దాంపత్యం | Funday Special: Malladi Venkata Krishna Murthy Story | Sakshi
Sakshi News home page

దాంపత్యం

May 17 2026 4:16 PM | Updated on May 17 2026 4:16 PM

Funday Special: Malladi Venkata Krishna Murthy Story

కారులో కూర్చున్న అరవై రెండేళ్ళ ఆయన  చేతి గడియారం వంక చూసుకుని, అసహనంగా ఇంటి గుమ్మంవైపు చూశాడు. ఆయన భార్య చేతిలో హేండ్‌ బేగ్‌తో వచ్చి ఆయన పక్కన కూర్చుంది. ‘‘ఆలస్యమైందే?’’ ఆయన కారు స్టార్ట్‌ చేస్తూ కోపంగా అడిగాడు. ‘‘హేండ్‌ బేగ్‌ కనపడలేదు.’’ ‘‘అందుకే తీసిన వస్తువు తీసిన చోటే ఉంచాలని చెప్పేది.’’ ‘‘మొదలెట్టారూ గ్రామఫోన్‌ రికార్డు?’’ ‘‘నేను చెప్పేవన్నీ జీవితానికి ఉపయోగించేవి. గిఫ్ట్‌ పేక్‌ తీసుకున్నావా?’’

‘‘అరే. మర్చిపోయానండి. మీరైనా గుర్తు చేయాల్సింది.’’ ‘‘ఎన్నిసార్లు చెప్పినా నీకు తలకెక్కదు. పైగా గ్రామఫోన్‌ రికార్డ్‌ అంటావు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి. దాన్ని నీ చెప్పుల పక్కన ఉంచమని నిన్న రాత్రి చెప్పానా? అప్పుడు మర్చిపోవని.’’ ఆయన ఆగ్రహాన్ని అణచుకుంటూ చెప్పాడు. ‘‘మన పెళ్ళై ఎన్నేళ్ళైందంటారు?’’ ఆవిడ తన భర్త వంక చూస్తూ అడిగింది. ‘‘తెలీదా?’’ ‘‘మీకు తెలిస్తే చెప్పమంటున్నాను.’’‘‘ముప్ఫై ఆరేళ్ళు. ఐతే?’’

‘‘అంతకాలం నించి మీరు నన్ను సాధిస్తున్నారు. అత్తలేని సంబంధం అని మా వాళ్ళు మీకిచ్చి చేశారు. కాని మీరు డబల్‌ అత్తగారని వాళ్ళకి తెలీదు.’’ ‘‘ఆపుతావా?’’ ఆయన అరిచాడు. ‘‘మీరు కారుని ఆపేదాకా ఆపను. ఏం? మీరు సాధించగా లేనిది నేను సాధించకూడదా? కొత్తల్లో భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం లేదు. మీరు గెట్‌ అవుట్‌ అంటే పెద్దాడి ఇంటికి వెళ్ళిపోతాను.’’

‘‘స్టీరింగ్‌ వీల్‌ ముందు కూర్చున్న వాడికి కోపం తెప్పించకూడదు, అది ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పాలి?’’ ఆయన కోపంగా అడిగాడు. ‘‘మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్‌ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్‌ డిక్టేట్‌ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్‌ వస్తుంది. ఆపండి. ఓ బొకే  కొనుక్కెళ్దాం.’’‘‘ఎందుకు? మర్నాడు మన డబ్బు చెత్తబుట్టలో చేరడానికా? పళ్ళబుట్టని కొనుక్కెళ్దాం.’’

‘‘పూల బొకే రెండు వందల ఏభైతో పోతుంది. పళ్ళబుట్టలో అరడజను పళ్ళు. దానికి ఆరు వందలు తీసుకుంటారు. ఆ మేదర బుట్ట ఖరీదే రెండు వందలు ఉంటుంది.’’ ‘‘ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు.’’‘‘కాదు. మీరు డబ్బుని వృథా చేస్తున్నారు అంటాను.’’ ‘‘ఎక్కడ ఆదా చేయాలో, ఎక్కడ ఖర్చు చేయాలో ఇంతకాలం నాతో కాపురం చేశాక కూడా నీకు బోధపడలేదు.’’ ఆయన గొణిగాడు. ‘‘ఏమిటి? గట్టిగా వినేలా తిట్టొచ్చుగా.’’ ఆయన మాట్లాడలేదు.

