇంక్ వాడటం మొదలుపెట్టారు. R&D ఆర్గ‌నైజేష‌న్ ఈ ఇంక్‌ను త‌యారు చేసేది. ఆ త‌ర్వాత దీనిని మైసూర్‌కు చెందిన పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌కు బ‌దిలీ చేసింది. అప్పట్నుంచి భారత్‌లో జరిగే అన్ని ఎన్నికలకు ఇక్కడి నుంచే ఇంక్‌ను తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇంక్‌ను సరఫరా చేస్తుంది. కెనడా, కాంబోడియా, మాల్దీవులు, నేపాల్‌, నైజీరియా, దక్షిణాఫ్రికా, టర్కీ సహా కొన్ని దేశాల ఎన్నికల అవసరాలకు ఇక్కడి నుంచే ఇంక్‌ సరఫరా అవుతుండటం గమనార్హం.

ఇటీవలి కాలంలో ఇంకుతో సులువుగా ఉపయోగించడానికి మార్కర్‌పెన్నులను కూడా తయారీ చేస్తుంది ఈ సంస్థ. ఇతర దేశాల్లో వీటిని వాడుతున్నారు.కానీ మనదేశంలో మాత్రం ఇంకా ఇంకును మాత్రమే ఉపయోగిస్తున్నారు.ఈ ఇంక్ వేలిపై వేయ‌గానే కొన్ని గంట‌ల్లోనే పోదు. ఒక‌ప్పుడు అయితే కొన్ని నెల‌ల పాటు ఉండేది.  ఇప్పుడు కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు ఆ మార్క్ అలాగే ఉంటుంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్రాల‌కు ఇంక్ స‌ర‌ఫరా చేసేముందు ఆ ఇంక్‌ను ప‌లుమార్లు టెస్ట్ చేస్తారు. ఇండెలబుల్ ఇంక్‌లో సుమారు 15 నుంచి 18 శాతం సిల్వర్ నైట్రేట్ తో పాటు కొన్నిరసాయనాలను ఉపయోగిస్తారు. దీంతో  ఈ సిరా  కొన్ని రోజుల వరకు  చెరిగిపోకుండా ఉంటుంది.

ఇది 5, 7,5, 20, 50 మిల్లీలీటర్ల బాటిళ్లలో దొరుకుతుంది. 5 ఎంఎల్‌ బాటిల్‌ 300 మంది ఓటర్లకు సరిపోతుంది.ఒక బాటిల్ ఇంక్ ధర సుమారు రూ. 127 ఉంటుంది. ఒక సీసాలో సుమారు 10 ml సిరా ఉంటుంది. దొంగఓట్లు నమోదు కాకుండా ఉండేందుకు గాను  ఈ సిరాను  చూపుడు వేలికి వేస్తారు. ఒకవేళ వేలికి గాయమైనా, చూపుడు వేలు లేకపోయినా మరో వేలికి వేస్తారు. ఇక ఇంకు  తయారీ అత్యంత రహస్యంగా సాగుతుంది. దీని తయారీలో ఉపయోగించే రసాయన ఫార్ములాను నేషనల్‌ ఫిజికల్‌ లాబోరేటరీ ఆప్‌ ఇండియా అత్యంత రహస్యంగా రూపొందిస్తుంది. ఇతరులకు ఇందులో ఏం వాడారన్నది తెలియదు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top