
మంచిమాట
క్షమాగుణానికి సుఖ శాంతులను చేకూర్చే మహత్తరమైన గుణం ఇమిడి ఉంది. అది తెలుసుకుంటే జీవితమే మారిపోయి ఆనందంగా వుండే అవకాశం ఉంటుంది. క్షమ సఫల జీవితానికి చుక్కాని. క్షమ ఒక ఆయుధం. దాన్ని ధరించితే దుర్జనుడేమీ చేయలేడు. ఈ క్షమాగుణం అనేది ఒక అద్భుతమైనది. ఈ గుణాన్ని ప్రదర్శించటం అంటే కొందరు తమ వ్యక్తిత్వం దెబ్బతింటుందేమో అని అనుకుంటారు. కానీ అది వ్యక్తిత్వాన్ని పెంచేదే కాని తగ్గించేది మాత్రం కాదు.
మనిషి కొన్ని బంధాలకు, అనుబంధాలకు లోబడి ఉండటం సహజం. అందులో తన కుటుంబీకులే గాకుండా బంధువులు, స్నేహితులు, సన్నిహితులు కూడా వుంటారు. అయితే ఈ అనుబంధాలు ఎల్లవేళలా ఒకేలా ఉండవు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక చిన్న తేడా రావొచ్చు. దాంతో అప్పటినుంచి మన మనసుకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు.
ఇప్పడు ఆ సంబంధాలు చెడిపోయినా, ఒకప్పుడు అవి ఆనందాన్ని, ప్రేమను, తృప్తిని ఇచ్చినవే. అసలు ఈ సంబంధాలు ఎలా ఏర్పడినాయని ఆలోచిస్తే, కొన్ని మేధోపరమైనవి, కొన్ని ఆర్ధికపరమైనవి కాగా, కొన్ని వారి ఆలోచనలు, భావాలు కలిస్తే వచ్చినవి అయి ఉంటాయి. ఇష్టాయిష్టాలు ఒకటి కావటంవల్ల కూడా కొన్ని బంధాలు దీర్ఘ కాలం నిలిచే వీలుంది. భౌతిక రూపానికి కూడా కొందరు ఇష్టపడతారు. అలా దగ్గరవుతారు. ఎంతో గొప్పగా సాగుతాయి ఈ సంబంధాలు. కానీ ఎక్కడో చిన్న తేడా వస్తుంది.
వచ్చిన చిక్కల్లా అక్కడే. కొందరు వెంటనే సరిదిద్దుకోగలుగుతారు. మరికొందరికి అది కుదరక పోవచ్చు. ఆ చిన్న తేడా వలన గతంలో ఉన్న అనుబంధంలో తేడా వస్తుంది. అది ఒకోసారి పలకరింపులు కూడా లేని స్థితికి తీసుకువెళ్లి, బంధమే చెడిపోయే స్థితికి పడిపోవచ్చు లేదా అసలు బంధమే తెగిపోయి, ఎడముఖం పెడముఖంగా మారిపోవచ్చు. కానీ తర్వాతి కాలంలో ఎప్పుడో మనకు అనిపించవొచ్చు, అయ్యో ఇదేమిటీ ఇలా చేసుకున్నాము అని, అటువంటి పరిస్థితి రాకుండా ఉంటే బాగుండేది అని. ఇలాంటి భావన తర్వాతి కాలంలో కలుగవొచ్చు.
కొన్ని సందర్భాలలో సంబంధాలను మెరుగుపరచుకోవాలన్నా కుదరని మానసిక స్థితి వెంటాడుతుంది. సంబంధాలు ఇలా చెడిపోవడానికి కారణం అవతలి వారేనని అర్ధం అయినా, సంబంధాలు తిరిగి కొనసాగాలని అనుకుంటే క్షమాగుణం కలిగి ఉండాలి. ప్రతీకారేచ్ఛ లేకపోవడమే సహనం. ఓరిమిని మించిన సద్గుణం మరొకటి లేదు.
ప్రతి ఇద్దరి మధ్య ఎన్నో మంచి చెడులు వారికి మాత్రమే తెలిసినవి ఉండొచ్చు. అవతలివారు చాలాసార్లు మనకు ఎన్నో మంచి చేసిన సందర్భాలు ఉండి ఉండొచ్చు. ఆ మంచిని మర్చిపోయి, మధ్యలో చేసిన తప్పును పట్టుకుని సంబంధాలను చెడగొట్టుకోవడం మంచిదికాదు.
అది సరి అయిన పద్ధతి కాదు. తప్పొప్పులనేవి జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవరైనా చేయొచ్చు. ఎవరి వలన తప్పు జరిగినా రెండవవారు పెద్దమనసుతో క్షమించగలిన గుణం కలిగి ఉండాలి. క్షమించటం అనేది విజయమే కానీ ఓటమి కాదు. క్షమించటంలో చాలా లాభాలున్నాయి. మొదటిది... పాడైపోయిన సంబంధాలను పునరుద్ధరించుకోవడం. రెండవ లాభం మనలోని కోపం, కసి మాయం కావడం. దీనివల్ల మనలో ఉన్న మానసిక ఒత్తిడి దూరమై మనసులోని బరువు ఒక్కసారిగా దిగిపోయినట్లవుతుంది. ఇది ఇక కొత్త అనుభూతిని కలుగ చేస్తుంది.
ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అర్ధం లేని ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టాలి. మనం గతంలో అనుకున్న విషయం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అదేనండీ... అసలు ఆ బంధం తెగకుండావుంటే బాగుండేదని అనుకున్న విషయం. ఆ ఆలోచన రాగానే, తిరిగి మనలను గతంలోకి తీసుకువెళుతుంది. కొందరు ఇదంతా కర్మ ఫలం అంటారు. అయితే ఇక్కడ ఆ కోణంలోకూడా ఆలోచిస్తే, ఇతరుల వలన మనం పడిన కష్టాల ఆలోచన వదిలి, మనం ఇతరులకు చేసిన, కలిగించిన ఇబ్బందుల ఆలోచన మొదలవుతుంది. ఇక క్షమించడం మనందరం నేర్చుకుందాం. హాయిగా జీవిద్దాం.
– డా. పులివర్తి కృష్ణమూర్తి