
డాక్టర్ గారూ, మా అబ్బాయిని అగ్రికల్చరల్ బి.ఎస్‌సి. కోసం మహారాష్ట్రకి పంపాం. మొదటి సంవత్సరం బాగానే ఉన్నాడు. కానీ ఈ మధ్య కాలంలో కాలేజీకి వెళ్ళకుండా రూమ్‌లోనే ఉంటున్నాడని, తిండి సరిగ్గా తినట్లేదని, బాగా వీక్ అవుతున్నాడని వాడి ఫ్రెండ్స్ చెపితే చూడడానికి వెళ్ళాము. చూసి షాక్ అయ్యాం. జుట్టు, గడ్డం బాగా పెంచుకొని స్నానం కూడా చేయకుండా మాసిన బట్టలు వేసుకొని ఉన్నాడు. రూమ్ చిందర వందరగా ఉంది. అతన్ని అక్కడ నుండి కోదాడకి తీసుకొచ్చేశాము. ఇంటికి వచ్చాక కూడా రూమ్‌లో తలుపులు వేసుకునే ఉంటున్నాడు. పదే పదే చెప్తే గాని బ్రష్, స్నానం చేయడం లేదు. మంచిగా రెడీ అవ్వాలనే ఆలోచనే లేదు. మా చుట్టాలబ్బాయితో బయటకి వెళ్ళి తిరిగి రమ్మంటే ఇంటరెస్ట్ లేదంటాడు. మావారు తనతోపాటు షాపుకి రమ్మంటే రాలేను అంటాడు. ఒక్కడే బయటకి వెళ్ళి వస్తాడు. సిగరెట్లు విపరీతంగా తాగుతున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు గంజాయి కూడా తీసుకునే వాడని, ఇక్కడ కూడా కొంతమంది ద్వారా గంజాయి తెప్పించుకొని తాగుతున్నాడనీ తెలిసింది. మేము ఏదైనా గట్టిగా చెప్పాలని చూస్తే మా మీదికి కొట్టడానికి వస్తాడు. లేదా తలుపులు వేసుకొని రూమ్‌లో పడుకొని ఏదో ఆలోచిస్తుంటాడు. అబ్బాయి చదువుకొని బాగు పడతాడు అనుకుంటే ఇలా తయారయ్యాడు. అసలు మా ఇంటా వంటా ఇలాంటి జబ్బులు లేవు. ఏం చేయాలో మాకు అర్ధం కావట్లేదు. దయచేసి సహాయం చేయగలరు.
– కవిత, కోదాడ
మీరు చెప్పిన లక్షణాలని బట్టి చూస్తే మీ అబ్బాయి గంజాయి తాగడం వలన వచ్చే ‘ఎమోటివేషన్ సిండ్రోమ్’ అనే ఒక తీవ్రమైన మానసిక సమస్యతో బాధపడుతున్నాడని అర్థం అవుతోంది. గంజాయి తాగేవారిలో కొన్నాళ్ల తర్వాత మెదడుని ఉత్తేజపరిచే భాగాలు పూర్తిగా చచ్చుబడిపోతాయి. భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగాల్లో రసాయనాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. దీనివల్ల వారిలో జీవితంలో ఎలాంటి మోటివేషన్ ఇంటరెస్ట్ లేకుండా తయారవుతారు. ‘ఏకాగ్రత తగ్గి, మతిమరుపు సమస్య వస్తుంది. దాంతో చదువులో ఫెయిల్ అవుతారు.
కెరీర్‌లో వెనక బడతారు. ఇది క్లిష్టమైన మానసిక సమస్య అయినప్పటికీ దీన్ని ట్రీట్ చేయడం అసంభవమైతే కాదు! రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి మందులు, కౌన్సెలింగ్, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అలవాటు చేయడం ద్వారా తిరిగి తనలో ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంపొందించవచ్చు. ఐతే గంజాయి వలన మెదడులో వచ్చే మార్పులు చాలా గాఢంగా ఉంటాయి కాబట్టి ఈ మార్పు రావడానికి చాలా సమయం పడుతుంది. చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారని తెలిసినా కూడా, వాళ్ళే మెల్లిగా మానేస్తారులే అనుకుంటారు.
సిగరెట్, మందుతో పోల్చినప్పుడు గంజాయి వలన వచ్చే దుష్పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి, పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారని తెలిసిన వెంటనే సైకియాట్రిస్ట్‌ని కలవడం ముఖ్యం. లేదంటే ఇలా ‘ఎమోటివేషన్ సిండ్రోమ్’, సైకోసిస్ లాంటి సమస్యల బారిన పడి తమ జీవితం నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మీ అబ్బాయిని మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ఉంచి చికిత్స చేయించండి. తప్పకుండా మళ్ళీ మాములు మనిషి అవుతాడు. ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com)
(చదవండి: ఓఆర్‌ఎస్ అని పిల్లలకు తాగిస్తున్నారా..? హెచ్చరిస్తున్న నిపుణులు)