ఫండే: కథ - 'ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు..!' | Funday: 'The secret' Short Story Written By LR Swami | Sakshi
Sakshi News home page

ఫండే: కథ - 'ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు..!'

Mar 17 2024 1:05 PM | Updated on Mar 17 2024 1:05 PM

Funday: 'The secret' Short Story Written By LR Swami - Sakshi

ఇంటి దగ్గరకు వచ్చే కొద్ది చీకటి చిక్కపడుతూ వచ్చింది. మనసు బాధతో ఒక్కసారి మూలిగింది. రాత్రి కూడా ఆఫీసులోనే గడిపితే – ఇల్లే కదా స్వర్గసీమ అనేది ఉత్త మాటేనా? బాధగానే తలుపు తట్టాను. అనుభవానికి భిన్నంగా తలుపులు వెంటనే తెరుచుకున్నాయి. చిమ్మచీకట్లో పూర్ణ చంద్రోదయం అయినట్లు, చిరునవ్వుతో ఎదురుగా నిలబడి వుంది మా ఆవిడ!

ఆశ్చర్యంతో పెదవి పెగలలేదు నాకు. అడుగు ముందుకు పడలేదు. క్రికెట్లో పదకొండవ నెంబర్‌ ఆటగాడైన  బౌలర్‌ రెండు వందలు కొట్టినట్లు వింటే కలిగేటంత ఆశ్చర్యం.. బహుమతి వచ్చిన లాటరీ టికెట్‌ను ఎవరో మతిలేనివాడు నాకు అందిస్తే కలిగేటంత ఆశ్చర్యం.. యాబై యేళ్ళ జీవితంలో ఒక్కసారైనా చూడని, పేరు వినని వాడు విశాఖలో అచ్చంగా నాకు వెయ్యిగజాలు ఉచితంగా రాసిచ్చాడని వింటే కలిగేటంత ఆశ్చర్యం అనిపించింది!

      ‘ఏమిటలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి పోయారు.. లోపలకు రండి’ గోముగా పలికింది మా ఆవిడ.
ఆ పలికిన తీరు నా ఆశ్చర్యానికి మల్లెలు తురిమాయి ఏమైంది ఈ రోజు..? ఏమిటీ మార్పు? ఇంటి లోపలకు అడుగు పెడుతూనే చుట్టూ చూశాను. అత్తగారు కానీ మామగారు కానీ వచ్చారా.. లేకపోతే మా ఆవిడ అక్క కానీ..! ఏదో బలమైన కారణం ఉండాలి. లేకపోతే మా ఆవిడ ఇలా నవ్వుతూ పలకరించటమే! తుఫాను ముందు వీచే చల్ల గాలిలా, బహుశా ఏదైనా కొనమని అడుగుతుందేమో..!

పండుగకి ఇంకో రెండు వారాలే! అయినా పండుగకి కొనవలసిన వాటికి టెండర్‌ పెట్టడమూ, ఒప్పుకోవటమూ అయిపోయిందిగా! మళ్ళీ, ఇప్పుడు ఇలా..!  నాకు పాలుపోలేదు. కుర్చీలో కూర్చుని షూ లేస్‌ విప్పుకున్నాను.
      వేడి వేడి కాఫీతో వచ్చి నా పక్కనే కూర్చుంది.. ఆవిడ. అది మరో షోకు!
ఆఫీసు నుంచి రాగానే అలా కాఫీ ఇవ్వటం, కాసేపు సరదాగా మాట్లాడుకోవటం మొదలైనవి గత చరిత్ర. ఏదైనా అవసరముంటే చెప్పటం, పొడి పొడిగా మాట్లాడుకోవటం, లేకపోతే ఎవరి పనిలో వాళ్లం ఉండటం నేటి చరిత్ర.
      ‘ఏవండీ.. అలా మాట్లాడకుండా కూర్చున్నారు?’ 
ఎదురుగా కూర్చున్నది మా అవిడేనా అనే సందేహం కలిగింది నాకు. పరిశీలనగా సూక్ష్మంగా చూశాను.. 
      అవిడే! ‘దేవుడా.. ఈ రోజు ఏ సునామీ రాకుండా కాపాడు తండ్రీ’ అని ప్రార్థిస్తూనే అన్నాను..‘చెప్పు?’
‘ఏముంటాయండీ.. మాకు చెప్పడానికి? రోజంతా ఇంట్లో మగ్గేవాళ్ళం. మీరే చెప్పండి..’
      ఒక్క సిప్పు కాఫీ తాగాను.. కాఫీ.. రోజుకన్నా బాగుంది. అయినా ఆ మాట పైకి అనలేదు.

