వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతోంది. అధిక వేడి, డీహైడ్రేషన్, రక్తపోటు మార్పులు గుండెపై అదనపు ఒత్తిడి తెచ్చి ప్రాణాల మీదకు తేవొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, హై బీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లు వేసవిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా.. శరీరం చల్లబడేందుకు గుండె ఎక్కువగా పని చేసే క్రమంలో అలసిపోతుంది. అదే సమయంలో డీహైడ్రేషన్ కారణంగా నీరు, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మాగ్నీషియం) కోల్పోవడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వేడి కారణంగా రక్తనాళాలు విస్తరించి బ్లడ్ ప్రెషర్(రక్తపోటు) పడిపోవడం కూడా జరగొచ్చు. వీటితో పాటు..
వేసవిలో అధిక ఉప్పు, కొవ్వు, మద్యం తీసుకోవడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. అవుట్‌సైడ్ ఫ్యాకర్లుగా.. కాలుష్యం కూడా ఓ ముప్పుగా మారుతోంది.
ఎవరికీ ఎక్కువ ప్రమాదం?
వృద్ధుల్లో.. చెమట పట్టే సామర్థ్యం తగ్గిపోవడం వల్లే ఎక్కువ రిస్క్ ఉంటుంది. హైబీపీ, డయాబెటిస్ ఉన్నవాళ్లకు.. గుండెపై అదనపు ఒత్తిడి పడొచ్చు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవా ఇప్పటికే బలహీనమైన గుండె మరింత ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. డయూరెటిక్స్(వాటర్ పిల్స్), బీటా బ్లాకర్స్(గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గిస్తాయి). NSAIDs మెడిసిన్స్ వాడేవాళ్లలో డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను పెంచుతాయి. ఈ మందులు వేసవిలో వాడేవారు నీరు ఎక్కువగా తాగడం, ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం, డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
వేసవిలో గుండెపోటు నివారణకు జాగ్రత్తలు
తగినంత నీరు తాగండి.. రోజుకు కనీసం 8 గ్లాసులు, బయటకు వెళ్లేవాళ్లు మరింత ఎక్కువగా
కాఫీ, మద్యం, అధిక చక్కెర పానీయాలు తగ్గించండి – ఇవి డీహైడ్రేషన్‌ను పెంచుతాయి.
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో (10 AM – 4 PM) బయటకు వెళ్లకండి.
తేలికపాటి, గాలి చొరబడే దుస్తులు ధరించండి.. కాటన్, లినెన్ ఉత్తమం.
తీవ్రమైన వ్యాయామం వేసవిలో మధ్యాహ్నం చేయకండి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయడం మంచిది.
ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు.. వేడి నుంచి రక్షణ కోసం ఏదైనా ఉపయోగించండి.
వేసవిలో ఆహారం నియంత్రించండి – ఉప్పు, కొవ్వు, మద్యం తగ్గించండి.
హీట్ స్ట్రోక్ లక్షణాలు గుర్తించి అప్రమత్తం కావాలి. అధిక చెమట, తల తిరగడం, గందరగోళం, వేడి చర్మం, అధిక జ్వరం. ఇవి ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి.


