
మంచిమాట
విశాల విశ్వంలోని జనులెందరినో పట్టి పీడించే రుగ్మత, ప్రగతిపథంలో వారు ముందుకు సాగకుండా ఆపివేసే దుర్లక్షణం మత్తు. మత్తు అంటే నిద్ర అన్న నిఘంటువు అర్ధంలోనే మనం తీసుకోరాదు. ఇది ఒక్కో వ్యక్తిని అల్లుకునే ఒక విధమైన జడత్వం. మనిషి పురోగమించాలంటే ముందుగా వదలవలసింది జడత్వంతో కూడిన యోచనలను మాత్రమే. కార్యాచరణకు సంసిద్ధుడై సాగే సమయాన ప్రతి విషయాన్ని సందేహించడం, అనుభవజ్ఞులు చెప్పిన మాటలను విభేదిస్తూ అక్కడే చతికిలబడడం వంటి వాటినీ ప్రగతి నిరోధకాలుగా మనం చెప్పుకోవచ్చు.
చదువుకునే సమయంలో, ఉద్యోగ నిర్వహణలో కొందరు తమతో పనిచేసే మిగిలినవారి కంటే ఉత్తమ ఫలితాలను సాధిస్తూ మహత్తరంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. వారి విజయాలకు కారణం వారి జీవనశైలి. కొంతమంది మాత్రం ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉన్నామన్నట్లుగా చతికిలబడిపోతారు.
ప్రగతికి అడ్డుకట్టు వేసే ప్రధానమైన విషయాలు సోమరితనం, మనిషిలో ఆత్మ విశ్వాసం లోపించడం, అనుక్షణం సందిగ్ధావస్థలోనే కొట్టు మిట్టాడడం వంటివి. అయితే, వీటిలో సోమరితనం అనేది ప్రధానమైన సమస్య. ఒక సినీకవి చెప్పినట్లుగా ‘‘ మత్తు వదలరా.. ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవుదువురా..’’ అంటూనే‘‘జీవితమున సగభాగమ్ము నిద్దురకే సరిపోవును..మిగిలిన ఆ సగభాగమ్ము చిత్తశుద్ధి లేకపోవును..’’ అని కూడా లిఖించాడు. ఆ కవి చెప్పిన మాటలు అక్షర సత్యం. మత్తుగా ఉండడం అంటే మొద్దు నిద్రే కాదు, మనిషి జాగ్రదావస్థలోనే ఉన్నా ఒకింత బద్ధకంగా ఉండడం, చైతన్యరహితంగా ఉండడం, చేయవలసిన కార్యవిధి గురించి అస్సలు ఆలోచించకపోవడం వంటివి కూడా మత్తులో ఉన్నట్లుగానే మనం భావించాలి.
మనిషి కార్యసాధనకు ఉపక్రమించే సందర్భంలో కలిగే సందిగ్ధావస్థ పురోగతికి గొప్ప ప్రతిబంధకం. ఈ అవస్థ ఏదో ఒకటి రెండుసార్లయితే సరి పెట్టుకోవచ్చు. ఆరంభంలో ఎవరికైనా ఇటువంటివి తప్పవు. కానీ, ఇదే సమస్య, ప్రతిసారీ ఎదురైతే, ఆ మనిషి మానసిక స్థితి మీద సందేహ పడవలసిందే..
ప్రతి కదలికకూ భయపడుతూ, ముందుకు సాగితే తనకు ఏమవుతుందో, చేపట్టిన పనిలో ఉత్తమ ఫలితాలు వస్తాయో రావో అని మీమాంసకు గురి కావడమే ఈ రకమైన మానసిక స్థితికి కారణం. ఇటువంటి వారు తప్పకుండా, తమ ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చుకోవాలి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. ఏదన్నా సాధించాలి అని అనుకున్నప్పుడు, అన్నివేళలా, విజయం మన సొంతం కాదు, ఒక్కొక్కసారి పరాజయమూ చవి చూడవలసి వస్తుంది.
తప్పనిసరిగా విజయం సాధిస్తామని తలచినప్పుడు కూడా ఒక్కోసారి మనకు అనూహ్యంగా అపజయం కలుగుతుంది. అటువంటి క్షణాల్లోనే క్రుంగిపోకుండా, నీరస పడకుండా, ఎటువంటి మానసిక ఒత్తిడికీ తలొగ్గక ముందుకు సాగాలి.ఇటువంటి సందర్భాల్లో ఓడిపోయామని తలచకూడదు. మగరాజైన సింహం తనకు కావలసిన ఆహారం లభించకపోతే ఏ మాత్రం నిరాశ చెందదు.
అలసిపోయినా, డస్సిపోయినా, కీళ్ళు సడలిపోయినా, కష్ట స్థితిని పొందినా, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టడానికి సంసిద్ధురాలవుతుంది. అందుకే మానవుడు జడత్వంతో కూడిన మత్తులో ఏమాత్రం కూరుకుపోకూడదు. మత్తులో పడితేఎంతటి యోధుడైనా అవుతాడు చిత్తు..!! మత్తును వదిలి చైతన్యమూర్తిగా మెలిగేవ్యక్తిని తప్పక వరిస్తుంది విజయమనే మహత్తు..!!
ప్రతిరోజూ ఉదయం మనం రోజును ఎలా ప్రారంభిస్తామనే విషయం ఆ రోజంతా మన శక్తి స్థాయిని, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందుకే, జీవితంలో ఏదైనా సాధిద్దామని అనుకునేవారు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునేవారు ఉదయంపూట కొన్ని అలవాట్లను తప్పక పాటించాలి.
ఉదయం 20–30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో కావలసినంతగా వత్తిడిని తగ్గించే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మనిషిలోని శక్తి స్థాయులను పెంచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
– అన్నమయ్య తత్వ ప్రవచన సుధాకర వెంకట్ గరికపాటి