breaking news
Intoxication Drug
-
మత్తు వదిలితేనే మహత్తు
విశాల విశ్వంలోని జనులెందరినో పట్టి పీడించే రుగ్మత, ప్రగతిపథంలో వారు ముందుకు సాగకుండా ఆపివేసే దుర్లక్షణం మత్తు. మత్తు అంటే నిద్ర అన్న నిఘంటువు అర్ధంలోనే మనం తీసుకోరాదు. ఇది ఒక్కో వ్యక్తిని అల్లుకునే ఒక విధమైన జడత్వం. మనిషి పురోగమించాలంటే ముందుగా వదలవలసింది జడత్వంతో కూడిన యోచనలను మాత్రమే. కార్యాచరణకు సంసిద్ధుడై సాగే సమయాన ప్రతి విషయాన్ని సందేహించడం, అనుభవజ్ఞులు చెప్పిన మాటలను విభేదిస్తూ అక్కడే చతికిలబడడం వంటి వాటినీ ప్రగతి నిరోధకాలుగా మనం చెప్పుకోవచ్చు.చదువుకునే సమయంలో, ఉద్యోగ నిర్వహణలో కొందరు తమతో పనిచేసే మిగిలినవారి కంటే ఉత్తమ ఫలితాలను సాధిస్తూ మహత్తరంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. వారి విజయాలకు కారణం వారి జీవనశైలి. కొంతమంది మాత్రం ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉన్నామన్నట్లుగా చతికిలబడిపోతారు.ప్రగతికి అడ్డుకట్టు వేసే ప్రధానమైన విషయాలు సోమరితనం, మనిషిలో ఆత్మ విశ్వాసం లోపించడం, అనుక్షణం సందిగ్ధావస్థలోనే కొట్టు మిట్టాడడం వంటివి. అయితే, వీటిలో సోమరితనం అనేది ప్రధానమైన సమస్య. ఒక సినీకవి చెప్పినట్లుగా ‘‘ మత్తు వదలరా.. ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవుదువురా..’’ అంటూనే‘‘జీవితమున సగభాగమ్ము నిద్దురకే సరిపోవును..మిగిలిన ఆ సగభాగమ్ము చిత్తశుద్ధి లేకపోవును..’’ అని కూడా లిఖించాడు. ఆ కవి చెప్పిన మాటలు అక్షర సత్యం. మత్తుగా ఉండడం అంటే మొద్దు నిద్రే కాదు, మనిషి జాగ్రదావస్థలోనే ఉన్నా ఒకింత బద్ధకంగా ఉండడం, చైతన్యరహితంగా ఉండడం, చేయవలసిన కార్యవిధి గురించి అస్సలు ఆలోచించకపోవడం వంటివి కూడా మత్తులో ఉన్నట్లుగానే మనం భావించాలి.మనిషి కార్యసాధనకు ఉపక్రమించే సందర్భంలో కలిగే సందిగ్ధావస్థ పురోగతికి గొప్ప ప్రతిబంధకం. ఈ అవస్థ ఏదో ఒకటి రెండుసార్లయితే సరి పెట్టుకోవచ్చు. ఆరంభంలో ఎవరికైనా ఇటువంటివి తప్పవు. కానీ, ఇదే సమస్య, ప్రతిసారీ ఎదురైతే, ఆ మనిషి మానసిక స్థితి మీద సందేహ పడవలసిందే.. ప్రతి కదలికకూ భయపడుతూ, ముందుకు సాగితే తనకు ఏమవుతుందో, చేపట్టిన పనిలో ఉత్తమ ఫలితాలు వస్తాయో రావో అని మీమాంసకు గురి కావడమే ఈ రకమైన మానసిక స్థితికి కారణం. ఇటువంటి వారు తప్పకుండా, తమ ఆలోచనా ధోరణిలో మార్పు తెచ్చుకోవాలి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అత్యంత ఆవశ్యకమని గుర్తెరగాలి. ఏదన్నా సాధించాలి అని అనుకున్నప్పుడు, అన్నివేళలా, విజయం మన సొంతం కాదు, ఒక్కొక్కసారి పరాజయమూ చవి చూడవలసి వస్తుంది. తప్పనిసరిగా విజయం సాధిస్తామని తలచినప్పుడు కూడా ఒక్కోసారి మనకు అనూహ్యంగా అపజయం కలుగుతుంది. అటువంటి క్షణాల్లోనే క్రుంగిపోకుండా, నీరస పడకుండా, ఎటువంటి మానసిక ఒత్తిడికీ తలొగ్గక ముందుకు సాగాలి.ఇటువంటి సందర్భాల్లో ఓడిపోయామని తలచకూడదు. మగరాజైన సింహం తనకు కావలసిన ఆహారం లభించకపోతే ఏ మాత్రం నిరాశ చెందదు. అలసిపోయినా, డస్సిపోయినా, కీళ్ళు సడలిపోయినా, కష్ట స్థితిని పొందినా, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టడానికి సంసిద్ధురాలవుతుంది. అందుకే మానవుడు జడత్వంతో కూడిన మత్తులో ఏమాత్రం కూరుకుపోకూడదు. మత్తులో పడితేఎంతటి యోధుడైనా అవుతాడు చిత్తు..!! మత్తును వదిలి చైతన్యమూర్తిగా మెలిగేవ్యక్తిని తప్పక వరిస్తుంది విజయమనే మహత్తు..!!ప్రతిరోజూ ఉదయం మనం రోజును ఎలా ప్రారంభిస్తామనే విషయం ఆ రోజంతా మన శక్తి స్థాయిని, మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందుకే, జీవితంలో ఏదైనా సాధిద్దామని అనుకునేవారు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునేవారు ఉదయంపూట కొన్ని అలవాట్లను తప్పక పాటించాలి.ఉదయం 20–30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. ఒత్తిడిని పెంచే హార్మోన్ల స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో కావలసినంతగా వత్తిడిని తగ్గించే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మనిషిలోని శక్తి స్థాయులను పెంచడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. – అన్నమయ్య తత్వ ప్రవచన సుధాకర వెంకట్ గరికపాటి -
ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్‌బైక్‌లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్‌లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్ -
మత్తు మందు ఇచ్చి ఇంటి యజమాని అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో అద్దెకుంటున్న ఓ తల్లీ, కూతురికి మత్తు మందు ఇచ్చి ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ సందయ్య నగర్లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంటి యజమాని గంగాధర్ యాదవ్, మరో ఇద్దరు వ్యక్తులు మత్తు పదార్థం ఇచ్చి తల్లి (35), కూతురు (15)పై అత్యాచారానికి పాల్పడ్డారు. కూలి పని చేరుకొని జీవనం సాగించే వీరికి ఇంటి యజమాని నిన్న మధ్యాహ్నం మత్తు పదార్థం కలిపిన చికెన్ ఇచ్చాడు. అది తిన్న కొద్ది సేపటికి మహిళ, ఆమె కూతురు, కొడుకు స్పృహ కోల్పోయారు. అనంతరం గంగాధర్, అతని ఇద్దరు స్నేహితులు మైనర్ బాలిక, ఆమె తల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఇంటి యజమాని, అతని స్నేహితులకు మరో మహిళ సాయం చేసిందని స్థానికులు తెలిపారు. కూలీ పని ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరి భర్తకు భార్య, కూతురు, కుమారుడు స్పృహలో లేకపోవడంతో అనుమానం వచ్చింది. దాంతో స్థానికులకు, దాంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా, మత్తు మందు కలిసిన ఆహారం తినడంతో పిల్లలిద్దరూ రక్తపు వాంతులు చేసుకున్నారని స్థానికులు చెప్పారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స నిమిత్తం బాధితులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని నిందితులు రూ.20 వేలకు బేరం మాట్లాడినట్టుగా బాధితులు తెలిపారు. (లైంగిక వేధింపులు తాళలేక మైనర్ ఆత్మహత్య) -
మత్తు మందిచ్చి నిలువు దోపిడీ
హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు తెగబడ్డారు. ఏలూరు-తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ల మధ్య రైలులో ప్రయాణికులకు మత్తు మందిచ్చి సొత్తు దోచుకెళ్లారు. వారిచ్చిన శీతల పానీయాలు స్వీకరించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రయాణికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎ.సర్కార్(65), ఎస్.సర్కార్(58), ఎస్.సర్కార్(26)లు గోదావరి ఎక్స్‌ప్రెస్ హెచ్1 ఏసీ కోచ్‌లోని 15, 16, 17 బెర్త్‌ల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు మహిళ. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అపరిచితులు బాదం పాలలో మత్తు మందు కలిపి ముగ్గురికీ ఇచ్చారు. కొంతసేపటికీ ముగ్గురూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. దీంతో దొంగలు వారి వద్దనున్న సొత్తు దోచుకెళ్లారు. గురువారం ఉదయం రైలు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంది. అపస్మారక స్థితిలో ఉన్నవారిని గమనించిన పోలీసులు గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారని, ఏపీ, తెలంగాణాల్లో విహార యాత్రకు వచ్చారని పోలీసులు తెలిపారు. వారి వద్ద ఉన్న వీడియో కెమెరా, సెల్‌ఫోన్, ఆపిల్ ఐ ప్యాడ్, రూ.4,630 నగదు, లగేజీని రైల్వే స్వాధీనం చేసుకున్నారు. హెచ్1 బోగీని ఇన్స్పెక్టర్ రంగయ్య బృందం పరిశీలించింది. సంఘటనా స్థలంలో బాదం పాల బాటిల్స్ సేకరించారు. బోగీ ఏసీ మెకానిక్ వెంకటేశ్వర్లును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులు మాట్లాడే స్థితిలో లేరని, కోలుకోగానే పూర్తి వివరాలను రాబడతామని ఇన్స్పెక్టర్ చెప్పారు.