కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం | How can one effectively balance work and family | Sakshi
Sakshi News home page

కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం

Oct 27 2024 1:20 PM | Updated on Oct 27 2024 3:08 PM

How can one effectively balance work and family

అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. 

రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. 

నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. 
కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.

ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. 

చికిత్స లక్ష్యాలు...  పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. 

అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. 

 వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. 

 కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •

ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. 

చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. 

 అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. 

 కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. 

 వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. 

దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. 
సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement