దాహమైనపుడు, దాహం తీరేంత వరకే నీళ్లు తాగాలి.. లేదంటే అంతే సంగతులు!

Heres Why You Shouldnt Drink Heavy Water  - Sakshi

నీళ్లు ఎంతగా తాగితే ఆరోగ్యం కూడా అంతగా బాగుంటుందని చాలా మంది చెబుతుంటారు. ఇందుకు కారణం చెబుతూ...  మనం నీళ్లు తాగుతున్న కొద్దీ దేహంలోని వ్యర్థాలు కొట్టుకుపోతాయనీ, మలినాలు కడిగినట్లుగా అవుతుంటాయని అంటుంటారు. కానీ నీళ్లు తాగడం అన్నది మన దాహం మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఎంత దాహం వేస్తే అన్ని నీళ్లే తాగాలి. ఓ మోస్తరుగా కాస్త ఎక్కువైనా పర్లేదుగానీ... మరీ ఎక్కువగా తాగడం ప్రమాదమే అంటున్నారు వైద్యనిపుణులు. అంతేకాదు... అతిగా తాగితే నీళ్లతో కూడా ఆరోగ్యం చెడే ప్రమాదం ఉంటుందంటున్నారు.  అంటే దాహం కొద్దీ నీరు మాత్రమే ఆరోగ్యకరం అన్నమాట. అదెలాగో చూద్దాం. 

నీళ్లు ప్రాణాధారం. ఆహారం లేకుండానైనా ఓ వ్యక్తి మూడు వారాలు బతకగలడేమోగానీ... నీళ్లు లేకుండా ఏ వ్యక్తి కూడా రెండు, మూడు రోజులకు మించి బతకలేడు. దేహంలోని అనేక కీలకమైన జీవక్రియలకు నీళ్లు ఉపయోగపడతాయి. దేహం ఒక నియమిత పద్ధతిలో తన అవసరాల కోసం నీటిని సమర్థంగా వాడుకుంటూ ఉంటుంది. ఉదాహరణకు మన శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచడానికి నీళ్లు కావాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు దేహ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి వీలుగా చెమట పడుతుంది. అది మనలో ఉన్న లేటెంట్‌ హీట్‌ను గ్రహించి, ఆవిరైపోయే క్రమంలో శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి ఈ నీరు దోహదపడుతుంది. 

అనేక కార్యకలాపాలకు కీలకం... నీరు అలాగే రక్తప్రసరణ సరిగా జరగడం కోసం, మల విసర్జన సాఫీగా జరగడానికి, మూత్ర విసర్జన రూపంలో దేహంలోని వ్యర్థాలూ, మలినాలను  బయటకు పంపడానికి నీరు చాలా కీలక భూమిక పోషిస్తుంది. దేహానికి అవసరమైన మేర నీరు తాగడం మంచిది. ఓ మేరకు కాస్త ఎక్కువైనా పర్లేదుగానీ... మరీ ఎక్కువైనప్పుడు... శరీరం తాను చేయాల్సిన కీలకమైన పనులను పక్కనబెట్టి దేహంలో ఎక్కువగా ఉన్న నీటిని ఎలా బయటకు పంపాలా అని చూస్తుంది. అందుకే మూత్రరూపంలో బయటకు పంపుతుంది. అందుకే ఎంత ఎక్కువగా నీరు తాగితే అంతగా మూత్రానికి వెళ్లాల్సిన అవసరం వస్తుంటుంది. ఈ క్రమంలో కేవలం నీరు మాత్రమే బయటకు పోదు. దాంతోపాటు దేహానికి అవసరమైన విలువైన సోడియమ్, పొటాషియమ్‌ లాంటి లవణాలూ విసర్జితమవుతుంటాయి.

