గణేశ్‌ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము

Ganesh Chaturthi 2022: High Protein Healthy Breakfast Kudumu - Sakshi

వినాయక చతుర్థి వచ్చిందంటే చాలు ప్రతీ ఇంటిలో తొమ్మిది రోజుల పండగే. వినాయక చవితి అంటే పండగే కాదు., ఆరోగ్య జీవనాన్ని ప్రతిబింభించే సంస్కృతి కూడా..! చవితి రోజున దాదాపు 15 రకాల వనమూలికలతో పూజను చేయడం ఆనవాయితీ. అంతేకాదు గణేషునికి ప్రసాదంగా అందించే కుడుములు, ఉండ్రాళ్లు కూడా ఆరోగ్య ప్రధాయిని. విభిన్న ప్రాంతాలకు, సంస్కృతులకు చెందిన కుడుములు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయని న్యూట్రీషనర్స్, ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ కుడుములు విభిన్న పేర్లతో విభిన్న రాకాలుగా ఉన్నప్పటికీ కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుములను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు.

కొంకణ్‌లో బయట రవ్వ కోటింగ్‌ ఇచ్చి తయారు చేసేవి ములిక్‌గా ప్రసిద్ది,  మోదక్‌గా పేర్కొనే సంప్రదాయ కుడుములను అరటిపళ్లతో తయారు చేస్తారు. అలాగే కేరళలో మినప్పప్పు, స్పైసెస్‌తో సాల్టీ స్టీమ్డ్‌ వెర్షన్‌గా ఉప్పు కొజుకత్తై పేరిట వండి సమర్పిస్తారు. తెలంగాణాలో ఉండ్రాళ్లు, చలివిడి, వడపప్పు వంటి రకాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. హోమ్‌ఫుడ్స్‌ విక్రయించే చోట ప్రతి సంవత్సరం ఈ ఉండ్రాళ్లలో విభిన్న వెర్షన్స్‌ కనిపిస్తుంటాయి. ఇక్కడ బాదములు, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్‌ కూడా జత చేస్తున్నారు. గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ ‘‘బాల గణేషుని కథలో మోదక్‌ (కుడుములు) పట్ల ఆయన అభిరుచిని గురించి ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంవత్సరం కథల రూపంలో చెబుతూనే ఉంటారు. అందువల్లే అవి వయసులకు అతీతంగా ఆకట్టుకుంటున్నాయి ’’ అని అన్నారు.

పుష్కలంగా కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌...
సాధారణంగా కుడుములను బియ్యం పిండి, శకగపప్పు, మినప్పప్పుతో తయారు చేస్తారు. ఈ మిశ్రమంతో శరీరానికి కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ పుష్కలంగా అందుతాయి. ఈ కుడుముల్లోని కొబ్బరి–బెల్లం చూర్ణం అధిక మొత్తంలో కాల్షియంను అందిస్తాయి. కుడుములను స్వీట్, హాట్‌ రెండు రకాలుగానూ చేసుకోవచ్చు. బియ్యపు పిండితో పాటు మిల్లెట్స్, రాగి పిండితో చేసిన కుడుములు అధిక విటమిన్లు, ఫైబర్‌ అందిస్తాయి. వీటికి చూర్ణంలో భాగంగా కొత్తిమీర, ఆకుకూరలు, కరివేపాకు పొడి, ముద్దగా చేసిన ఆకుకూరపప్పు, డ్రై కర్రీలను వాడుకోవచ్చు.

ఈ కుడుములను పిండితో చేస్తాం కాబట్టి కొద్ది రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి మూడు రోజుల వరకు తినవచ్చు.  ప్రస్తుతం మార్కెట్‌లో ప్రాచుర్యం పొందుతున్న మోమోస్‌ ఓ రకంగా  కుడుముల లా తయారైనవే. అయితే వాటికన్నా ఇవి ఆరోగ్యకరం. మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్న ఆరోగ్య నియమాలు ఎంతో విశిష్టమైనవి. ప్రతీ పండుగకు విభిన్నమైన ఆహార పదార్థాలు, ప్రసాదాలు ఉంటాయి. శరీరానికి అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందడానికి ఈ తయారీ విధానం ఉపయోడపడుతుంది. అంతేకాకుండా కొత్త రుచులను అందిస్తాయి. చిన్న పిల్లలు, పెద్దవారు ఎవరైనా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. 
–జానకి,న్యూట్రీషనిస్ట్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top