'క్యాన్సర్‌ను జయించాలంటే మనోధైర్యం చాలా అవసరం'

A Health Seminar on Cancer Awareness In Hyderabad - Sakshi

మారిన జీవన శైలి ఎన్నో ముప్పులను తెచ్చిపెడుతోంది. తీసుకునే ఆహారం, పర్యావరణ ప్రతికూలతలు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది క్యాన్సర్‌. మహిళలను వేధించే గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక హెల్త్‌ సెమినార్‌లో క్యాన్సర్‌ను జయించిన మహిళ లు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. రోజువారీ పనుల్లో తీరికలేకుండా ఉండే మహిళలు తమ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధతోపాటు, ధైర్యంగా సమస్యను ఎలా అధిగమించాలో వివరించారు.
మంచీ – చెడు 
నా వయసు 48 ఏళ్లు. ఇరవై ఆరేళ్ల క్రితం పెళ్లయ్యింది. మాకు ఒక పాప. తను విదేశాల్లో ఉద్యోగం చేస్తుంది. రెండేళ్ల క్రితం తన గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన సందర్భంగా అమెరికా వెళ్లాను. అక్కడ నెలసరిలో సమస్యలు తలెత్తడంతో డాక్టర్లను కలిశాను. మెనోపాజ్‌ వల్ల అయ్యుంటుంది అన్నారు.

కానీ, ఆ తర్వాత జరిగిన పరీక్షలు, వారు ఇచ్చిన సూచనలతో ఇండియాకు వచ్చేశాను. రాగానే, కిందటేడాది మొదట్లో ఇక్కడ గైనకాలజిస్ట్‌ను కలిశాను. అన్ని హెల్త్‌ చెకప్స్‌ పూర్తయ్యాక, బయాప్సీ చేశారు. పెట్‌స్కాన్‌లో గర్భాశయ క్యాన్సర్‌ అని నిర్ధారణ అయ్యింది.

కోవిడ్‌ వల్ల నా కూతురు రాలేకపోయింది. కానీ, ఫోన్‌ కాల్స్‌తోనే నాలో పాజిటివ్‌ థింకింగ్‌ నింపింది. మా పేరెంట్స్‌ వయసు పైబడినవాళ్లు. వాళ్లకు ఈ విషయం చెప్పలేకపోయాను. ఆపరేషన్‌ అయ్యింది. డాక్టర్ల సలహాలు పాటిస్తూ మంచి పోషకాహారం తీసుకుంటూ కోలుకోగలిగాను. సైడ్‌ఎఫెక్ట్స్‌కు కూడా చికిత్స చేయించుకోవాలి. క్యాన్సర్‌ జర్నీ చాలా కష్టమైనదే. కానీ, మనోధైర్యం చాలా అవసరం.

చాలామంది క్యాన్సర్‌తో యుద్ధం చేస్తున్నారు. డాక్టర్లు, కుటుంబం, స్నేహితుల వల్ల నాకున్న భయాలు, నొప్పి ఇవన్నీ కోలుకోవడంలో భాగమయ్యా. ఈ ప్రయాణంలో మంచి రోజులు, చెడు రోజులు రెండూ చూశాను. కానీ, అన్నీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్లాను. క్యాన్సర్‌ బారిన పడినవారు దాని నుంచి బయటపడానికి ప్రతి రోజూ ఒక చిన్న స్టెప్‌ తీసుకున్నా అది మనల్ని ఈ యుద్ధంలో గెలిచేలా చేస్తుంది. 
– అర్చనా అర్థాపుర్కర్, 
గృహిణి
సిగ్గుపడకూడదు..
నేను ఇద్దరు అమ్మాయిలకు తల్లిని. 45 ఏళ్ళు. సైకాలజీలో భాగమైన హ్యూమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశాను. నాకు సామాజిక సేవ అంటే చాలా ఇష్టం. 22 ఏళ్లుగా సామాజిక సేవలో భాగంగా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశాను. వాటిలో పిల్లల చదువు, వృత్తి నైపుణ్యాలు, పర్యావరణానికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొన్నాను. నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అని ముందు తెలియదు. లక్షణాల్లో మొదట నా జుట్టు బాగా అంటే కుచ్చులు కుచ్చులుగా ఊడి వచ్చేది. ఇది ఆరోగ్యానికి మంచి లక్షణం కాదనిపించింది.

మా నాన్న డాక్టర్‌. ఈ సమస్య గురించి తనతో చర్చించాను. అన్ని పరీక్షలు చేయించారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ 2వ దశలో ఉందని తెలిసి చాలా షాక్‌ అయ్యాను. ఆపరేషన్‌ తర్వాత 25 సెషన్స్‌ రేడియేషన్స్‌ తీసుకున్నాను. మా పెద్దమ్మాయి విదేశాల్లో చదువుకుంటుంది. కోవిడ్‌ సమయం కావడంతో తను రాలేకపోయింది. చిన్నమ్మాయి 8వ తరగతి చదువుతోంది.

మావారు తన బిజినెస్‌ రీత్యా దూరంగా ఉన్నారు. అది చాలా కష్టమైన సమయం అనిపించింది. హాస్పిటల్‌కి వెళ్లాలన్నా చాలా సవాల్‌గా అనిపించింది. మొదట మా తల్లితదండ్రులు నా దగ్గరకు వచ్చి చికిత్స పూర్తయ్యేంతవరకు ఆరు నెలల పాటు నాతోనే ఉన్నారు. ఆ సమయంలోనే మావారు కూడా రావడం, దగ్గరుండి మందులు ఇవ్వడం దగ్గరనుంచీ ప్రతీది కేర్‌ తీసుకున్నారు.

కుటుంబంతో పాటు బంధువులు, స్నేహితులు నాకు ఎంతో ధైర్యం ఇచ్చారు. దీంతో త్వరలోనే క్యాన్సర్‌ నుంచి కోలుకోగలిగాను. నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళలు సరైన ఆహారం తీసుకోవడంలోనే కాదు రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్స్‌ కూడా చేయించుకోవాలి. క్యాన్సర్స్‌ అనేవి ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టర్‌ సలహా తీసుకోవడం మంచిది.

వీటికి సంబంధించిన హెల్త్‌ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. మామోగ్రామ్‌ పరీక్షలు చేయించుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మంచి పోషకాహారం, వ్యాయామం, సరైన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ ప్రమాదం రాకుండానే జాగ్రత్తపడవచ్చు. రెగ్యులర్‌ పరీక్షల వల్ల మొదటి దశలోనే సమస్యను గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. 
– శిప్రా, సామాజిక సేవా కార్యకర్త
నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top