పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..

How To Turn Cotton Into Food Crop - Sakshi

పత్తి పంటను కేవలం నూలు వస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని వాణిజ్య పంటగానే సాధారణంగా మనం పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీన్ని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురు పంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్‌ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయ సంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నూనెను వంట నూనెగా వాడుతున్నాం. పత్తి గింజల చక్కను పశు దాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తి గింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు.

ఆ విశేషాలు కొన్ని..
ప్రపంచంలో అత్యధికంగా పత్తి సాగు చేస్తున్న దేశం భారత్‌. 23% పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షల మంది పత్తి సాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళా రైతులే. వీరిలో ఎక్కువ మంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. మన దేశంలో 65 శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ. 5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు.

అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐసిఎసి) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధిని కల్పిస్తోంది. కిలో పత్తిని పండించడానికి 20 వేల లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఏసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్‌ సహారన్‌ ఆఫ్రికా దేశాల్లో సాగు చేయదగిన అతి కొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఏసీ వాదన. పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఏసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తి సాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని అంచనా.

అయితే, దూదిలో 97% సెల్యులోజ్‌ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఏసీ లెక్క చెబుతోంది. సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసిఎసి అంటోంది. సింథటిక్‌ ఫైబర్‌ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చని, మైక్రోఫైబర్‌ కణాల కాలుష్యం నుంచి జలవనరులను, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఏసీ సూచిస్తోంది. పంట కాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3% తప్ప వృథా అయ్యేదేమీ లేదు.

పత్తి కట్టెతో బయోచార్‌ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఏసీ అంటోంది. పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబ పోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్‌ కనెక్ట్‌ నివేదిక తెలిపింది. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% జన్యుమార్పిడి చేసిన వంగడాలే.
– పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్‌

(చదవండి: అదిరేటి వంగడాలు ‘అంతరిక్షం’ నుంచి? చైనా మాదిరి స్పేస్‌ బ్రీడింగ్‌)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top