‘‘ఇల్లు తాళం వేశానంటారా?’’ ఆవిడ కొద్దిసేపు ఆగి అడిగింది. ‘‘కారులో కూర్చున్నవాడికి ఎలా తెలుస్తుంది? అది ఇంట్లోంచి బయటికి వచ్చిన వాళ్ళకి తెలియాలి.’’ ‘‘నేను కారులోకి తాళంచెవుల గుత్తితోనే వచ్చానా అని అడుగుతున్నాను.’’ ‘‘నా దగ్గర బైనాక్యులర్స్‌ లేవు.’’
‘‘వెనక్కి తిప్పండి.’’ ‘‘ముహూర్తం టైంకి వెళ్ళాలి.’’ ‘‘తాళం వేయకపోతే ఏ డెలివరీ బాయో ఉన్నదంతా చక్కబెట్టుకుపోతాడు. వెనక్కి తిప్పండి.’’

‘‘మనం పెళ్ళి ముహూర్తానికి వెళ్ళి తీరాలి.’’ ఆయన కోపంగా అరిచాడు. ‘‘ఇంటికి తిరిగి వెళ్ళేదాకా నాకు ఆందోళనగా ఉంటుంది.’’ ‘‘ఉండనీ.’’ ‘‘మీ వల్లే నాకు బీపీ’’ ‘‘అది మీ ఇంటి పేరు. మీ నాన్నకి, అమ్మకి, అక్కయ్యకి, ఆఖరికి మీ పనిమనిషికి, పెంపుడు కుక్కకీ కూడా బీపీ. నాకు లేదు.’’ ‘‘మీలాంటి వాళ్ళ వల్లే నాకు మాకు బీపీ’’ ఆవిడ కోపంగా అరిచింది. ‘‘అరవక. నీకు బీపీ వచ్చింది.’’ ‘‘నాకేం? హైకోర్ట్‌ జస్టిస్‌ ఇంట్లో దొంగలు పడ్డారని పేపర్లో రానీండి.’’

‘‘విడాకుల గురించి ఏం ఆలోచించావు?’’ ఆయన అకస్మాత్తుగా అడిగాడు. ‘‘పెద్దాడు వద్దన్నాడు. భరణం ఎంత వస్తుందో ముందు కనుక్కోమన్నాడు.’’ ‘‘ఆ ఆలోచన కూడా చేశారన్నమాట. మీ కడుపులో ఎన్ని ఆలోచనలు దాచుకున్నారు!’’ ‘‘ఆలోచనలు కడుపులో దాచరు. మెదడులో దాస్తారు. అందుకే మీ జడ్జిమెంట్లని సుప్రీం కోర్ట్‌ కొట్టేస్తూంటుంది.’’ ‘‘షటప్‌. ఎకసెక్కెమా?’’

ఆయన బ్రేక్‌ వేయడంతో ఆ కుదుపుకి ఆవిడ తల డేష్‌ బోర్డుకి కొట్టుకుంది. వెనక సీట్లో కూర్చున్న దర్శకుడు చెప్పాడు. ‘‘నైస్‌. ‘దాంపత్యం’ సరైన టైటిల్‌. మీతరం వాళ్ళల్లోని గొప్పతనం ఇదే. రిహార్సల్స్‌ కావాలంటారు. డైలాగ్స్‌ కంఠతా పడతారు. బయట మీ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారని ప్రేక్షకులకి తెలుసు. స్క్రీన్‌ మీద ఇలా పోట్లాడుకుంటుంటే ఎంజాయ్‌ చేస్తారు. టేక్‌ చేద్దామా?’’ మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్‌ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్‌ డిక్టేట్‌ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్‌ వస్తుంది. ఆపండి. ఓ బొకే  కొనుక్కెళ్దాం. 
మల్లాది వెంకట కృష్ణమూర్తి  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement