ఇరాన్‌పై యుద్ధమేఘాలు! | USA deploying more fighter jets to West Asia | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై యుద్ధమేఘాలు!

Jan 24 2026 4:43 AM | Updated on Jan 24 2026 4:43 AM

USA deploying more fighter jets to West Asia

భారీగా అమెరికా మోహరింపులు

పశ్చిమాసియాకు తరలుతున్న సైన్యం

నౌకలు, యుద్ధ విమానాలు,  జలాంతర్గాములు

స్వయంగా ధ్రువీకరించిన ట్రంప్‌

వాషింగ్టన్‌: ఇరాన్‌పై యుద్ధానికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించుకున్నారా? పాలస్తీనాలో యుద్ధానికి తెర దించేందుకు ‘శాంతి బోర్డు’ ఏర్పాటును ప్రకటించిన మర్నాడే పశ్చిమా సియాను మరోసారి రణరంగంగా మార్చ బోతున్నారా? ఆ దిశగా సర్వసన్నాహాలూ శరవేగంగా జరిగిపోతున్నాయా? జరుగుతున్న పరిణామాలు, ట్రంప్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. 

అమెరికా యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు భారీ స్థాయిలో పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. వాటితో పాటు పదాతి సైన్యాన్ని కూడా అమెరికా మోహరిస్తోంది. ఇజ్రాయెల్‌ కూడా ఐరన్‌డోమ్‌తో పాటు తన రక్షణ వ్యవస్థలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పటిష్టపరుచుకుంటోంది! దాంతో పశ్చిమాసియాపై మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నట్టే కనిపిస్తోంది.
  
అరేబియా దిశగా నౌకలు
యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలతో కూడిన భారీ సైనిక పటాలాన్ని ఇరాన్‌ దిశగా అమెరికా తరలిస్తోంది! ఇటీవలి దాకా దక్షిణ చైనా సముద్రంలో లంగరేసిన యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ విమానవాహక యుద్ధనౌక అరేబియా సముద్రం కేసి కదులుతోంది. అది జనవరి 20 నాటికే మలక్కా జలసంధిని దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. 

ఆ తర్వాత నౌక తన ఆటోమాటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆఫ్‌ చేయడం గమనార్హం. దాంతో ప్రస్తుతం అదెక్కడున్నదీ గుర్తించే వీల్లేకుండా పోయింది. గంటకు 20 నాటికల్‌ మైళ్లకు మించిన వేగంతో ప్రయాణిస్తున్న నేపథ్యంలో శుక్రవారానికే ఆ నౌక అరేబియా సముద్రంలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. ఇరాన్‌లోని లక్ష్యాలను ఢీకొట్టాలంటే అది ఉత్తర అరేబియా సముద్రంలో లంగరు వేయాల్సి ఉంటుంది. 

పలు డిస్ట్రాయర్‌ నౌకలు, అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గాములు, యుద్ధ విమానాలు అబ్రహం లింకన్‌తో పాటు తరలి వెళ్తున్నాయి. దానిపై కనీసం 60 దాకా అత్యాధునిక ఎఫ్‌/ఏ–18 యుద్ధ విమానాలున్నట్టు సమాచారం. రీ ఫ్యూయలింగ్‌ అవసరం లేకుండా ఏకంగా 2,300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేరగల సామర్థ్యం వాటి సొంతం! అయినా ముందుజాగ్రత్తగా యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే కేసీ–135 ఏరియల్‌ రీఫ్యూయలర్లను కూడా అమెరికా రంగంలోకి దించుతోంది! ఇక ఐఎస్‌ఎస్‌ లింకన్‌కు తోడుగా వెళ్తున్న జలాంతర్గాముల్లో వీటితో పాటు ఒహాయో శ్రేణికి చెందిన అత్యాధునిక గైడెడ్‌ క్షిపణులుండటం విశేషం. 

వాటిలో ఒక్కో జలాంతర్గామికీ కనీసం 154 తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యముంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధంగా ఉన్నట్టే. వీటితోపాటు ఎఫ్‌–15ఈ స్ట్రైక్‌ ఈగిల్‌ యుద్ధ విమానాలు కూడా ఇప్పటికే పశ్చిమాసియాలోని పలు సైనిక స్థావరాల్లో మోహరించాయి. ఒక విమానం లాండవుతున్న ఫొటోలను యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇవేగాక థాడ్, పాట్రియాట్‌ వంటి అదనపు క్షిపణి విధ్వంసక వ్యవస్థలను పశ్చిమాసియా పొడవునా, ముఖ్యంగా ఇజ్రాయెల్, ఖతర్‌లోని అమెరికా సైనిక స్థావరాల్లో మోహరిస్తున్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది.
  
