indian idol season 12: విజేత ఎవరు?

Indian Idol 12 Shanmukhapriya Impresses Fans With Her Performance - Sakshi

తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ సంగీత అభిమానులకు ఉత్కంఠనిస్తోంది. ఇండియన్‌ ఐడెల్‌ సీజన్‌ 12  టాప్‌ 6లో ఉన్న షణ్ముఖప్రియ ఆగస్టు 15న జరిగే ఫైనల్స్‌కు చేరినట్టే లెక్క. షో నిర్వాహకులు ఎలిమినేషన్స్‌ ఆపేసి ముగ్గురు గాయనులు, ముగ్గురు గాయకులతో ఫైనల్స్‌కు వెళ్లనున్నారని సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకూ ఇండియన్‌ ఐడెల్‌ను ముగ్గురు స్త్రీలు గెలిచారు. ఈసారి ఫైనల్స్‌కు వెళుతున్న ముగ్గురిలో ఒకరు నాలుగోసారి టైటిల్‌ గెలుస్తారా?

ఇంటర్‌ పాసైన షణ్ముఖ ప్రియ సంగీత ప్రియుల రివార్డులను డిగ్రీలుగా లెక్క వేస్తే చాలా డిగ్రీలు పాసైనట్టే లెక్క. వైజాగ్‌ మధురవాడలో నివాసం ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస కుమార్, రత్నమాలల ఏకైక కూతురు షణ్ముఖ ప్రియ బహు భాషలలో చిన్నప్పటి నుంచి పాడటం ప్రాక్టీసు చేసింది. టీవీ షోస్‌లో పాల్గొని లెక్కకు మించి ప్రైజులు కొట్టింది. కాని అవన్నీ ఒకెత్తు. ఇప్పుడు ఇండియన్‌ ఐడెల్‌లో పాల్గొనడం ఒకెత్తు. ఒక్కసారి ఇండియన్‌ ఐడెల్‌ వేదికనెక్కితే దాదాపుగా భారతీయులు నివసించే అన్నీ దేశాలకు ఆ గాయకులు తెలిసి పోతారు. అంత పెద్ద వేదిక అది. భారీ కాంపిటీషన్‌ను ఎదుర్కొని పోటీలోకొచ్చిన షణ్ముఖ ప్రియ, ఆమెతో పాటు టాప్‌ సిక్స్‌లో నిలిచిన మరో ఇద్దరు గాయనులు అరుణిమ, సాయిలీ మేల్‌ సింగర్స్‌ పవన్‌దీప్, మహమ్మద్‌ దానిష్, నిహాల్‌ తౌరోకు గట్టి పోటీ ఇస్తున్నారు.

సవాళ్లను ఎదుర్కొన్న షో
నవంబర్‌ 28, 2020న సోనీ టీవీలో ఇండియన్‌ ఐడెల్‌ సీజన్‌ 12 అనేక వడపోతల తర్వాత మిగిలిన 15 మంది కంటెస్టెంట్‌లతో మొదలైంది. సాధారణంగా ఆరు నెలల్లో ముగిసే ఈ షో లాక్‌డౌన్‌ కారణాల రీత్యా, బయట మరో వినోదం లేకపోవడం వల్ల మరో మూడు నెలలు పొడిగింప బడింది. మధ్యలో గాయనీ గాయకులు కరోనా బారిన పడినా, షూటింగ్‌ లొకేషన్‌ ‘డమన్‌’ (గోవా) కు షిఫ్ట్‌ అవడం వల్ల జడ్జిలు మారినా ఒక్క వారం కూడా నాగా లేకుండా కొనసాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన గాయనీ గాయకుల్లో తెలుగు నుంచి శిరీష భాగవతుల, షణ్ముఖ ప్రియ గట్టి పోటీని ఇచ్చారు. శిరీష 11వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్‌ కాగా షణ్ముఖప్రియ టాప్‌ 6లో చేరింది.

