‘గో నిషా గో’ గేమ్‌ : వారి కోసమే, డౌన్‌లోడ్లతో దూసుకుపోతోంది

Go Nisha Go game designed to empower young girls over 3 lakh downloads - Sakshi

చాలామంది అమ్మాయిలకు బంగారు కలలు ఉంటాయి. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కలలు సాకారం చేసుకోలేక పోతారు. ‘ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నా కలను సాకారం చేసుకుంటాను’ అనే పట్టుదల ఉంటే కలను నెరవేర్చుకోవడం అసాధ్యమేమీ కాదు. దిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ‘నిషా’ కల్పిత  పాత్ర. ‘గో నిషా గో’ గేమ్‌లో ప్రధాన పాత్ర.

‘నా ప్రయాణంలో ధైర్యమే నా ఆయుధం’ అనుకుంటే తడబడడం ఉండదు. అధైర్యం అసలే ఉండదు. దీనికి ఉదాహరణ నిషా. పందొమ్మిది సంవత్సరాల నిషా ఎన్నో కలలు కంటుంది. ఆ కలల దారిలో నిషాకు ఎదురైన అనుభవాలకు ‘గో నిషా గో’ అద్దం పడుతుంది. మొబైల్‌ గేమ్‌ ‘గో నిషా గో’ యువ యూజర్‌లకు మార్గ నిర్దేశం చేస్తుంది. బాల్య వివాహాలను నిరాకరించడం నుంచి ఆర్థిక స్వాతంత్య్రం వరకు కీలక అంశాలపై అవగాహన కలిగించే గేమ్‌ ఇది.

డిజిటల్‌ గేమ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘గేమ్‌ ఆఫ్‌ చాయిస్‌ నాట్‌ చాన్స్‌’ నుంచి వచ్చిన తొలి గేమ్‌ ‘గో నిషా గో’. ‘క్రియేటివ్‌ నాన్‌– ప్రాఫిట్‌ సంస్థ గర్ల్‌ ఎఫెక్ట్‌ భాగస్వామ్యంతో దిల్లీ, రాజస్థాన్, బిహార్‌లలోని రెండు వందల మందికి పైగా అమ్మాయిలతో మాట్లాడాం. కౌమారదశలో వారు ఎదుర్కొన్న సమస్యలపై ఎన్నో ప్రశ్నలు అడిగాం. రకరకాల సవాళ్లు ఎదురైనప్పుడు సలహాల కోసం ఎవరి దగ్గరకు వెళతారు... ఇలాంటివి ఎన్నో అడిగాం’ అంటుంది ‘గేమ్‌ ఆఫ్‌ చాయిస్‌–నాట్‌ చాన్స్‌’ కంట్రీ డైరెక్టర్‌ కవితా అయ్యగారి. రుతుస్రావం నుంచి సంతానోత్పత్తి వరకు ఎన్నో అంశాలపై అమ్మాయిలకు విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో లేదనే విషయం కవిత బృందానికి అర్థమైంది. తాము ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడటానికి అమ్మాయిలు సంకోచించడం, సామాజిక కట్టుబాట్ల పేరుతో తల్లిదండ్రుల ఒత్తిడి... మొదలైన విషయాలను బృందం గ్రహించింది.

ఏ సలహా దొరకక, ఏ దారి కనిపించక అయోమయంలో ఉన్న అమ్మాయిలకు ‘నిషా’ గేమ్‌ ఒక దారి చూపుతుంది. నైతికస్థైరాన్ని ఇస్తుంది. ఈ గేమ్‌ మెన్‌స్ట్రూయెల్‌ హెల్త్‌ హెల్ప్‌లైన్‌తో సహా రకరకాల ఆరోగ్య అంశాలకు సంబంధించిన ఉత్పాదనలు, సేవలు, మహిళల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి వీడియో లింక్‌లను అందిస్తుంది. ‘గో నిషా గో’ గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.

అవగాహన పెంచుతోంది...
‘గో నిషా గో’ గేమ్‌ ఆడని వారితో పోల్చితే ఆడేవారిలో వివిధ విషయాలపై అవగాహన మెరుగు అవుతున్నట్లు అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయి. విషయ అవగాహనతో పాటు ఆత్మస్థైర్యం కూడా  ఈ ఆట పెంచింది. ఈ గేమ్‌ ప్రభావంతో ఆగి΄ోయిన చదువును తిరిగి కొనసాగించిన వారు, ‘నాకు పై చదువులు చదువు కోవాలని ఉంది. ఇప్పుడే పెళ్లి వద్దు’ అని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పిన వారు, ఆర్థిక స్వాతంత్య్రంపై దృష్టి పెట్టినవారు ఎంతోమంది ఉన్నారు. హోవార్డ్‌ డెలాఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌(హెచ్‌డిఐ) ‘గేమ్‌ ఆఫ్‌ చాయిస్‌–నాట్‌ చాన్స్‌’ సోషల్‌ ఇంపాక్ట్‌ ప్రాజెక్ట్‌ కింద ‘గో నిషా గో’కు శ్రీకారం చుట్టింది.

హెచ్‌డీఐ’ అనేది సామాజిక, పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను అన్వేషించే మహిళల నేతృత్వంలోని బృందం. ‘మా అమ్మ తన కలలు, లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉన్న వ్యక్తి. అమెరికాలో చదువుకోవాలనే కోరిక ఆమెకు ఉండేది. తన చదువు కోసం పెళ్లిని వాయిదా వేయాలని, గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పింది. తన కలల గురించి గట్టిగా నిలబడక΄ోతే ఆమె జీవితం మరోలా ఉండేది’ అంటుంది ‘హెచ్‌డిఐ’ కో–ఫౌండర్‌ సుసాన్‌ హోవార్డ్‌.

వీడియో గేమ్స్‌ అంటే పవర్‌పుల్‌ వెపన్స్, పవర్‌ఫుల్‌ ఫైట్స్‌ మాత్రమేనా? ‘కాదు’ అంటుంది ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కు  పెద్ద పీట వేసిన ‘గో నిషా గో’ .పదిహేను నుంచి పందొమ్మిది సంవత్సరాల  మధ్య వయసు ఉన్న అమ్మాయిలకు రుతుచక్రం, పెళ్లి, చదువు, కెరీర్‌... మొదలైన వాటి గురించి  అవగాహన కలిగిస్తోంది  ఫ్రీ మొబైల్‌ గేమ్‌   గో నిషా గో. ఈ గేమ్‌  అంతర్జాతీయ స్థాయిలో  ‘బెస్ట్‌ సీరియస్‌ గేమ్‌’  అవార్డ్‌ గెలుచుకుంది...!
 

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top