సత్యప్రమాణాల దేవుడికి బ్రహ్మోత్సవాలు

Ganesh Chaturthi 2022: Kanipakam Brahmotsavam, Kanipakam Temple History - Sakshi

దేశంలోని గణపతి క్షేత్రాల్లో కాణిపాకం ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో స్వయంభూ క్షేత్రంగా వెలసింది. ఇక్కడ వెలసిన గణపతి సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి పొందాడు.  బాహుదా నదీతీరంలోని ఈ స్థలపురాణానికి సంబంధించి ఒక గాథ ప్రచారంలో ఉంది. బాహుదా నదీతీరాన విహారపురంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు అంధుడు, ఇంకొకరు మూగవాడు, మరొకరు బధిరుడు. వారికి ‘కాణి’ భూమి ఉండేది. ‘కాణి’ అంటే, పావు ఎకరం. అందులోనే వాళ్లు వ్యవసాయం చేసుకునేవాళ్లు. 


ఒకసారి కరవు వచ్చి, ఆ భూమిలోని బావి ఎండిపోయింది. నీటికోసం ఆ బావిని మరింత లోతుగా తవ్వేందుకు ముగ్గురు అన్నదమ్ములూ పలుగు పారలు తీసుకుని, అందులోకి దిగారు. తవ్వుతూ ఉండగా, ఇసుకపొరలో రాయి అడ్డు వచ్చింది. దానిపై పలుగుపోటు పడగానే, దాని నుంచి నెత్తురు చిమ్మింది. ఆ రక్తస్పర్శతో ముగ్గురు అన్నదమ్ముల వైకల్యాలూ తొలగిపోయాయి. వారి ద్వారా సంగతి తెలుసుకున్న గ్రామస్థులు అక్కడకు చేరుకుని, బావిలోని ఇసుక తొలగించారు. అందులో వినాయక విగ్రహం దొరికింది. అలా ఇక్కడ స్వయంభువుగా వెలసిన గణపతిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల జనం తండోపతండాలుగా వచ్చారు. వారు కొట్టిన టెంకాయల నీటితో ‘కాణి’ విస్తీర్ణం ఉన్న పొలమంతా తడిసిపోయింది. ‘కాణి’ నేలలో నీరు పారినందున తమిళంలో దీనికి ‘కాణిపారకం’– (‘పారకం’ అంటే ప్రవహించడం) అనే పేరు వచ్చింది. కాలక్రమేణా జనుల నోట ఈ పేరు కాణిపాకంగా మారింది. 


ఇదీ చరిత్ర

కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. మొదటి కుళోత్తుంగ చోళుడు పదకొండో శతాబ్దిలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో విజయనగర రాజులు దీనిని మరింతగా అభివృద్ధిపరచారు. ఈ క్షేత్రంలో చోళ, పాండ్య, గంగవంశ రాజులు వేయించిన శాసనాలు బయటపడ్డాయి. కాణిపాకం వినాయక ఆలయ ప్రాంగణంలోనే వరదరాజ, మణికంఠేశ్వర, వీరాంజనేయ ఉపాలయాలు ఉన్నాయి. ముప్పయ్యేళ్లుగా ఈ ఆలయంలో భక్తులకు నిత్యాన్నదానం జరుగుతోంది. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో వివాహం చేసుకోవడం శుభకరమని భక్తుల విశ్వాసం. ఇటీవలి కాలంలో ఇక్కడ వివాహాలు పెరుగుతున్నందున, దేవస్థానం నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం ఏడు కళ్యాణ మండపాలను నిర్మించారు. (క్లిక్‌: అందరూ నా పుట్టినరోజును సంబరంగా, సంతోషంగా జరపుకోవాలి!)


వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకునికి ఏటా బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ ఏడాది ఆగస్టు 31న వినాయక చవితి మొదలుకొని తొమ్మిదిరోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు, తర్వాత పన్నెండు రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని తర్వాత కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకునికి మాత్రమే స్వర్ణరథం ఉంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top