సోడియం, పొటాషియమ్‌ వంటివి మన దేహంలో ఏ భాగంలోని కండరాలు సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. నీరు బయటకు ఎక్కువగా పోతున్నప్పుడు తనతో పాటు లవణాలను తీసుకెళ్లడం వల్ల మెదడు నుంచి కండరాలకు వెళ్లాల్సిన ఆదేశాలు చక్కగా అందక... కండరాలు బిగుసుకుపోతాయి. మూత్రవిసర్జన ఎక్కువగా జరిగేందుకు మందులు (డై–యూరిటిక్స్‌) వాడుతూ హైబీపీ కోసం మాత్రలు వాడే వారిలోనూ, ఉప్పు చాలా తక్కువగా వాడేవారు, ఎక్కువగా చెమటపట్టే స్వభావం కలిగినవారు... వీళ్లంతా నీరు చాలా ఎక్కువగా తాగితే ‘డల్యూషనల్‌ హైపోనేట్రీమియా’ గురయ్యే అవకాశాలు ఎక్కువ. హై–బీపీ బాధితుల్లోనూ, వయసుపైబడ్డవాళ్లలోనూ, ఆటగాళ్లలోనూ ఈ పరిణామాలు చోటు చేసుకోడాన్ని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ (ఏసీఎస్‌ఎమ్‌), కెనెడియన్‌ న్యూట్రిషన్‌ సొసైటీ వంటి పలు ఆరోగ్య సంస్థలు గుర్తించాయి.    
                  ∙                                                        
వాటర్‌ ఇంటాక్సికేషన్‌ తప్పకపోవచ్చు... 
శరీర అవసరాలకంటే ఎక్కువగా నీరు తాగితే ఒక్కోసారి అది మన జీవకణాల్లోకి చొచ్చుకుపోయి వాటిని నాశనం చేసే ప్రమాదమూ ఉంది. దీన్నే ‘వాటర్‌ ఇంటాక్సికేషన్‌’ అంటారు. బరువు తక్కువగా ఉండే చిన్నారులూ, బాగా ఎండలో ఆటలాడే  స్పోర్ట్స్‌ పర్సన్స్, ఎవరెక్కువ నీళ్లు తాగుతారో అంటూ నిర్వహించే గేమ్‌ షోలలో పాల్గొనేవారిలో (ఇలా గేమ్‌షోలలో పాల్గొని నీరు ఎక్కువగా తాగడంతో) ‘సెల్ఫ్‌ ఇండ్యూస్‌డ్‌ వాటర్‌ ఇంటాక్సికేషన్‌’ (ఎస్‌ఐడబ్ల్యూఐ అనే అనర్థం ఏర్పడవచ్చు.

అలాగే  సైకోజెనిక్‌ పాలీడిప్సియా అనే మానసిక వ్యాధితో బాధపడేవారు కూడా ఎక్కువగా నీరు తాగుతుంటారు. (ఈ రుగ్మత ఉన్నవారు దాహంవేస్తున్నట్లుగా అనిపించడం వల్ల  అదేపనిగా నీళ్లు తాగేస్తూ ఉంటారు). ఇలా ‘సెల్ఫ్‌ ఇండ్యూస్‌డ్‌ వాటర్‌ ఇంటాక్సికేషన్‌’కు పాల్పడేవారు, సైకోజెనిక్‌ పాలీడిప్సియా ఉన్నవారు  అధికమొత్తంలో నీరు తాగినప్పుడు శరీరంలోని లవణాలు కోల్పోయి... అలాగే మెదడు నుంచి లవణాల అయాన్ల ద్వారా కరెంటు రూపంలో అందాల్సిన ఆదేశాలు అందక ఒక్కోసారి అది ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకే దేహానికి ఎంత అవసరమో, మనకు ఎంత దాహం వేస్తుందో... ఆ మేరకే, అవసరమైనన్ని నీళ్లు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. 

మరి ఎన్ని నీళ్లు తాగాలి? ఎలా తాగాలి? 
దాహమైనప్పుడు మాత్రమే నీళ్లు తాగాలి. దాహం తీరేవరకే తాగాలి. ∙మూత్రం మరీ తెల్లగా వస్తోందంటే శరీరంలో నీరు ఎక్కువైందని అర్థం. మరీ పచ్చగా వస్తోందంటే నీరు తగ్గిందని అర్థం. ఈ రెండూ ప్రమాదమే. కాబట్టి  మూత్రం దాని స్వాభావిక రంగులో వచ్చేంత నీరు మాత్రమే తాగాలి. ∙అందుకే ఒకసారికి దాదాపు 100 ఎం.ఎల్‌. గానీ లేదా దాహం బాగా తీరే మేరకు మాత్రమే తాగడం మంచిది.  ∙ఉజ్జాయింపుగా చెప్పాలంటే... వారి వారి బరువును బట్టి ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ 2 లీటర్ల నుంచి 3.5 లీటర్ల వరకు నీళ్లు తాగవచ్చు. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే... మహిళలు 2.7 లీటర్లు (11.5 కప్పులు), పురుషులు 3.7 లీటర్లు (15.5 కప్పులు) తాగడం మేలు. అంతకంటే ఎక్కువ నీరు తాగడం అంత మంచిదికాదు. తక్కువగానూ మంచిది కాదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top