
నాకు 62 ఏళ్లు. నేనొక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. నా భార్యకి క్యాన్సర్ ఉండేది. ఐదు సంవత్సరాల క్రితం కోవిడ్ సమయంలో చనిపోయింది. పిల్లలిద్దరూ వాళ్ళ భర్తలతో వేరే దేశాలలో స్థిరపడ్డారు. నా భార్యకి సహాయం చేయడం కోసం, ఇంట్లో వంట చేయడం కోసం ఒక ఆవిడ పది సంవత్సరాల నుండి మా ఇంట్లో పని చేస్తోంది. ఆవిడ భర్త తాగుబోతు, ఆమెని వదిలేశాడు. ఆమెకు ఒక పెళ్లీడు వచ్చిన అమ్మాయి ఉంది. నా భార్య చనిపోయాక తను నాకు తోడుగా ఉంటోంది. మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. తాను నా నుంచి ఏమీ ఆశించకపోయినా, తన కూతురి పెళ్లి కోసం ఒక 5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.
కానీ నా పిల్లలు ఆవిడని పెళ్ళి చేసుకోవడానికి, ఆవిడకి ఆర్థిక సహాయం చేయడానికి ఒప్పుకోవట్లేదు. నన్ను ఏదైనా వృద్ధాశ్రమంలో ఉండమని చెప్తున్నారు. నాకు పెన్షన్ వస్తుంది. నేను ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. నేను ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో నా అన్న వాళ్ళతో చివరిదాకా ఉండి, కన్నుమూయాలని కోరిక – పిల్లలు వచ్చి నాతో ఉండలేరు. అలా అని నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్లతో ఉంచుకోలేరు. ఈ వయసులో నాకు కావలసింది ఒక తోడు, నాకు వేరే ఎలాంటి ఉద్దేశాలు లేవు. కానీ పిల్లలు మా చుట్టాలకు ఫోన్ చేసి చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఈయనకి ఈ వయసులో ఇదేం పాడు ఆలోచన అని. ఈ వయసులో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడం కోసం ఒక తోడు కావాలని అనుకోవడం తపా? నా పిల్లల కోసం నా ఆలోచన మార్చుకుని వృద్ధాశ్రమంలో ఉండమంటారా, నాకు సరైన సలహా ఇవ్వగలరు!
– సత్యనారాయణ, హిందూపూర్
ముందుగా మీసమస్యని ధైర్యంగా మాతో పంచుకున్నందుకు అభినందనలు, బంటరితనం మనిషిని ఎంతో కుంగదీస్తుంది ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండకుండా, ఒక తోడుంటే బాగుంటుందని అనుకోవడం తప్పేం కాదు! ఓ భర్తగా, తండ్రిగా, మీ బాధ్యతలన్నీ ఏ లోటూ లేకుండా నిర్వర్తించారు.. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ పిల్లలు తమ జీవితాల్లో బిజీగా ఉండటం వల్ల వాళ్లు మిమ్మల్ని చూసుకోలేరు. అదే సమయంలో మిమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉండాలని చెప్పే అధికారం వాళ్ళకి లేదు. మీరు చెప్పినావిడ మిమ్మల్ని బాగా చూసుకుంటుంది, మీరు ఆమెని మీ జీవిత భాగస్వామిగా కోరుకోవడం.
తనకి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయాలని అనుకోవడం ఇవన్నీ మంచి విషయాలే. అయితే ఇదే సమయంలో పిల్లలనుండి వ్యతిరేకత లేకుండా వీలైనంత సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించుకోవడం ముఖ్యం. బహుశా తమ తల్లి స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉన్నట్లుగా లేదు. అలాగే వాళ్ళకి ఆర్థికపరమైన అభద్రతా భావం కూడా ఉండి ఉండవచ్చు. పెళ్ళి తర్వాత మీరు వాళ్ళకి దూరం అపుతారనే అలోచన కూడా ఉండొచ్చు. మీ చుట్టాల్లో ఒక తటస్థ వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచి, వాళ్ళకున్న ఇబ్బంది ఏంటో స్పష్టంగా కనుక్కోండి. మీ పిల్లలకు ఆమోద యోగ్యంగా ఉండేలా ఒక వీలునామా రాయండి. మీరు వివాహం చేసుకునే అవిడ మీ నుండి ఏమీ ఆశించలేదంటున్నారు కాబట్టి ఆవిడ అభ్యంతరం చెప్తుంది అని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఆవిడ ఏదైనా పేచీ పెడితే మీకు అక్కడే ఆవిడ ఉద్దేశ్యం అర్థం అవుతుంది. అప్పుడు మీరు మీ నిర్ణయాన్నీ పునరాలోచన చేయవచ్చు.
ఆమె మీ నిర్ణయాన్ని సంతోషంగా ఒప్పుకుంటే ఆమెను నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. మీ వివాహాన్ని రిజిస్టర్ చేయించుకోండి. తద్వారా ఆమె భవిష్యత్తుకి కూడా కొంత భరోసా కల్పించిన వారవుతారు. ప్రతి యేటా కొంతకాలం మీ పిల్లలతో గడిపేలా ఏర్పాట్లు చేసుకోండి.. మీ జీవితంలో మీ పిల్లల స్థానం పదిలంగా ఉందన్న అశ, నమ్మకం వారికి కలుగుతాయి.. ఇవన్నీ చేసినా కూడా మీ పిల్లలు మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంటే, ఇంక మీరు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వృద్ధాప్యంలో ఒక గౌరవ ప్రదమైన జీవితం గడ΄ాలనుకోవడం మీకున్న హక్కు. సమాజం కోసమో, మీ పిల్లలు బాధపడతారనో దాన్ని మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం గురించి ఎలాంటి అపరాధనా భావన లేకుండా ముందుకు వెళ్ళండి.
ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com