సీ–17 రవాణా విమానాలూ...
అమెరికాకు చెందిన అత్యంత భారీ సీ–17 సైనిక రవాణా విమానాలు కూడా మూడు రోజులుగా జోర్డాన్‌లోని మఫ్రాక్‌ అల్‌ ఖవాజా వైమానిక స్థావరం నుంచి ఇరాన్‌ సమీపంలోని అమెరికా బేస్‌లకు చక్కర్లు కొడుతున్నాయి. ఇరాన్‌ దాడిని కాచుకునేందుకు అవి ఇజ్రాయెల్‌కు పాట్రియాట్‌–3 శ్రేణి క్షిపణులను సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు. తమపై దాడి అంటూ జరిగితే ముందుగా ఇజ్రాయెల్‌ భరతం పడతామని ఇరాన్‌ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మిత్ర దేశం భద్రత విషయంలో అమెరికా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇవేగాక అవసరాన్ని బట్టి డీగో గార్షియా దీవిలోని వైమానిక స్థావరం నుంచి బీ2 స్టెల్త్‌ బాంబర్లను కూడా అప్పటికప్పుడు రంగంలోకి దించాలని అమెరికా సైన్యం నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు! లేదంటే నేరుగా అమెరికా నుంచి కూడా వాటిని ఇరాన్‌ దిశగా తరలించే అవకాశముంది.

ఇరాన్‌పై డేగకన్ను: ట్రంప్‌
అతి పెద్ద అమెరికా సైనిక పటాలం ఇరాన్‌కేసి కదులుతోందని ట్రంప్‌ విస్పష్టంగా ప్రకటించారు. ‘‘మా కీలక యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు గల్ఫ్‌కేసి దూసుకెళ్తున్నాయి. వాటన్నింటి దృష్టీ ఇరాన్‌ మీదే ఉంది’’ అని స్పష్టం చేశారు. గురువారం దావోస్‌ నుంచి వాషింగ్టన్‌ తిరిగి వెళ్తూ ఎయిర్‌ఫోర్స్‌వన్‌ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికిప్పుడు ‘పెద్ద నిర్ణయం’ తీసుకునే ఉద్దేశం నాకేమీ లేదు. అయితే ఇరాన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాం. బహుశా ఈసారి ఆ దేశంపై మా సైనిక శక్తియుక్తులను ప్రయోగించాల్సిన అవసరం రాకపోవచ్చేమో. కానీ అక్కడి పరిస్థితిని డేగకళ్లతో గమనిస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో!’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్‌వి పచ్చి అబద్ధాలు
దుబాయ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘ఉరిశిక్షల రద్దు’ ప్రకటనను ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. ఇటీవలి భారీ నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న వందలాది మందికి ఇరాన్‌ ఉరిశిక్షలు విధించినట్టు వార్తలు రావడం తెలిసిందే. అలాగైతే సైనిక చర్య తప్పదన్న తన హెచ్చరకల వల్ల కనీసం 840 ఉరిశిక్షలను ఇరాన్‌ రద్దు చేసిందని గురువారం కూడా ట్రంప్‌ ప్రకటించుకున్నారు. అది పచ్చి అబద్ధమని ఇరాన్‌ న్యాయాధికారి మొహమ్మద్‌ మొవాహెదీ అన్నారు. ‘అసలు ఆ సంఖ్య ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మా న్యాయవ్యవస్థ అలాంటి నిర్ణయమే తీసుకోలేదు’’ అని ఆయన శుక్రవారం చెప్పుకొచ్చారు. మరోవైపు, భారీ నిరసనల్లో మరణించిన వారి సంఖ్యను 3,117గా ఇరాన్‌ తాజాగా పేర్కొంది. కానీ 5,000 మందికి పైగా మరణించినట్టు హక్కుల సంఘాలు తెలిపాయి.

వాణిజ్యం ఛిన్నాభిన్నమే!
ఇరాన్‌పై అమెరికా యుద్ధానికే దిగితే ప్రపంచ వాణిజ్యం అతలాకుతలం కావడం ఖాయం. ముఖ్యంగా చాలా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోనుంది. ఇరాన్‌ నియంత్రణలోని హార్మూజ్‌ జలసంధి గుండా రోజుకు ఏకంగా 2 కోట్ల బ్యారెళ్ల మేరకు చమురు రవాణా జరుగుతుంది. యుద్ధ పరిస్థితే వస్తే దాన్ని పూర్తిగా నిలిపేయవచ్చు. అంతేకాదు, ఇరాన్‌ దగ్గర భారీ పరిమాణంలో ఉన్న యురేనియం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. దాని వద్ద 10 అణుబాంబుల తయారీకి సరిపోయే 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టు అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement