డిజిటల్‌ క్రైమ్‌: కత్తితో పొడిస్తేనే హత్య కాదు..! | Funday Special Story For Differen Angle | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ క్రైమ్‌: కత్తితో పొడిస్తేనే హత్య కాదు..!

May 17 2026 3:44 PM | Updated on May 17 2026 3:55 PM

Funday Special Story For Differen Angle

డాక్టర్‌ కృపాకర్‌ తన గదిలోనే నిర్జీవంగా పడి ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ఫోరెన్సిక్‌ తెలివితేటలతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించిన అతడు అనుమానాస్పదంగా మరణించడం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను షాక్‌కు గురిచేసింది. కృపాకర్‌ బ్రహ్మచారి. రాత్రి వంటమనిషి వంట చేసి వెళ్తుంది. పొద్దున్నే సర్వెంట్‌ డూప్లికేట్‌ కీతో లోపలికి  వచ్చి పనులు పూర్తి చేసుకుని కాఫీతో డాక్టర్‌ను నిద్ర లేపుతుంది. ఎంత పిలిచినా డాక్టర్‌ లేవకపోవడం, తన గది తలుపు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫోన్‌ చేసింది.
∙∙ 
డిటెక్టివ్‌ సిద్ధార్థ డాక్టర్‌ కృపాకర్‌ బెడ్‌రూమ్‌ను పరిశీలిస్తున్నాడు. మృతదేహం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా పెనుగులాట ఆనవాళ్లు లేవు. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆయన గుండె ఆగి మరణించారు. దానికి కారణం తీవ్రమైన ‘షాక్‌’. కానీ గదిలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన దాఖలాలు లేవు. అంతగా షాక్‌కు గురి చేసే సంఘటనలు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. డిటెక్టివ్‌ సిద్ధార్థకి ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది. 

కృపాకర్‌ టేబుల్‌ మీద ఉన్న ఒక ఖరీదైన ‘స్మార్ట్‌ ఆడియో స్పీకర్‌’ వైర్‌ కట్‌ అయి ఉంది. అలాగే, కృపాకర్‌ చేతికి ఉన్న స్మార్ట్‌ వాచ్‌ మరణానికి కొన్ని నిమిషాల ముందు అసాధారణమైన హార్ట్‌ రేట్‌ రికార్డ్‌ చేసింది. అతనికి శత్రువులు ఎవరూ లేరు... ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు వెళ్లి  విచారించాడు. కృపాకర్‌ మెడికల్‌ హిస్టరీ పరిశీలించాడు. కృపాకర్‌ స్టాఫ్‌ను ఒక్కొక్కరినీ విడివిడిగా విచారించాడు. కృపాకర్‌ చావుకు కారణం తెలిసింది.
∙∙ 
కాలింగ్‌ బెల్‌ అదే పనిగా మోగుతూ ఉండటంతో నిద్రమత్తులోనే వచ్చి తలుపు తీశాడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ భార్గవ్‌. ఎదురుగా డిటెక్టివ్‌ సిద్ధార్థ. ‘మీరా ఇంత రాత్రి వేళ?’ గోడ గడియారం వంక చూస్తూ అన్నాడు భార్గవ. రాత్రి పదకొండు...‘మీ డాక్టర్‌ చనిపోయిన బాధలో మీరు నిద్రపోయి ఉండరని ఈ టైంలో డిస్ట్రబ్‌ చేయాల్సి వచ్చింది.’ భార్గవ వంకే చూస్తూ అన్నాడు. ‘యస్‌... యస్‌...’ అన్నాడు భార్గవ.. ‘మరి ఇక వెళదామా?’ అన్నాడు డిటెక్టివ్‌ సిద్దార్థ. ‘ఎక్కడికి?’ ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. 

‘పోలీస్‌ స్టేషన్‌కు.. డాక్టర్‌ కృపాకర్‌ను డిజిటల్‌ టెక్నాలజీ అనే ఆయుధంతో హత్య చేసినందుకు...’ తాపీగా అన్నాడు  డిటెక్టివ్‌ సిద్దార్థ.‘హత్య? నేనా?’ ఆశ్చర్యం నటించాడు భార్గవ.‘నీ కాల్‌ హిస్టరీలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని మా శైలిలో విచారించాం. మిస్టర్‌ భార్గవ్, కృపాకర్‌ ఎదుగుదలను చూసి ఓర్వలేక పోయారు. ప్రొఫెషనల్‌ జెలసీ. కృపాకర్‌కు బలహీనమైన గుండె ఉందని తెలుసుకున్నారు. మీరు కృపాకర్‌ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిశారు. డాక్టర్‌ కృపాకర్‌కు ‘ఫోనోఫోబియా’ (అకస్మాత్తుగా వచ్చే శబ్దాలంటే భయం) ఉందని తెలుసుకున్నారు.

ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సహాయంతో కృపాకర్‌ ఇంట్లోని స్మార్ట్‌ హోమ్‌ సిస్టమ్‌ను హ్యాక్‌ చేశారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, గదిలోని స్పీకర్ల ద్వారా అత్యంత భయంకరమైన, అధిక డెసిబుల్స్‌ ఉన్న శబ్దాన్ని (అల్ట్రాసోనిక్‌ హై ఫ్రీక్వెన్సీ సౌండ్‌) ఒక్కసారిగా ప్లే చేశారు. ఆ నిశ్శబ్ద రాత్రి ఊహించని ఆ భీకర శబ్దానికి కృపాకర్‌ గుండె తట్టుకోలేకపోయింది. షాక్‌తో ఆయన ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ఆ తర్వాత రిమోట్‌ ద్వారా ఆ ఆడియో ఫైల్‌ను డిలీట్‌ చేశారు.

మీ ల్యాప్‌టాప్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే సెర్చ్‌ హిస్టరీలో ‘హౌ టు ట్రిగ్గర్‌ కార్డియాక్‌ అరెస్ట్‌ యూజింగ్‌ సౌండ్‌ వేవ్స్‌’ అనే అంశం కనిపించింది. అంతేకాకుండా, కృపాకర్‌ చనిపోయిన సమయానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు మీ ఫోన్‌ నుండి కృపాకర్‌ ఇంటి వైఫై  నెట్‌వర్క్‌కు కనెక్షన్‌ వెళ్ళినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు.’ డిటెక్టివ్‌ సిద్ధార్థ లేస్తూ అన్నాడు.

‘కత్తితో పొడిస్తేనే హత్య కాదు భార్గవ్, ఒకరి భయాన్ని ఆయుధంగా మార్చుకుని చంపడం కూడా ముమ్మాటికీ హత్యే!’  ‘టెక్నికల్‌ మర్డర్‌’ డిజిటల్‌ క్రైమ్‌. ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేరస్థుల కన్నా తెలివైన వాళ్ళు పోలీసులు, డిటెక్టివ్‌లు. మీ తెలివితేటలు మీరు ఎదగడంపైన చూపించాల్సింది. మీ జెలసీ మిమ్మల్ని నేరస్థుడిని చేసింది.’ సిద్దార్థ భార్గవ్‌ను చూస్తూ చెప్పాడు. 

శ్రీ సుధామయి

(చదవండి: ఆ కేఫ్‌ మొత్తం ఆడవాళ్లే..!)
 

Advertisement
 
Advertisement
Advertisement