Cyber Defamation: సోషల్ మీడియాలో మీపై అసభ్య పోస్టులు వస్తున్నాయా?.. ఆన్‌లైన్‌ పరువు నష్టం ఇలా వేయండి..

How To File Defamation Suit On Social Media Related Cyber Crimes - Sakshi

పావని (పేరుమార్చడమైనది) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మాత్రమే కాదు వెస్ట్రన్‌ డ్యాన్సర్‌గానూ మంచి పేరుంది. తనకున్న ప్రతిభను చూపుతూ ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటుంది. సామాజికంగా నలుగురిలో ఉన్నతంగా ఉండాలంటే సోషల్‌మీడియా సరైన ఎంపిక అనేది పావని ఆలోచన. ఓ రోజు ‘ఎవరితోనో నీకు ఉన్న సంబంధం గురించి సోషల్‌ మీడియాలో రాసి, ఫొటోలు కూడా అప్‌లోడ్‌ చేశారు చూడు. ఇవి నీ దాకా రాలేదా?’ అని కూతురుని నిలదీసింది తల్లి. తనకేమీ తెలియదంటూ, ఎంత చెప్పినా ఇంట్లో ఎవరూ వినిపించుకోలేదు. తన మీద చెడుగా ప్రచారం చేసినవారి గురించి, స్నేహితుల ద్వారా విషయం రాబట్టింది పావని. తనపై శత్రుత్వం పెంచుకున్న సహచర ఉద్యోగులు చేసిన పని ఇదని తెలిసి, కుమిలిపోయింది. 

చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ!

రోజూ కొత్తగా అందరితో ‘సూపర్బ్‌..’ అనిపించుకోవాలని, నలుగురిలో ఫేమస్‌ అవ్వాలని.. ఇలా రకరకాల కారణాలతో  సామాజిక మాధ్యమాల్లో ఉండేవారి సంఖ్య పెరిగింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కారణంగా ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తూ ఉండటమూ చూస్తుంటాం. అది ఇతరుల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించనంత వరకు ఏ సమస్యా లేదు. కానీ, సోషల్‌ మీడియా లేదా మెసేజింగ్‌ లేదా ఇ–మెయిల్‌ సహాయంతో మరొక వ్యక్తికి పరువు నష్టం కలిగించే విషయాలు విస్తృతం అవుతున్నాయి. ఆ సమాచారం ఆ వ్యక్తి జీవితాన్ని అల్లకల్లోలం చేయచ్చు. ఇది చిన్న నేరం కాదు.  న్యాయాన్ని, చట్టాన్నీ అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. 

చదవండి: పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..!

పరువు నష్టం చేసేది ఎవరు?
►సోషల్‌ మీడియా వార్తా ఛానెల్‌లు క్లిక్‌లపై డబ్బును సంపాదిస్తుంటాయి. ఎక్కువ క్లిక్‌లకు ప్రకటనలు కూడా ఎక్కువ రావడంతో నిజనిర్ధారణ లేని వార్తలను రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. 
►అసంతృప్తి చెందిన ఉద్యోగి కంపెనీ ఉన్నతాధికారులకు లేదా మేనేజ్‌మెంట్‌కు అవమానకరమైన, పరువు నష్టం కలిగించే, అసభ్యకరమైన ఇ–మెయిళ్లను పంపుతుంటారు. 
►మాజీ స్నేహితుడు / మాజీ జీవిత భాగస్వామి అశ్లీల సందేశాలు స్నేహితులు/ కుటుంబ సభ్యులకు లేదా పోర్న్‌ సైట్‌లకు పంపడం.
►రాజకీయ ప్రత్యర్థి తప్పుడు కథనాలతో ప్రత్యర్థి పార్టీని పరువు తీయాలనుకోవచ్చు.
►మతపరమైన శత్రుత్వంతో సోషల్‌ మీడియా లో తప్పుడు ప్రచారాన్ని సృష్టించవచ్చు. 

పరిమితులు అవసరం
►రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఎ) కింద అందించిన భావప్రకటన, వాక్‌ స్వాతంత్య్రపు హక్కు పౌరులందరికీ ఉంటుంది. అయితే, అలాంటి స్వేచ్ఛ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. మరొక వ్యక్తి ప్రతిష్ఠకు భంగం కలిగించే ఏవ్యాఖ్య అయినా, అది చట్టం పరిధిలోకి వస్తుంది. 
►ఇటీవల కాలంలో నిశ్చితార్థాలు, విడాకులు, ప్రెగ్నెన్సీ విషయాలు... వ్యక్తిగతమైనవి కూడా సోషల్‌ మీడియాలో ప్రకటిస్తున్నారు. మనలో చాలామంది సోషల్‌ నెట్‌వర్క్‌లలో రిలేషన్‌షిప్‌ స్టేటస్‌లను ప్రకటిస్తూ, అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, తప్పులను ఒప్పుకుంటూ, లైంగిక గుర్తింపులను ప్రకటిస్తూ అధికారికంగా వెళ్తున్నారు.
►పై వ్యక్తీకరణలతో, ఆన్‌లైన్‌ పరువు నష్టం, ట్రోలింగ్, భావ ప్రకటన స్వేచ్ఛపై స్వల్ప, దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతున్నాయి. ఆన్‌లైన్‌ పరువు నష్టం మానసిక, శారీరక ఒత్తిడులకు దారితీస్తుంది. అదే విశ్వసనీయతగా మారి విపరీత పరిణామాలకు దారితీయవచ్చు. కాబట్టి తమ వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అనే స్వీయ విచక్షణ కలిగి ఉండటం అవసరం. అలాగే అవతలివారు పెట్టిన పోస్టులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం, తప్పుడు కథనాలు అల్లడం సైబర్‌ నేరం కిందికి వస్తుందన్న అవగాహన అవసరం. 

చదవండి: ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!!

సోషల్‌ మీడియా వినియోగ చిట్కాలు
►మీ ప్రతి సోషల్‌ మీడియా ఖాతాకూ ప్రత్యేకమైన, సంక్లిష్టమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. వాటిని తరచూ మార్చుకుంటూ ఉండాలి. 
►సమాచారాన్ని పంచుకోవడాన్ని నియంత్రించడానికి మీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల గోప్యత, సెట్టింగ్‌లను సరిచేసుకోవాలి.  
►సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ షేర్‌ చేయవద్దు.
►తెలియని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయడం మానుకోవాలి.
►మీకు తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్‌ అవ్వడం శ్రేయస్కరం.
►ఆఫ్‌లైన్‌లో ఎలా హుందాగా ఉంటారో, ఆన్‌లైన్‌లోనూ అంతే హుందాతనాన్ని చూపాలి. అంటే, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు షేర్‌ చేసేముందు వాటి వెనక గల ఉద్దేశ్యమేంటో తెలుసుండాలి. 
►సోషల్‌మీడియా కారణంగా అనుకోని సంఘటనలు ఎదురైతే ఎదుర్కోవడానికి సన్నద్ధులై ఉండాలి.  

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top