యోడలింగ్‌ క్వీన్‌
యోడలింగ్‌ చేయడంలో గాయకుడు కిశోర్‌ కుమార్‌ దిట్ట. యోడలింగ్‌ను గాయనులు చేయరు. అందుకు గొంతు అంతగా వీలు కాదు. కాని షణ్ముఖప్రియ యోడలింగ్‌లో మహామహులు దిగ్భ్రమ చెందే ప్రతిభను వ్యక్త పరిచింది. యోడలింగ్‌ చేస్తూ కిశోర్‌ కుమార్‌ పాడిన హిట్‌ సాంగ్‌ ‘మై హూ ఝుమ్‌ఝుమ్‌ ఝుమ్రు’ పాటను షణ్ముఖప్రియ అద్భుతంగా పాడి అందరినీ ఆకట్టుకుంది. షోకు గెస్ట్‌లుగా హాజరైన ఏ.ఆర్‌. రహమాన్, ఉదిత్‌ నారాయణ్, ఆశా భోంస్లే లాంటి పెద్దలు ఎందరో షణ్ముఖప్రియను అభినందించారు. స్టేజ్‌ మీదే సినిమా ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే అంతమాత్రాన ఆమెకు పోటీ లేదని కాదు. ఉంది.

పవన్‌దీప్‌ మహమ్మద్‌ దానిష్‌ నిహాల్‌ తౌరో 

బెంగాల్, మహారాష్ట్రల పోటీ
షణ్ముఖ ప్రియకు బెంగాల్‌ గాయని అరుణిమ, ముంబై గాయని సాయిలీ సమవుజ్జీలుగా ఉన్నారు. ముఖ్యంగా అరుణిమ దాదాపు లతా వారసురాలిగా పాడుతూ ఓట్లు పొందుతోంది. మరోవైపు సాయిలీ స్పీడ్, స్లో పాటలు కూడా ప్రతిభావంతంగా పాడుతూ అభిమానులను సంపాదించుకుంది. ముగ్గురూ ముగ్గురేగా వేదికపై సవాలు విసురుతుండటంతో జడ్జీలు ఎవరిని ఎలిమినేట్‌ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మన షణ్ముఖ ప్రియకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగువారి నుంచి ఓట్ల మద్దతు రావాల్సి ఉంది.

12 గంటల పాటు ఫైనల్స్‌
ఆగస్టు 15న కనీవినీ ఎరగని స్థాయిలో 12 గంటల పాటు ఇండియన్‌ ఐడెల్‌ ఫైనల్స్‌ జరగనున్నాయి. అతిరథ మహారథులు ఈ ఫైనల్స్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ వేదిక మీదనే ఈ ఆరు మంది ఫైనలిస్ట్‌లు ప్రతిభ చూపుతారు. లోకమంతా ఈ వేడుక వీక్షించనుంది. విజేతలకు 25 లక్షల నగదు బహుమతి ఉంటుంది. తెలుగు నుంచి గతంలో శ్రీరామచంద్ర ఈ టైటిల్‌ మొదటగా సాధించి తెలుగు ప్రతిభను చాటాడు. షణ్ముఖప్రియది తర్వాతి పేరు కావాలని ఆశిద్దాం.

మగవారూ తక్కువ కాదు
ఈసారి ఇండియన్‌ ఐడెల్‌ కిరీటాన్ని తన్నుకుపోతాడని అందరూ ఊహిస్తున్న పేరు ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్‌ దీప్‌ది. ఇతను పాడటమే కాదు సకల వాద్యాలు వాయిస్తూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతనికి ముంబై సెలబ్రిటీలందరూ ఫిదా అయిపోయారు. ఉత్తరాఖండ్‌ ఆహార్యంలో వినమ్రంగా కనిపించే పవన్‌ దీప్‌ పాటలో సోల్‌ ఉంటుంది. ఆ సోల్‌ అతనికి కిరీటం తెచ్చి పెట్టవచ్చని ఒక అంచనా. ఇతను కాకుండా ముజఫర్‌ నగర్‌కు చెందిన మహమ్మద్‌ దానిష్, మంగళూరుకు చెందిన నిహాల్‌ తోరో గట్టి ప్రతిభను చూపుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top