కాసేపు పోయాక మా ఆవిడే చెప్పటం మొదలు పెట్టింది.. ‘మరేమోనండీ.. నాలుగు రోజుల క్రితం మా అక్క.. అదేనండీ.. మా పెద్దమ్మ కూతురు ఫోన్‌ చేసింది..’ 
      రోజుల కొద్ది బయటకు చెప్పకుండా మనసులో దాచి ఉంచిన, చుట్టాల సంగతులు.. వాళ్ళ గొడవలు వగైరాలు నా ముందు వరదగా ప్రవహించాయి ఆనకట్ట పగిలినట్లు. సంవత్సరాల క్రితం గమనించిన ఆమెలోని చలాకీతనం మాట తీరు పునర్జన్మ ఎత్తినందుకు కొంత సంతోషించాను. ఆ మాటలు వినటం పోనూ పోనూ ఇబ్బంది అయినప్పటికీ! 
‘అసలు సంగతి మర్చి పోయానండీ. సాయంత్రం బజ్జీలు వేశానండీ’ హఠాత్తుగా లేచింది. ‘ఆఫీసు నుంచి ఆకలితో వస్తారనీ..’
      ‘ఇదొకటా..’ మనసులో అనుకున్నాను. వైశాఖంలో వాన చినుకులా..’ మా ఆవిడ సాయంత్రం టిఫిన్‌ చేయటం కూడానా! ఇంటికి వచ్చి ఆకలిగా ఉంది అని చెబితే ‘బయట తినలేక పోయారా?’ అని అంటుంది.

‘టైమ్‌ చూశావా? తొమ్మిది దాటుతోంది. ఇప్పుడు బజ్జీలేమిటీ.. అన్నంలో తినేస్తాను’ అంటూ లేచాను. ఫ్రిజ్‌ నుంచి తీసిన చలి విరగని కూరలు తినే బదులు సాయంత్రం చేసిన బజ్జీలు బెటర్‌ అనుకున్నాను.  
      కానీ మరో షాకు ఇచ్చింది మా ఆవిడ. వెచ్చ వెచ్చగా చారూ కూర వడ్డించి! 
‘ఇదేమిటే ఈ రోజు ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నావు.. వేడి వేడి వంటలు..’
      ‘ఏదో, నేను ఎప్పుడూ మీకు వేడి వేడిగా వంటి పెట్టనట్లు!’ ఆవిడ ముఖం ఎర్రబడింది.   
‘పోనీలే.. అయినా ఈ రోజు ఈ మార్పు ఏమిటి? ఏదో ఉంది. కారణం చెప్పు. ఏం టెండర్‌ పెడుతున్నావు?’
      ‘మరీ బాగుంది మీ మాట.. ఏదైనా కొనాలని అడిగే ముందే మీకు నేను సేవ చేస్తున్నట్లు! లేకపోతే చేయట్లేనా?’  
‘అలా అనలేదే నేను. ఇంతకు నా బడ్జెట్‌లో వచ్చే వస్తువే అడగాలి సుమా’ హెచ్చరించాను.  
      పదివేలు పెట్టి పండుగకి పట్టుచీర కొన్నాను. అందువల్ల చీర టెండర్‌ పెట్టదు. మరింకేం అడుగుతుంది? నేను ఆలోచనలో పడ్డాను.. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. పండుగకి బోనస్‌ వస్తే ఒక్క వజ్రపు ముక్కు పుడక కొనమని అడుగుతోంది. ‘ఇంకా బోనస్‌ సంగతి తెలియదే’ అన్నాను.

‘అది కాదండీ..’ ఒక్క నిమిషం మాట్లాడలేదు మా ఆవిడ. ‘ఏమండీ..’ మళ్ళీ గోముగా పిలిచింది.
      ‘చెప్పు..’
‘నా సెల్‌ఫోను పోయిందండీ..’
     ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు. సెల్‌ ఉంటే సెల్‌ చెవికి అంటించుకుని రోజంతా మాట్లాడుతూ గడిపే మా ఆవిడకి సెల్‌  పోయేసరికి భర్తతో మాట్లాడాలని వంట చేయాలని గుర్తుకొచ్చిందన్న మాట! 
      ‘ఎక్కడ పోతుందే.. నువ్వే ఎక్కడైనా పెట్టి మరిచిపోయుంటావు. బాగా వెతుకు.’  
‘అంతా వెతికానండీ..’ మా ఆవిడ దీనంగా నా వైపు చూస్తూ అంది. ‘కనబడలేదండీ..’
      ‘అయితే ఇప్పుడు కొత్త సెల్‌ కొనాలన్న మాట. అంతేగా!’

ఒక్క పూట తిండి లేకపోయినా గడపవచ్చు కాని సెల్‌ ఫోను లేకపోతే నిమిషమైనా గడపలేం కదా ! ఏం చేస్తుంది.. పాపం! సంపాదన లేని ఇల్లాలు! ‘అలాగేలే. కొత్తది కొంటానులే’ అన్నాను.
      ఆవిడ ముఖం మీద చంద్రోదయం అయింది. నేను మనసులో నవ్వుకుంటూ అనుకున్నాను.. ‘ఒక్క నాలుగురోజులు పోయాక ఆఫీసులో దాచిన మా ఆవిడ సెల్‌ ఫోన్‌ ఇంటికి తీసుకు రావాలని, ఒక్క నాలుగు రోజులు ఆవిడ మాటలూ సాన్నిహిత్యాన్ని ఆస్వాదించాలని!
— ఎల్‌. ఆర్‌. స్వామి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement