పెళ్లయి ఏడు నెలలు అవుతోంది.. ప్రెగ్నెంట్‌ కాగలనా?

Gynecology And Pregnancy Tips Of Venati Shobha - Sakshi

 సందేహం

నా వయసు 23 సంవత్సరాలు. బరువు 47 కిలోలు. నాకు పెళ్లయి ఏడు నెలలు అవుతోంది. ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి విపరీతంగా వస్తోంది. ఈ మధ్య నెలసరి కూడా సరిగా సమయానికి రాకుండా, వారం లేదా పదిహేను రోజుల ముందుగానే వస్తోంది. నేను ప్రెగ్నెంట్‌ కాగలనా? నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– శిరీష, ఈ–మెయిల్‌

సాధారణంగా సమస్యలేవీ లేకపోతే పెళ్లయిన సంవత్సరంలో 80 శాతం మందికి గర్భధారణ జరుగుతుంది. మిగిలిన వారిలో 15 శాతం మందికి రెండేళ్లకు గర్భధారణ జరుగుతుంది. మిగిలిన ఐదు శాతం మందికి మాత్రమే గర్భధారణ కోసం చికిత్స అవసరమవుతుంది. కాబట్టి ఏడు నెలలైనా గర్భం రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పీరియడ్స్‌ సమయంలో కొందరిలో ప్రోస్టాగ్లాండిన్స్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల పొత్తికడుపులో నొప్పి వస్తుంది.

కొందరిలో గర్భాశయంలో ఫైబ్రాయిడ్‌ గడ్డలు, ఇన్ఫెక్షన్లు, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్‌ వంటి సమస్యల వల్ల కూడా పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపులో విపరీతమైన నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్‌ నెల కంటే ముందుగా వారం పదిహేను రోజులు ముందే రావడం జరుగుతుంది. కొందరిలో అండాశయంలో నీటిగడ్డలు, చాక్లెట్‌ సిస్ట్‌లు వంటి సమస్యలు, థైరాయిడ్‌ సమస్యల వల్ల కూడా పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవచ్చు.

ఈ సమస్యలు ఉన్నప్పుడు గర్భం రావడానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి మీరు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి థైరాయిడ్‌ వంటి అవసరమైన రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్‌ పెల్విక్‌ స్కానింగ్‌ వంటివి చేయిండం వల్ల సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది. దానిని బట్టి తగిన చికిత్స తీసుకోవచ్చు.

నా వయసు ఇరవయ్యేళ్లు. ఇటీవల గైనకాలజిస్ట్‌ దగ్గరకు చెకప్‌కు వెళితే నాకు వజైనల్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ అని చెప్పారు. వజైల్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ బ్యాక్టీరియల్‌ వజైనాసిస్‌ అంత డేంజరస్‌ కాదని విన్నాను. ఇది ఎంతవరకు నిజం. దీనికి పరిష్కారం ఏమిటి? చెప్పగలరు.
– శ్రుతి, సోంపేట

మీకు పెళ్లయినదీ కానిదీ రాయలేదు. సాధారణంగా యోని భాగంలో అనేక రకాల మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ప్రభావం వల్ల మంచి బ్యాక్టీరియా అయిన ల్యాక్టో బాసిలై నుంచి విడుదలయ్యే ల్యాక్టిక్‌ యాసిడ్‌ వంటి పదార్థాలు యోని స్రావాలకు ఆసిడిక్‌ పీహెచ్‌ (ఆమ్లగుణం) ఉండేలా చేస్తాయి. ఈ ఆమ్లగుణం చెడు బ్యాక్టీరియా, ఇంకా ఇతర ఫంగల్, ప్రోటోజోవల్‌ రోగ క్రిములు ఎక్కువగా వృద్ధి చెందకుండా కాపాడతాయి. కొన్ని సందర్భాల్లో యోని స్రావాల్లోని పీహెచ్‌ బ్యాలెన్స్‌ మార్పు చెందిన ఆమ్లగుణం తగ్గిపోతే ఇతర రోగక్రిములు పెరిగి అభివృద్ధి చెంది యోనిలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను అశ్రద్ధ చేసి, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే రోగ క్రిములు గర్భాశయంలోకి, దాని నుంచి ఫెలోపియన్‌ ట్యూబ్స్‌ నుంచి పొత్తికడుపులోకి పాకి, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ (పీఐడీ) వంటి సమస్యలు తలెత్తి, పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, ట్యూబ్స్‌ మూసుకుపోవడం, దానివల్ల గర్భధారణలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.

వజైనల్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ క్యాండిడ్‌ అనే ఫంగస్‌ వల్ల వస్తుంది. ఇది రక్తహీనత, డయాబెటిస్‌ ఉన్నవారిలో, ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ ఎక్కువగా వాడే వారిలో, దీర్ఘకాలం యాంటీబయోటిక్స్, స్టిరాయిడ్స్‌ ఎక్కువగా వాడే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.  కొందరిలో కలయిక వల్ల కూడా ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌లో తెల్లబట్ట చిక్కగా పెరుగులాగ ముక్కలు ముక్కలుగా రావడం, యోనిలో, జననేంద్రియాలలో మంట, దురద వంటి లక్షణాలు ఉంటాయి. ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ అని నిర్ధారణ అయిన తర్వాత గైనకాలజిస్ట్‌ని సంప్రదించి, వారి సలహా మేరకు ఫ్లుకనొజోల్, ఇట్రకెనజోల్‌ వంటి యాంటీ ఫంగల్‌ నోటి మాత్రలతో పాటు యోనిలో పెట్టుకునే యాంటీ ఫంగల్‌ క్రీములు వాడవలసి ఉంటుంది.

అలాగే రక్తహీనత రాకుండా ఉండేందుకు సరైన పోషకాహారం తీసుకోవడం, పెరుగు ఎక్కువగా తీసుకోవడం, తగినన్ని మంచినీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్‌ యోనిలోని ఆసిడిక్‌ పీహెచ్‌ను బ్యాలెన్స్‌ చేయడానికి దోహదపడుతాయి. దానివల్ల రోగ క్రిములు పెరగకుండా ఉంటాయి. అవసరమైతే ల్యాక్టిక్‌ యాసిడ్‌ కలిగిన ఇంటిమేట్‌ వాష్‌తో జననేంద్రియాలను శుభ్రపరచుకోవచ్చు. డెటాల్, సావలాన్‌ వంటి యాంటీసెప్టిక్‌ లోషన్లను జననేంద్రియాల వద్ద వాడకపోవడం మంచిది. వీటి వల్ల మంచి బ్యాక్టీరియా నశించి, వజైనల్‌ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనకవైపు శుభ్రపరచుకోవాలి.

వెనుక నుంచి ముందుకు శుభ్రపరచుకుంటే మలద్వారం వద్ద ఉండే క్రిములు యోనిభాగంలోకి చేరి, అక్కడ ఇన్ఫెక్షన్లను కలిగించవచ్చు. యోనిలో ఆమ్లగుణం తగ్గినప్పుడు అక్కడ గార్డినెల్లా వంటి చెడు బ్యాక్టీరియా పెరిగి, తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్‌ను బ్యాక్టీరియల్‌ వజైనాసిస్‌ అంటారు. ఇందులో తెల్లబట్ట, బురద రంగులో పసుపు లేదా ఆకుపచ్చ రంగులో వచ్చి చేపవాసన, మురుగు వాసనతో ఉండి మూత్రం పోసేటప్పుడు మంట, దురద వంటి లక్షణాలు ఉండవచ్చు.

దీనిపైన క్లామిడియా, గనేరియా వంటి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉండి, పీఐడీ సమస్యలు ఎక్కువగా రావచ్చు. ఈ సమస్యకు గైనకాలజిస్ట్‌ సలహా మేరకు యాంటీబయోటిక్‌ కోర్సు దీర్ఘకాలం వాడవలసి ఉంటుంది. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ వాడవలసి ఉంటుంది. బ్యాక్టీరియల్‌ వజైనాసిస్‌ కంటే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ పెద్ద ప్రమాదమేమీ కాదు. ఏదేమైనా పైన చెప్పిన చికిత్సతో పాటు జాగ్రత్తుల తీసుకుంటున్నట్లయితే తరచు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.

-డా‘‘ వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top